ఆడపిల్లే కావాలి.. మారుతున్న వారసత్వ నిర్వచనం

ఒకప్పుడు ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు కానీ వంశానికి దీపం కొడుకే అని భావించేవారు.;

Update: 2026-01-31 08:39 GMT

ఒకప్పుడు ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు కానీ వంశానికి దీపం కొడుకే అని భావించేవారు. కాలచక్రం తిరిగింది.. ఆలోచనల ధోరణి మారింది. నేడు "వంశోద్ధారకుడు" అనే పాతచింతకాయ పచ్చడి ఆలోచనల కంటే కన్నవారి కళ్లలో ఆనందాన్ని చూసే "అమ్మాయి" వైపే ప్రపంచం మొగ్గు చూపుతోంది. సంతానం విషయంలో తల్లిదండ్రుల ప్రాధాన్యతలు మారుతున్న తీరుపై ఇటీవల వెలువడిన అధ్యయనాలు సామాజిక చైతన్యానికి నిదర్శనం.

ఇంతకాలం భారతీయ సమాజంలో ఒక నమ్మకం బలంగా ఏర్పడింది… ఇంటికి వెలుగు రావాలంటే కొడుకు పుట్టాలి, వంశానికి పేరు నిలవాలంటే వారసుడు కావాలి అని. ఆడపిల్ల పుట్టడాన్ని సహజంగానే చూసినా, కొడుకుతో పోలిస్తే తక్కువ ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితులు ఎన్నో కనిపించేవి. కానీ కాలం మారింది. ఆలోచనలు మారుతున్నాయి. నేటి తల్లిదండ్రుల మనసుల్లో ఒక కొత్త భావన బలపడుతోంది.. వారసుడి కోసం కాదు… వారసురాలే కావాలనే ఆలోచన. ప్రేమ, అనుబంధం, బాధ్యత, భద్రత.. ఈ నాలుగు మాటలే ఇప్పుడు అమ్మాయిలకు పెరుగుతున్న ఆదరణకు కారణాలుగా మారాయి.

ఆప్యాయతకు చిరునామా.. అమ్మాయి

అబ్బాయిల కంటే అమ్మాయిలే తల్లిదండ్రుల పట్ల ఎక్కువ బాధ్యతగా భావోద్వేగ అనుబంధాన్ని కలిగి ఉంటున్నారని గణాంకాలు చెబుతున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం క్షీణించినా మనసు బాగోకపోయినా వారు ఇచ్చే భరోసా వెలకట్టలేనిది. వృద్ధాప్యంలో తల్లిదండ్రులను భారంగా భావించే ఈ రోజుల్లో 'ఆడపిల్ల అండ' ఒక కొండంత ధైర్యాన్ని ఇస్తోంది. పెళ్లై అత్తారింటికి వెళ్లినా పుట్టింటి కష్టసుఖాలను తన భుజాలపై వేసుకునే తత్వం ఆడపిల్లలకే సొంతం.

సవాళ్లు.. సామర్థ్యాలు

మరోవైపు నేటి సమాజంలో యువత ముఖ్యంగా అబ్బాయిలు తప్పుదారి పట్టే అవకాశాలు ఎక్కువగా ఉండటం తల్లిదండ్రుల్లో ఆందోళన కలిగిస్తోంది. కానీ అమ్మాయిలు మాత్రం ప్రతికూల పరిస్థితులను ఎదురిస్తూ విద్య, ఉపాధి రంగాల్లో అద్భుతాలు సృష్టిస్తున్నారు. "ఆడపిల్ల అంటే ఖర్చు" అనే ఆలోచన పోయి "ఆడపిల్ల అంటే ఒక భరోసా" అనే నమ్మకం ఏర్పడింది.

సమాజంలో లింగ వివక్ష తగ్గుముఖం పట్టడం శుభపరిణామం. అయితే ఈ మార్పు కేవలం ఒకరిని తక్కువ చేసి మరొకరిని ఎక్కువ చేయడం కోసం కాదు. పిల్లలు ఎవరైనా వారు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడమే ముఖ్యం. అయినప్పటికీ దశాబ్దాల తరబడి అణచివేతకు గురైన ‘ఆడపిల్ల’కు నేడు సమాజం ఇస్తున్న ఈ గౌరవం, ప్రాధాన్యత నిజంగా ఒక విప్లవాత్మక మార్పే. వారసత్వం అంటే కేవలం ఇంటి పేరును ముందుకు తీసుకెళ్లడం కాదు, తల్లిదండ్రుల ప్రేమను, సంస్కారాన్ని నిలబెట్టడమని నేటి ‘వారసురాళ్లు’ నిరూపిస్తున్నారు.

Tags:    

Similar News