మ‌నం కంచెల‌కు ఉప‌యోగించే 'క‌ల‌బంద' నుంచి 'ట‌కీలా' మ‌త్తు పానీయం!

ఒకప్పుడు కేవలం పొలాల చుట్టూ జంతువులు రాకుండా కాపలాగా.. పనికిరాని అడవి మొక్కగా భావించిన కలబంద జాతికి చెందిన `అగావే` మొక్క.. నేడు డెక్కన్ పీఠభూమి ప్రాంత రైతుల పాలిట `బ్లూ గోల్డ్` (నీలి బంగారం)గా మారింది.

Update: 2026-06-13 08:30 GMT

ఒకప్పుడు కేవలం పొలాల చుట్టూ జంతువులు రాకుండా కాపలాగా.. పనికిరాని అడవి మొక్కగా భావించిన కలబంద జాతికి చెందిన `అగావే` మొక్క.. నేడు డెక్కన్ పీఠభూమి ప్రాంత రైతుల పాలిట `బ్లూ గోల్డ్` (నీలి బంగారం)గా మారింది. కందుకూరు ప్రాంతానికి చెందిన మాసపల్లి వెంకటేష్ అనే రైతు తన 10 ఎకరాల పొలంలో టొమాటోలు, వేరుశనగ, జొన్నలు పండించేవాడు. కానీ 2010లో కొందరు వ్యాపారులు అతనిని సంప్రదించి అంతవరకు విలువలేని అడవి మొక్కగా భావించిన `అగావే అమెరికానా`ను సేకరించాల్సిందిగా కోరారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 15 బిలియన్ డాలర్ల మార్కెట్ ఉన్న టేకిలా, మెజ్‌కల్ వంటి ప్రముఖ మద్య పానీయాల తయారీకి ఈ అగావే మొక్కలే ప్రధాన ఆధారం. మెక్సికోలోని జలిస్కో రాష్ట్రంలో దీని కోసం ప్రత్యేకంగా `బ్లూ అగావే` తోటలను పెంచుతుండగా... భారతదేశంలో మాత్రం రైతులు అడవిలో సహజంగా పెరిగే అగావేను సేకరిస్తూ అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు.

ఈ అగావే మొక్కలను సేకరించడం .. వాటి నుండి రసాన్ని తీయడం అనేది ఎంతో నైపుణ్యంతో కూడుకున్న పని. ఈ మొక్క మధ్యలో ఉండే `పీన్యా` అనే భాగం చూడటానికి పెద్ద అనాస పండు లాగా ఉంటుంది. ఇదే మద్యం తయారీకి అత్యంత ముఖ్యమైనది. నైపుణ్యం కలిగిన కార్మికులు దీని చుట్టూ ఉండే పదునైన ఆకులను తొలగించి పీన్యాను వేరు చేస్తారు. అయితే ఈ మొక్క పూత పూయడానికి ముందే దీనిని సేకరించడం చాలా కీలకం. ఒకవేళ మొక్క పూత పూస్తే.. అందులోని చక్కెరలన్నీ కాండంలోకి వెళ్లిపోయి పీన్యా పనికిరాకుండా పోతుంది. సేకరించిన 24 గంటల లోపే వీటిని ఫ్యాక్టరీకి చేర్చి ఉడికించాల్సి ఉంటుంది. లేదంటే లోపలి చక్కెరలు కుళ్లిపోయి నాణ్యత దెబ్బతింటుంది. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ వంటి సుదూర ప్రాంతాల నుండి స్థానిక ఏజెంట్ల ద్వారా ఈ అడవి అగావేను సేకరించడం `మాయా పిస్టోలా అగావేపురా` వంటి బ్రాండ్‌లకు పెద్ద సవాలుగా మారింది.

భారతదేశంలో ప్రస్తుతం అగావే పానీయాలకు డిమాండ్ 31 శాతం రేటుతో వేగంగా పెరుగుతోంది. భారతీయులకు అత్యంత ఇష్టమైన విస్కీ స్థానాన్ని ఇది భర్తీ చేయలేకపోయినా... మార్కెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంటోంది. భారతదేశంలో ఈ రంగానికి అగావే ఇండియా అధినేత డెస్మండ్ నజరేత్ పితామహుడిగా నిలిచారు. ఆయన 2011లోనే దేశంలోనే మొదటి క్రాఫ్ట్ అగావే డిస్టిలరీని ప్రారంభించారు. ప్రస్తుతం ఆయన శాటిలైట్ చిత్రాల ద్వారా అగావే మొక్కలు పెరగడానికి అనుకూలమైన ప్రాంతాలను గుర్తిస్తూ పరిశోధనలు చేస్తున్నారు. అగావే మొక్క పెరగడానికి 9 నుండి 13 ఏళ్ల సమయం పడుతుంది కాబట్టి... తప్పుడు స్థలంలో నాటితే ఒక దశాబ్దం కాలం వృథా అవుతుందని ఆయన పేర్కొన్నారు.

డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో అడవి అగావే నిల్వలు అయిపోతాయేమో అనే భయాలు ఉన్నా మునుముందు రానున్న‌ ఐదేళ్ల వరకు ఎలాంటి ఢోకా లేదని వ్యవసాయ నిపుణుడు బ్రగాంజా అభిప్రాయపడ్డారు. ఈ అడవి మొక్క భూమి లోపల తన వేర్ల ద్వారా `మినీ క్లోన్స్` (పిలకలు)ను సృష్టిస్తూ మానవ సహాయం లేకుండానే పెద్ద కాలనీలుగా విస్తరిస్తుంది. అయితే అడవి మొక్కల వల్ల ఒక సమస్య ఉంది. మెక్సికోలాగా భారతదేశంలో క్రమబద్ధమైన సాగు లేకపోవడం వల్ల ఇక్కడి మొక్కల్లో చక్కెర శాతాలు మారుతుంటాయి. దీనివల్ల ఉత్పత్తిని ప్రామాణీకరించడం కష్టమవుతుందని `లోకా లోకా` టేకిలా బ్రాండ్ సహ వ్యవస్థాపకుడు శ్రీ హర్ష వడ్లమూడి తెలిపారు. అందుకే తమ బ్రాండ్ కోసం మెక్సికోలోని జలిస్కో అగ్నిపర్వత నేలల్లో పండే అత్యంత నాణ్యమైన బ్లూ అగావేను వాడుతున్నట్లు ఆయన చెప్పారు.

మెక్సికోలోని కార్పొరేట్ అగావే తోటల్లో డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను ఉపయోగించి పంట ఆరోగ్యాన్ని, పీన్యా ఎదుగుదలను నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. భారతదేశంలో అటువంటి అధునాతన సాంకేతికత -వ్యవస్థీకృత సాగు రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. ప్రస్తుతం దేశంలో అగావే హార్ట్‌లను ప్రాసెస్ చేసే ప్లాంట్ కేవలం డెస్మండ్ నజరేత్‌కు చెందినది ఒక్కటే ఉంది. అయినా భారతదేశంలో ముఖ్యంగా డెక్కన్ పీఠభూమి ప్రాంతంలో మిలియన్ల ఎకరాల బంజరు భూములు అగావే సాగుకు అనుకూలంగా ఉన్నాయని... సరైన దీర్ఘకాలిక ప్రణాళిక - ఓపిక ఉంటే భవిష్యత్తులో భారతదేశం మెక్సికోకు గట్టి పోటీనిస్తూ ఒక పెద్ద `అగావే ఎకానమీ`గా ఎదిగే అవకాశం ఉందని నిపుణులు బలంగా నమ్ముతున్నారు.

Tags:    

Similar News