సెటిల్ అయ్యాకే పెళ్లి.. బెటర్ హాఫ్ ఏఐ సర్వే ఇంకేం చెప్పింది?

ఇప్పుడు 30 ఏళ్లు దాటినా పెళ్లికి తొందరపడని తీరు కనిపిస్తున్న విషయాన్ని బెటర్ హాఫ్ ఏఐ సర్వే వెల్లడించింది.;

Update: 2025-07-16 04:03 GMT

పెళ్లిళ్ల ట్రెండ్ పై ఒక సంస్థ చేపట్టిన సర్వే షాకింగ్ అంశాల్ని వెల్లడించింది. పెళ్లిపై దేశంలోని యూత్ ఆలోచనల్లో మార్పును కొట్టొచ్చినట్లుగా తేడా వచ్చిన వైనాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపింది. ఒకప్పుడు పాతికేళ్లకు పెళ్లి చేసుకోవటం చాలా కీలకమన్న మైండ్ సెట్ లో పూర్తిగా మార్పు రావటమే కాదు.. ఇప్పుడు 30 ఏళ్లు దాటినా పెళ్లికి తొందరపడని తీరు కనిపిస్తున్న విషయాన్ని బెటర్ హాఫ్ ఏఐ సర్వే వెల్లడించింది.

ఈ మార్పుకు మూడు ప్రధాన కారణాలు ఉన్నట్లుగా పేర్కొంటూ.. ఉద్యోగ స్థిరత్వం.. ఆర్థికంగా సెటిల్ కావటం.. వ్యక్తిగత అభిరుచులే పెళ్లికి కీలకంగా మారాయని సర్వే పేర్కొంది. దేశంలోని 21 నుంచి 35 ఏళ్ల మధ్యనున్న యువతపై చేసిన సర్వేలో సుమారు 68 శాతం మంది యూత్ జాబ్ లేకుండా పెళ్లి చేసుకోకూడదని ఫిక్స్ అయినట్లుగా తేల్చారు. ఈ కారణంతోనే పెళ్లిని వాయిదా వేసుకుంటున్నారని స్పష్టం చేశారు. ఇదంతా ఒక ఎత్తు అయితే చాలా ప్రాంతాల్లో యువకులకు జోడీగా అమ్మాయిలు దొరకట్లేదని తేల్చారు.

చదువుకున్న అమ్మాయిల్లో 65 శాతం మంది తమకు సమానంగా ఉన్న అబ్బాయిల్ని మాత్రమే పెళ్లి చేసుకోవటానికి అంగీకరిస్తున్నారని.. చదువు.. ఉద్యోగాల్లో కాస్త వెనుకపడ్డ యువకుల్ని పెళ్లి చేసుకోవటానికి అమ్మాయిలు ఇష్టపడటం లేదని చెబుతున్నారు. అంతేకాదు.. కొన్ని కులాలు.. కులవృత్తులపై ఆధారపడిన వారికి పెళ్లిళ్లు కావట్లేదని.. అమ్మాయిలు దొరకట్లేదని చెబుతున్నారు.

ఐటీ రంగంలో ఉన్న అమ్మాయిలు.. తమ రంగానికి చెందిన అబ్బాయిల్నే ఎంచుకుంటున్నారని.. తమ జాబ్ పొజిషన్ కు తగ్గట్లు ఉన్న అబ్బాయిల్ని మాత్రమే ఎంచుకుంటున్న వైనం వెలుగు చూసింది. గతంలో మాదిరి సంబంధాలు వెంటనే కుదరటం లేదని.. తమ అభిరుచులకు తగ్గ వరుడ్ని ఎంపిక చేసుకోవటానికే అమ్మాయిలు మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. దీంతో.. పెళ్లి సంబంధాలు కుదరటం ఆలస్యమవుతున్నట్లు పేర్కొన్నారు.

పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన అబ్బాయిలు తమ పెళ్లి ఖర్చును తామే పెట్టుకోవాలని డిసైడ్ అవుతున్నారని.. సర్వేలో పాల్గొన్న 70 శాతం మంది అబ్బాయిలు ఇదే విషయాన్ని తమకు చెప్పినట్లుగా వెల్లడైంది. లైఫ్ లో సెటిల్ కావటం మీదనే ఫోకస్ చేస్తున్న అబ్బాయిలు.. అన్ని విధాలుగా సెటిల్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలన్న భావన అబ్బాయిల్లో ఎక్కువ అవుతోందని తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉండటంతో అక్కడి యువకులు మాత్రం పెళ్లిళ్లకు త్వరగా ఒప్పుకుంటున్నారు. అయితే.. వారికి తగ్గ జోడీ దొరకటం కష్టంగా ఉన్నట్లు సర్వే వెల్లడించింది.

Tags:    

Similar News