సింధూ నీరు చుక్క పోకుండా మోడీ సర్కార్ బిగ్ ప్లాన్.. పాకిస్తాన్ కు దబిడదిబిడే

భారత్-పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న అత్యంత కీలకమైన సింధు జలాల ఒప్పందంపై మరోసారి తీవ్రమైన చర్చ మొదలైంది.

Update: 2026-06-10 04:54 GMT

భారత్-పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న అత్యంత కీలకమైన సింధు జలాల ఒప్పందంపై మరోసారి తీవ్రమైన చర్చ మొదలైంది. రానున్న రోజుల్లో సింధు నదీ వ్యవస్థ నుంచి పాకిస్తాన్‌కు ఒక్క చుక్క నీరు కూడా వెళ్లకుండా భారత్ గట్టి చర్యలు చేపడుతోందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇరు దేశాల్లోనే కాకుండా అంతర్జాతీయంగా సంచలనంగా మారాయి. దేశ ప్రయోజనాలే పరమావధిగా మోదీ సర్కార్ అడుగులు వేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

తాత్కాలిక బ్రేక్.. తెరపైకి కేంద్రం వ్యూహం

ఇటీవల జరిగిన ఒక కీలక కార్యక్రమంలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ మాట్లాడుతూ సింధు జలాల ఒప్పందాన్ని భారత్ పూర్తిగా రద్దు చేయలేదని.. అయితే ప్రస్తుతం దాని అమలును తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారు. భారత భూభాగం నుంచి ప్రవహించే నీరు సరిహద్దు దాటి పాకిస్తాన్‌కు వెళ్లకుండా మన దేశంలోనే నిల్వ చేసేందుకు తగిన మార్గాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోందని వెల్లడించారు. ఈ ప్రాజెక్టును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షిస్తుండగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దీనిపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిని బట్టే ఈ వ్యవహారంలో మోదీ సర్కార్ ఎంత సీరియస్‌గా ఉందో అర్థం చేసుకోవచ్చు.

అసలేంటి ఈ సింధు జలాల ఒప్పందం?

సింధు నదీ వ్యవస్థలోని ప్రధాన నదులైన జీలం, చెనాబ్, సట్లెజ్, బియాస్, రావి జలాల పంపిణీకి సంబంధించి 1960లో భారత్-పాకిస్తాన్ మధ్య ఈ చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన జల ఒప్పందాల్లో ఒకటిగా దీనికి గుర్తింపు ఉంది. యుద్ధాలు జరిగినప్పటికీ ఈ ఒప్పందం కొనసాగింది. అయితే గత కొన్నేళ్లుగా సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలు, పాక్ ప్రేరేపిత దాడులు పెరిగిపోవడంతో "రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు" అంటూ భారత్ తన వైఖరిని కఠినతరం చేస్తూ వస్తోంది.

భారత్ యాక్షన్ ప్లాన్ ఏంటి?

తన వాటాకు వచ్చే నీటిని.. అలాగే పశ్చిమ నదులపై భారత్‌కు ఉన్న కొన్ని పరిమిత హక్కులను పూర్తిస్థాయిలో వాడుకోవాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా కొత్త రిజర్వాయర్ల నిర్మిస్తోంది. పాకిస్తాన్‌కు వృథాగా పోయే నీటిని అడ్డుకోవడానికి సరిహద్దు ప్రాంతాల్లో భారీ జలాశయాల ఏర్పాటు చేస్తోంది.. నీటి మళ్లింపు ప్రాజెక్టుల ద్వారా వ్యూహాత్మక కాలువల ద్వారా నీటిని దేశంలోని ఎండిపోయిన ప్రాంతాలకు తరలిస్తోంది. వ్యవసాయం, విద్యుత్ ఉత్పత్తికి వాడుతోంది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ పరివాహక ప్రాంతాల్లో సాగునీరు, తాగునీటి అవసరాలు తీర్చడంతో పాటు విద్యుత్ ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది.

పాకిస్తాన్‌లో వణుకు.. అంతర్జాతీయంగా ఉత్కంఠ

కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చేసిన ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్‌లో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్, వ్యవసాయం కోసం సింధు నదీ జలాలపైనే పూర్తిగా ఆధారపడింది. ఒకవేళ భారత్ గనుక నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటే పాక్‌లోని పలు రాష్ట్రాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మరోవైపు దేశ భద్రత, జాతీయ ప్రయోజనాల విషయంలో మోదీ ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదనే బలమైన సంకేతాలు ఈ నిర్ణయం ద్వారా స్పష్టమవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ సింధు జలాల అంశం భారత్-పాక్ దౌత్య సంబంధాలను ఏ మలుపు తిప్పుతుందోనని అంతర్జాతీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.

Tags:    

Similar News