అమెరికా ప్లేస్ లో జర్మనీ వచ్చి చేరింది బాస్
అమ్మేవాడికే అంత ఉంటే.. కొనేటోడికి మరెంత ఉండాలన్న మాట వ్యాపార వర్గాల్లో తరచూ వినిపిస్తూ ఉంటుంది.;
అమ్మేవాడికే అంత ఉంటే.. కొనేటోడికి మరెంత ఉండాలన్న మాట వ్యాపార వర్గాల్లో తరచూ వినిపిస్తూ ఉంటుంది. కస్టమర్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. వస్తువుల్ని.. వస్తుసేవల్ని అమ్ముకునేటోడు ఎలాఉండాలన్న దానికి ఈ మాటను ఉదాహరణగా చెబుతుంటారు. అగ్రరాజ్యం అమెరికాలో ఉన్నత విద్య కోసం భారతీయ విద్యార్థులు పెద్ద ఎత్తున వెళ్లే సంగతి కొత్త కాదు. అయితే.. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. లక్షలాది రూపాయిలు ఖర్చు చేసి.. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళితే.. ఆంక్షలతో చుక్కలు చూపిస్తున్న అగ్రరాజ్యంవైపు భారత విద్యార్థులు చూడటం తగ్గించారు.
ప్రత్యామ్నాయాలు చూసిన వేళ.. అమెరికాకు బదులుగా జర్మనీ భారతీయ విద్యార్థుల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది. దీంతో జర్మనీకి క్యూ కడుతున్నారు. ఈ వాదనకు బలం చేకూరే గణాంకాలు వెలుగు చూస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అమెరికాలో ఉన్నత విద్య కోసం దరఖాస్తు చేసే వారి సంఖ్య 13 శాతం తగ్గిందని.. అదే సమయంలో జర్మనీ.. యూఏఈ వైపు పెద్ద ఎత్తున ఆకర్షితులవుతున్నట్లుగా ట్రాన్స్ నేషనల్ ఎడ్యుకేషన్ రిపోర్టు 2024-25 వెల్లడించింది.
అమెరికాకు వెళ్లే విద్యార్థులు తగ్గటమే కాదు జర్మనీకి వెళ్లే వారి సంఖ్య ఎంత పెరిగిందన్న విషయాన్ని ఈ రిపోర్టు వెల్లడించింది. 2022లో జర్మనీకి వెళ్లే భారత విద్యార్థులు 13.2 శాతం ఉంటే.. 2024-25 నాటికి 32.6 శాతానికి పెరిగింది. యూఏఈలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల భారత విద్యార్థులు ఏకంగా 42 శాతం ఉండటం గమనార్హం.
2022లో భారతీయ విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి అయితే అమెరికా కాదంటే కెనడా అన్నట్లు ఉండేది. ఆ తర్వాత ఈ రెండు దేశాల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితుల్లో ప్రత్యామ్నాయాలు చూసిన భారతీయ విద్యార్థులకు జర్మనీ.. యూఏఈ.. బ్రిటన్ దేశాలు ఆకర్షిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఐర్లాండ్ కు వెళుతున్న వారి సంఖ్య పెరిగిందని చెబుతున్నారు. సో.. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అమెరికాకు మించిన దేశాలు మరిన్ని ఉన్నాయన్నది మర్చిపోకూడదు.