ఇండిగో ఫ్లైట్ లో 'మేడే కాల్'... అసలేంజరిగింది?
విమాన ప్రయాణాలకు సంబంధించి ఇటీవల వరుస ఘటనల్లో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే.;
విమాన ప్రయాణాలకు సంబంధించి ఇటీవల వరుస ఘటనల్లో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా.. జూన్ 12 న అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తోన్న ఎయిరిండియా విమానానికి జరిగిన ఘోర ప్రమాదం అనంతరం.. విమానాలకు సంబంధించిన ఏ విషయమైనా వైరల్ గా మారుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానానికి ప్రమాదం తప్పింది. 'మేడే కాల్' కాపాడేసింది.
అవును... ఇటీవల కాలంలో విమానాలకు సంబంధించిన విషయాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న సంగతి తెలిసిందే. ప్రధానంగా.. 'విమానంలో సాంకేతిక లోపం' అనే విషయం కనిపిస్తే వణుకు పుడుతోన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో... ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన ఓ విమానానికి తాజాగా ప్రమాదం తప్పింది. 'మేడే కాల్'తో సురక్షితంగా బయటపడింది. గౌహతి నుంచి చెన్నైకి వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాళ్లోకి వెళ్తే... గౌహతి నుంచి చెన్నైకి ఇండిగో విమానం బయలుదేరింది. విమాన డేటా ప్రకారం ఇది రాత్రి 7:45కి చెన్నై చేరుకోవాల్సి ఉంది. అయితే... విమానం టేకాఫ్ అయిన కాసేపటికి అందులో ఇంధనం తక్కువగా ఉండడాన్ని పైలట్ గుర్తించిన పైలట్ వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి 'మేడే' సందేశం పంపించారు. దీంతో.. తక్షణమే బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు!
దీంతో విమానానికి పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఈ ఘటన గురువారమే చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో... ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నల్లు తెలుస్తోంది. అయితే... దీనిపై ఇండిగో అధికారిక ప్రకటన చేయలేదని తెలుస్తోంది!
కాగా... అత్యవసర ప్రమాద పరిస్థితిని ఎదుర్కొంటున్నామనే విషయాన్ని రేడియో కమ్యునికేషన్ ద్వారా సమీపంలోని ఏటీసీకి తెలియజేయడానికి చేసేదే "మేడే కాల్" అనే సంగతి తెలిసిందే! ఆపదలో ఉన్నామని, తక్షణమే సాయం అవసరమని విజ్ఞప్తి చేసేందుకు దీన్ని ఉపయోగిస్తారు.