‘దివ్యాస్త్ర’ పరీక్ష వేళ.. బరి తెగించిన చైనా!
భారత్ తాజాగా ఒకే క్షిపణితో బహుళ లక్ష్యాలను ఛేదించే దివ్యాస్త్ర పరీక్షను విజయవంతంగా పరీక్షించిన సంగతి తెలిసిందే.;
భారత్ తాజాగా ఒకే క్షిపణితో బహుళ లక్ష్యాలను ఛేదించే దివ్యాస్త్ర పరీక్షను విజయవంతంగా పరీక్షించిన సంగతి తెలిసిందే. తద్వారా ఎంఐఆర్‌వీ (మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్) టెక్నాలజీని కలిగి ఉన్న అతి తక్కువ దేశాల సరసన చేరింది. శత్రు దేశాల రాడార్లను, గగనతల రక్షణ వ్యవస్థలకు దుర్భేద్యంగా దివ్యాస్త్ర నిలుస్తుందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
కాగా భారత్ దివ్యాస్త్ర పరీక్షించిన వేళ చైనా బరితెగించింది. చైనా నిఘా నౌక ఒకటి బంగాళాఖాతంలో తిష్టవేసి భారత్ క్షిపణి పరీక్షను నిశితంగా పరిశీలించిందని అంటున్నారు. శత్రు దేశాల రాడార్లు, గగనతల రక్షణ వ్యవస్థలకు దుర్భేద్యమైన ‘మిషన్ దివ్యాస్త్ర’ పరీక్షను చైనా నిఘా నౌక అత్యంత జాగ్రత్తగా పరిశీలించిందని సమాచారం.
దివ్యాస్త్ర పరీక్షకు కొన్ని వారాల ముందే బీజింగ్ నుంచి బంగాళాఖాతం దిశగా చైనా పరిశోధక నౌక బయలుదేరిన సంగతి తెలిసిందే. గతంలో శ్రీలంకలోని హంబన్ టోట నౌకాశ్రయంతో చైనా నిఘా నౌక లంగరు వేసింది. అప్పుడు భారత్ తన నిరసనను శ్రీలంకకు తెలియజేసింది. అలాగే కొద్ది రోజుల క్రితం చైనాకే చెందిన మరో నిఘా నౌక హిందూ మహాసముద్రంలో మాల్దీవుల్లో లంగరు వేసింది. భారత్ కు సమీపంలోని దేశాల్లో తిష్టవేసి భారత నౌకా నిర్మాణ కేంద్రాలు, అణుధార్మిక రియాక్టర్లు, క్షిపణ పరీక్ష కేంద్రాలపై చైనా నిఘా నౌకలు నిఘా వేస్తున్నాయి.
ఈ క్రమంలో ఫిబ్రవరి 23వ తేదీన చైనాలోని క్వాంగ్ డావ్ నుంచి ‘షియాంగ్ యంగ్ హాంగ్ 01’ నౌక బయల్దేరిందని సమాచారం. ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ నిపుణుడు డామియన్ సైమన్ లెక్కల ప్రకారం.. 4,425 టన్నుల బరువున్న ఈ ఓడ భారత్ కాలమానం ప్రకారం మార్చి 10న బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో డామియన్ సైమన్ వెల్లడించారు. చైనా నిఘా నౌక భారత్ లోని అణుశక్తితో కూడిన సబ్ మెరైన్ ఉన్న విశాఖ తీరానికి 480 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు.
సాధారణంగా క్షిపణి పరీక్షలకు ముందు జారీ చేసే హెచ్చరిక సూచీ అయిన ‘నోటిస్ టు ఎయిర్‌మిషన్’(నోటామ్)ను భారత్ మార్చి 7వ తేదీన జారీ చేసింది. దీంతో బంగాళాఖాతంలో 3,550 కి.మీ. రేంజిలో నౌకలు, విమానాల కార్యకలాపాలపై నియంత్రణ విధించినట్టయింది. అయితే ఈ సమయంలోనే చైనాకు చెందిన ‘షియాంగ్ యంగ్ హాంగ్ 01’ బంగాళాఖాతంలోకి వచ్చింది.
చైనా నౌకలో అగ్ని–5 పరీక్షను పూర్తిగా గమనించి దాని రేంజి, సామర్థ్యాన్ని అంచనా వేసుకొనే టెక్నాలజీ ఉందని అంటున్నారు. కానీ, చైనా మాత్రం ఇది కేవలం పరిశోధక నౌకే అని చెబుతుండటం గమనార్హం. భారత్ సహా పశ్చిమ దేశాలు మాత్రం చైనా ఓడలు ప్రత్యర్థి దేశాల నౌకాదళ, సబ్‌మెరైన్ కదలికలను గుర్తించగలవని చెబుతున్నాయి. అంతేకాకుండా వాటి సామర్థ్యాన్ని కూడా తెలుసుకోగలవని వివరిస్తున్నాయి.
కొంత మంది చైనా నిపుణులు అగ్ని–5 రేంజి 5,000 కిలోమీటర్ల కంటే అధికమని గట్టిగా విశ్వసిస్తున్నారు. 2012లో చైనా సైన్యానికి చెందిన అకాడమీ ఆఫ్ మిలటరీ సైన్సెస్ నిపుణుడు డువెన్లాంగ్ అగ్ని 5 క్షిపణి రేంజి దాదాపు 8,000 కిలో మీటర్ల వరకు ఉంటుందని ఓ పత్రికకు రాసిన వ్యాసంలో వెల్లడించాడు.
కాగా భారత్ క్షిపణి పరీక్షలు చేపట్టినప్పుడు చైనా నౌకలు అనుమానాస్పద కార్యకలాపాలు నిర్వహించడం ఇదే మొదటిసారి కాదు. 2022 నవంబర్ లో కూడా ఆ దేశానికి చెందిన యువాన్ వాంగ్ శ్రేణి నౌక హిందూ మహాసముద్రంలో తిరుగాడింది. దీంతో భారత్ అదేసమయంలో పరీక్షించాలనుకున్న అగ్ని 5 పరీక్షను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది.