ఎమర్జెన్సీ పెట్టిన ఇందిరకు అండగా దక్షిణాది !
అలా దక్షిణాదిన మొత్తం నాలుగు రాష్ట్రాలలో కలిపి 129 ఎంపీ సీట్లు ఉంటే అందులో 121 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుని జయపతాక ఎగురవేసింది.;
దేశంలో ఎమర్జెన్సీని ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ప్రవేశపెట్టారు. 1975 జూన్ 25 అర్ధరాత్రిన అత్యవసర పరిస్థితి అని ఆమె ప్రవేశపెట్టారు. దాంతో దేశంలో మొత్తం కేంద్ర ఆదేశాలలోకి వెళ్ళిపోయింది. ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వాలు వరసబెట్టి రద్దు అయ్యాయి. అంతే కాదు విపక్ష నేతలు హేమాహేమీలు అంతా జైలు పాలు అయ్యారు.
ఒకరా ఇద్దరా లక్షలాది మందిని జైళ్ళలో పెట్టారు. మీడియా మీద ఆంక్షలు పెట్టారు. అలాగే ఆనాడు కుటుంబ నియంత్రణను బలవంతంగా అమలు చేశారు. ఇక మాట్లాడితే జైలే అన్నట్లుగా పరిస్థితి ఉండేది. ఇలా ఏకంగా 21 నెలల పాటు దేశంలో ఎమర్జెన్సీ విధించాక 1977 మార్చిలో లోక్ సభకు హడావుడిగా శ్రీమతి ఇందిరాగాంధీ ఎన్నికలను ప్రకటించారు.
నిజానికి ఆమె 1971లో రెండోసారి అధికారంలోకి వచ్చారు. ఆమె పదవీకాలం రాజ్యాంగం ప్రకారం చూస్తే కేవలం అయిదేళ్ళు మాత్రమే. అంటే 1976తో పూర్తి కావాలి. కానీ మరో ఏడాది ఆమె పొడిగించుకున్నారు. ఎమర్జెన్సీ అప్పటికే అమలులో ఉండడం వల్ల ఆమె నిర్ణయానికి ఎదురు లేకుండా పోయింది.
ఈ నేపథ్యంలో మరోసారి పదవీకాలం పొడిగించాలనుకున్నా అది కుదిరేది కాదు. ఇక పార్లమెంట్ రద్దు చేయడమే అనివార్యంగా ఉంది. అలా చేస్తే కనుక ఆమె కేర్ టేకర్ పీఎం అవుతారు. అందుకే తాను అధికారంలో ఉండగానే ఎన్నికలు జరిపించాలని అనుకున్నారు. పైగా విపక్ష నేతలు అంతా దాదాపుగా జైలులో ఉన్నారు.
వారికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా తొందరగా ఎన్నికలు పెడితే తాను అధికారంలోకి వస్తాను అనుకున్నారు. పైగా ఆమె చేయించుకున్న సర్వేలు అన్నీ అదే సరైన సమయం అని చెప్పాయని చెబుతారు. దాంతో ఆమె మార్చిలో ఎన్నికలు పెడితే విపక్షాలకు ఏ మాత్రం ప్రచారానికి అవకాశం లేకపోయినా ఉత్తరాది అంతా కాంగ్రెస్ ని వ్యతిరేకించింది.
అలా దేశంలోని హిందీ బెల్ట్ అనదగిన యూపీ బీహార్, రాజస్థాన్ మధ్యప్రదేశ్, ఢిల్లీ వంటి చోట్ల జనతా పార్టీ ప్రభంజనం వీచింది. పశ్చిమ బెంగాల్ లో సైతం జనతా ప్రభావం కనిపించింది. ఇక మహారాష్ట్ర గుజరాత్ వంటి చోట్ల హోరా హోరీ పోరు సాగినా జనతాకే మొగ్గు కనిపించింది.
అయితే దక్షిణాదిన మాత్రం కాంగ్రెస్ వేవ్ ఎప్పటి మాదిరిగానే కొనసాగింది. ఆనాడు ఉమ్మడి ఏపీలో మొత్తం 42 ఎంపీ సీట్లు ఉంటే ఒక్క నంద్యాలలో జనతా పార్టీ తరఫున నీలం సంజీవరెడ్డి తప్ప మిగిలిన అన్ని చోట్లా కాంగ్రెస్ విజయ దుందుభి మోగించింది. అలాగే తమిళనాడులో మొత్తం 39 అసెంబ్లీ సీట్లకు గానూ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ ఫ్రంట్ 34 సీట్లు గెలుచుకుంది. కర్ణాటకలో ఉన్న 28 ఎంపీ సీట్లకు 26 కాంగ్రెస్ గెలిచింది. కేరళలో 20కి 20 సీట్లూ కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్ గెలుచుకుంది.
అలా దక్షిణాదిన మొత్తం నాలుగు రాష్ట్రాలలో కలిపి 129 ఎంపీ సీట్లు ఉంటే అందులో 121 సీట్లను కాంగ్రెస్ గెలుచుకుని జయపతాక ఎగురవేసింది. అంటే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రభావం అయితే దక్షిణ భారత దేశంలో పెద్దగా పడలేదు అని ఈ ఫలితాలు నిరూపించాయి. హిందీ రాష్ట్రాలు జనతాకు పట్టం కడితే సౌత్ ఇండియా మాత్రం కాంగ్రెస్ కి కంచుకోటగా మారింది.
దాంతో ఇందిరాగాంధీకి ఎమర్జెన్సీ విధించినా ఘోర పరాజయం అయితే ఎదురుకాలేదు. కాంగ్రెస్ పార్టీ సొంతంగా 150 నుంచి 160 దాకా ఎంపీ సీట్లు గెలుచుకుంది. మిత్రులతో కలుపుకుని ఆ సంఖ్య 180 దాకా చేరింది. ఇక జనతా పార్టీకి 295 సీట్లు లభించాయి. ఇలా ఆనాడు ఎమర్జెన్సీ మీద దేశం మొత్తం ఒకే తీరున స్పందించలేదు అనడానికి ఆ ఫలితాలే ఉదాహరణగా మారాయి.
అంతే కాదు ఆ తరువాత ఉమ్మడి ఏపీ కర్ణాటకలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ బ్రహ్మాండమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అలాగే కేరళ 1977లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టడం విశేషం. ఇక తమిళనాడులోనూ కాంగ్రెస్ అన్నాడీఎంకే కూటమి విజయం సాధించింది. అలా శ్రీమతి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ మీద ఉత్తరాది ఆగ్రహం చూపిస్తే దక్షిణాది మాత్రం ఆమెకు అండగా నిలబడడం ఒక రాజకీయ విశేషంగా అంతా చూస్తారు.