'ఇండిగో' ఒత్తిడికి కేంద్రం వెనక్కి తగ్గాల్సి వచ్చిందిగా!
అవును.. దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ముదురు తెలివికి పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది.;
అవును.. దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ ముదురు తెలివికి పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కారణం..వారు తీసుకొచ్చిన కొత్త నిబంధనల్ని అమలు చేస్తే.. ఇండిగో లాభాల మీద ప్రభావం పడుతుంది. అందుకు సుముఖంగా లేని ఇండిగో తన ముదురు తెలివిని ప్రదర్శించిందన్న విమర్శ బలంగా వినిపిస్తోంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ వాదనకు బలాన్ని చేకూరేలా ఉన్నాయని చెబుతున్నారు. అత్యంత కీలకమైన అంశం ఏమంటే.. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ నిబంధనల్ని పాటించాల్సిన ఇండిగో.. సరిగ్గా దాని అమలు తేదీ వచ్చే వరకు అందుకు తగ్గట్లు సిద్ధం కాకపోవటం దేనికి నిదర్శనం?
నిజానికి ఈ కొత్త నిబంధనలు రాత్రికి రాత్రి తెచ్చినవి కావన్నది మర్చిపోకూడదు. దాదాపు ఏడాది క్రితమే కొత్త నిబంధనల్ని ఖరారు చేసి.. దశల వారీగా అమల్లోకి తీసుకువచ్చేలా ప్లాన్ చేసింది. ఈ కొత్త నిబంధనల్లో కీలకం.. పైలెట్లు.. సిబ్బందికి తగిన విశ్రాంతి ఇవ్వాల్సి ఉండటమే. ప్రయాణికుల భద్రతకు పెద్ద పీట వేస్తూ తీసుకొచ్చిన కొత్త నిబంధనల్ని అమలు చేసే విషయంలో ఇండిగో విఫలమైంది.
కొత్త నిబంధనల్ని అమలు చేసేందుకు అవసరమైనట్లుగా పైలట్లు.. సిబ్బందిని నియమించుకోలేదు. అదే సమయంలో ఇప్పటికిప్పుడు సమకూర్చుకోవటం సాధ్యం కాని పరిస్థితి. నిజానికి కొత్త నిబంధనల్ని డీజీసీఏ 2024 జనవరిలోనే జారీచేసింది. అంటే.. కొత్త నిబంధనల అమలుకు దగ్గర దగ్గర రెండేళ్లు సమయం ఇచ్చినట్లుగా చెప్పాలి. రెండో దశ నిబంధనలు ఈ నవంబరు ఒకటి నుంచి పాటించాల్సి ఉంది. ఈ నిబంధనల్లో కీలకమైనది పైలెట్లు.. కేబిన్ సిబ్బంది అలసిపోకుండా రెస్టు ఇవ్వాల్సి ఉండటం.. రాత్రి డ్యూటీలు ఒత్తిడిని తగ్గించేలా ఉండటం గమనార్హం.
మిగిలిన విమానయాన సంస్థలతో పోలిస్తే.. ఇండిగో తన సిబ్బంది చేత ఎంతో ఎక్కువ గంటలు పని చేయిస్తుందని చెబుతారు.నిబందనల్ని పక్కాగా అమలు చేయాల్సి రావటంతో.. సిబ్బందికొరతను తీవ్రంగా ఎదుర్కొన్న పరిస్థితి. దీంతో.. తాజా సంక్షోభం చోటు చేసుకుంది. దేశంలో ఇతర విమానయాన సంస్థలకు ఎదురు కాని సమస్య.. ఒక్క ఇండిగోకే ఎందుకు ఎదురైంది? అంటే.. ఇండిగో నిబంధనల్ని ఫాటించేందుకు వీలుగా సిద్ధం కాకపోవటమే.
ఇప్పటికే దేశీయ విమానయానంలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శిస్తూజ. 64 శాతం మార్కెట్ వాటా ఉన్న ఇండిగో.. నిబంధనల్ని పక్కాగా అమలు వేళ చేతులెత్తేసిన నేపథ్యంలో తాజా సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రయాణికులు తీవ్ర అవస్థలకు గురవుతున్న వేళ.. దిద్దుబాటు చర్యలకు ఫిబ్రవరి వరకు సమయం పట్టే వీలుంది. దీంతో.. పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ కాస్త వెనక్కి తగ్గి.. కొత్త నిబంధనల అమలును తాత్కాలికంగా నిలిపేసేలా నిర్ణయం తీసుకుంది. దీంతో.. ఇండిగో అనుకున్నది సాధించినట్లుగా చెబుతున్నారు. అయితే.. ఈ తీరును కేంద్రం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై విచారణకు ఆదేశించటం ద్వారా.. ఇన్ని వేల మంది ప్రయాణికులను ఇబ్బంది పెట్టిన ఇండిగోకు రానున్న రోజుల్లో తగిన చర్యలు ఖాయమన్న మాట వినిపిస్తుంది. మరేం జరుగుతుందో చూడాలి.