మరో'సారీ' ఇండిగో సీఈవో కీలక ప్రకటన!

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ రోజు ఎల్బర్స్ ను పిలిపించి, ఎయిర్ లైన్ కార్యచరణ స్థితి గురించి అడిగారని తెలుస్తోంది.;

Update: 2025-12-09 14:19 GMT

దేశంలో గత కొన్ని రోజులుగా ఇండిగో విమాన సంక్షోభంపై తీవ్ర చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఈ విషయం పార్లమెంట్ నూ కుదిపేసిన పరిస్థితి. అంతకంటే ముందు వేలాది మంది ప్రయాణికుల షెడ్యూల్ ను తలకిందులు చేసి, వారి పరిస్థితిని అతలాకుతలం చేసిన స్థితి! ఈ నేపథ్యంలో ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ 'ఎక్స్' వేదికగా ఓ వీడియో విడుదల చేశారు.

అవును... 2006లో ప్రారంభమైనప్పటి నుంచీ ఇప్పుడు అత్యంత దారుణమైన కార్యచరణ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఇండిగో.. సుమారు వారం రోజుల పాట గందరగోళం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా వందలాది విమానాలు రద్దు చేయబడి, వేలాది మంది ప్రయాణికులు నరకం చూసిన పరిస్థితి! ఈ సమయంలో తమ నెట్ వర్క్ అంతటా కార్యకలాపాలను పునరుద్ధరించినట్లు తెలిపింది.

ఈ సందర్భంగా తాజాగా తమ నెట్ వర్క్ లో కార్యకలాపాలను పునరుద్ధరించామని ఇండిగో తెలిపింది. ఇదే క్రమంలో విమానాశ్రయాలలో చిక్కుకున్న సుమారు అన్ని బ్యాగులను తమ కస్టమర్లకు డెలివరీ చేశామని.. మిగిలిన వాటిని వీలైనంత త్వరగా డెలివరీ చేయనున్నామని.. సకాలంలో మా పనితీరు సాధారణ స్థాయికి చేరుకుందని ఎయిర్ లైన్ తెలిపింది. రద్దు తర్వాత రీఫండ్ విధానాన్ని ఆటోమెటెడ్ చేసినట్లు తెలిపింది.

ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్ మాట్లాడుతూ...!:

ఈ సందర్భంగా ఓ వీడియో సందేశం విడుదల చేసిన ఇండిగో సీఈఓ... ఇండిగో కార్యకలాపాలు స్థిరంగా ఉన్నాయని.. పెద్ద కార్యచరణ అంతరాయం సంభవించినప్పుడు మేము మిమ్మల్ని నిరాశపరిచామని.. అందుకు మేము చింతిస్తున్నామని తెలిపారు. ఆ సమయంలో మీలో వేలాది మంది ప్రయాణించలేకపోయారని.. మేము దాని గురించి తీవ్రంగా క్షమాపణలు కోరుతున్నామని అన్నారు.

ఇదే క్రమంలో... ఇండిగో నెట్ వర్క్ విమానాల పునరుద్ధరణ యుద్ధ ప్రాతిపదికన జరుగుతోందని చెప్పిన పీటర్ ఎల్బర్స్... డిసెంబర్ 5న తాము 700 విమానాలు మాత్రమే నడపగా ఆ తర్వాత డిసెంబర్ 6న 1,500.. డిసెంబర్ 7న 1,650.. డిసెంబర్ 8న 1,800.. నేడు (డిసెంబర్ 9)న 1,800 కంటే ఎక్కువ విమానాలు నడపగలిగామని అన్నారు.

ఇదే సమయంలో... తాము ప్రభుత్వంతో పూర్తి సహకారంతో పని చేస్తూనే ఉన్నామని చెప్పిన ఇండిగో సీఈఓ... ప్రస్తుతం తక్షణ సంక్షోభాన్ని పరిష్కరించామని.. అయితే, అందుకు దారి తీసిన విషయాలు, వాటి నుంచి నేర్చుకోవాల్సిన పాథాలపైనా అంతర్గతంగా దృష్టి పెట్టడం ప్రారంభించామని అన్నారు.

ఇండిగోకు విమానయాన శాఖ మంత్రి స్ట్రాంగ్ మెసేజ్!:

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ రోజు ఎల్బర్స్ ను పిలిపించి, ఎయిర్ లైన్ కార్యచరణ స్థితి గురించి అడిగారని తెలుస్తోంది. ఆ భేటీలో ప్రయాణికుల సేఫ్టీ, అమౌంట్ రీఫండ్, ప్రయాణికుల లగేజ్ తిరిగి ఇచ్చే స్థితి గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

మరోవైపు.. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు.. లోక్ సభలో స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇండిగో యాజమాన్యానికి డీజీసీఏ ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చిందని.. దర్యాప్తు కూడా ప్రారంభమైందని తెలిపారు. ఈ సందర్భంగా దర్యాప్తులో వెల్లడైన వివరాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఈ సందర్భంగా... ఎంత పెద్ద విమానయాన సంస్థ అయినప్పటికీ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే సహించేది లేదని.. పౌర విమానయానంలో భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన వెల్లడించారు.

నెట్టింట కొత్త చర్చ!:

దేశంలో ఇండిగో సంక్షోభం తీవ్ర చర్చనీయాంశంగా మారిన వేళ.. దేశ విమానయాన నెట్ వర్క్ లో ఇండిగో ఆదిపత్యం చర్చనీయాంశంగా మారిందని అంటున్నారు. ఈ సమయంలోనే ఒలిగోపోలి, డ్యూపోలి వంటి విషయాలు తెరపైకి వస్తున్నాయి. అందుకు కారణం.. భారతదేశ దేశీయ మార్కెట్లో 64.2 శాతం ఇండిగో నియంత్రణలో ఉండటమే!

ఇలా వ్యవస్థలో ఎక్కువ భాగం ఒకే విమానయాన సంస్థపై ఆధారపడి ఉన్నప్పుడు.. దాని సమస్యలు అందరి సమస్యగా మారతాయనే విషయం ఇండిగో సంక్షోభంతో స్పష్టమైందని అంటున్నారు. ఇంత పెద్ద జనాభా ఉన్న దేశంలో అంత పెద్ద బాధ్యతను కలిగి ఉన్న సంస్థ ఇంత సంక్షోభం తర్వాత సారీ చెప్పడం కాకుండా.. సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు.

ఈ సంస్థ మార్కెట్లో అంత పెద్ద వాటాను కలిగి ఉండటం వల్ల.. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలనుకున్నా, అంత సాహసం చేయలేవని, అది ప్రాక్టికల్ గా సాధ్యం కాదని ఈ సందర్భంగా పలువురు కామెంట్లు చేస్తున్నారు!

Tags:    

Similar News