సింగపూర్ లో వేశ్యలపై దాడి చేసిన భారతీయులకు భారీశిక్ష
బుల్లి దేశమైన సింగపూర్ లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో కొందరికి అవగాహన ఉంది. తప్పు చేసినోళ్లు ఎవరైనా సరే.. వారికి విధించే శిక్ష మాత్రం తీవ్రంగా ఉంటుంది.;
బుల్లి దేశమైన సింగపూర్ లో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో కొందరికి అవగాహన ఉంది. తప్పు చేసినోళ్లు ఎవరైనా సరే.. వారికి విధించే శిక్ష మాత్రం తీవ్రంగా ఉంటుంది. ఈ కారణంగానే అక్కడ నేరాల శాతం చాలా తక్కువగా ఉంటుంది. తాజాగా ఒక ఉదంతంలో హాలీడే ట్రిప్ కోసం వెళ్లిన ఇద్దరు భారతీయుల్ని సింగపూర్ పోలీసులు అరెస్టు చేశారు. న్యాయస్థానం ఎదుట హాజరుపర్చారు.
వారు చేసిన నేరానికి కోర్టు ఈ ఇద్దరికి ఐదేళ్లు జైలుశిక్ష విధించటమే కాదు.. ఒక్కొక్కరికి 12 చెరుకు గడతో కొట్టాలన్న శిక్షను వేసింది. ఇంతకూ వారు చేసిన నేరమేంటి? అన్న విషయంలోకి వెళితే.. సింగపూర్ లో శిక్షలు ఎంత కఠినంగా ఉంటాయన్నది ఇట్టే అర్థమవుతుంది. భారతదేశానికి చెందిన 23 ఏళ్ల ఆరోక్య సామి డైసన్.. 27 ఏళ్ల రాజేంద్రన్ మాయిలరసన్ లు గత ఏప్రిల్ 24న సింగపూర్ కు హాలీడే ట్రిప్ కోసం వెళ్లారు.
రెండు రోజుల తర్వాత అక్కడి లిటిల్ ఇండియా ప్రాంతంలో నడుచుకుంటూ వెళుతున్న వేళలో.. వారికి ఒక వ్యక్తి ఎదురయ్యాడు. తనను తాను పరిచయం చేసుకొని.. వేశ్యల గురించి చెప్పి.. కాంటాక్టు నెంబరు ఇచ్చేసి వెళ్లిపోయారు. అప్పటికే వారి వద్ద డబ్బులు అయిపోయిన వేళ.. ఇట్టే డబ్బులు సంపాదించేందుకు ఒక దుర్మార్గమైన ప్లాన్ వేశారు. అదే రోజు సాయంత్రం ఆరు గంటల వేళలో ఒక హోటల్ లో తమకు ఇచ్చిన కాంటాక్టు నెంబరులో భాగంగా ఒక వేశ్యను కలిశారు.
గదిలోకి వచ్చిన వేశ్యను పట్టుకున్న ఈ ఇద్దరి ఆమె కాళ్లు.. చేతులు కట్టేసి.. ఆమెపై భౌతికంగా దాడి చేసి ఆమె వద్ద ఉన్న డబ్బులు.. పాస్ పోర్టు.. బ్యాంకు కార్డులు దోచుకున్నారు. అంతేనా.. అదే రోజు రాత్రి పదకొండు గంటల వేళలో మరో వేశ్యతోనూ ఇదే తీరుతో వ్యవహరించి.. డబ్బులు దోచేశారు. రెండో వేశ్య వీరు వ్యవహరించిన వైనం గురించి తనకు తెలిసిన వ్యక్తికి చెప్పగా.. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్న సూచన చేశాడు.
అతను చెప్పినట్లే రెండో వేశ్య పోలీసులకు తనకు ఎదురైన చేదు అనుభవం గురించి వెల్లడించి.. కంప్లైంట్ చేసింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఈ ఇద్దరు భారతీయుల్ని అదుపులోకి తీసుకొన్నారు. అరెస్టు చేసిన కోర్టు ఎదుట హాజరుపర్చారు. ఈ కేసులో తాజాగా న్యాయస్థానం తుది తీర్పును వెల్లడించింది. వేశ్యపై దాడి చేసి ఆమె దగ్గర చోరీ చేసిన ఈ ఇద్దరికి ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష విధించటమేకాదు.. 12 చెరుకు గడతో దెబ్బలు కొట్టాలన్న తీర్పును ఇచ్చింది. ఈ తరహా పాడు పనితో భారతదేశ పరువును దెబ్బ తీసిన ఇలాంటి వారికి శిక్ష ముగిసి..ఇండియాకు వచ్చిన తర్వాత మరింత శిక్ష వేస్తే.. తిక్క కుదురుతుందన్న అభిప్రాయం పలువురి నోట వినిపిస్తోంది.