భారత ఐటీ రంగం: రికార్డు వృద్ధి
ఐటీ రంగంలో 2025లో 15-20% ఉద్యోగ వృద్ధి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా AI, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో 30-35% వృద్ధి ఉండే అవకాశముంది.;
భారతదేశ ఐటీ రంగం 2025 ఆర్థిక సంవత్సరంలో అద్భుతమైన వృద్ధిని నమోదు చేసి, కొత్త శిఖరాలను అధిరోహించింది. నాస్కామ్ (NASSCOM) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. భారత ఐటీ రంగం $282 బిలియన్ల భారీ ఆదాయాన్ని ఆర్జించడంతో పాటు, 5.8 మిలియన్ల (58 లక్షల) మందికి పైగా ఉద్యోగాలను కల్పించింది. ఈ గణనీయమైన ప్రగతితో వచ్చే ఏడాదిలో $300 బిలియన్ల లక్ష్యాన్ని చేరుకునే దిశగా దేశ ఐటీ రంగం ఆశాజనకంగా ముందుకు సాగుతోంది.
- ఆదాయంలో దూకుడు.. ఉద్యోగ కల్పనలో జోరు
గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 5.1 శాతం రెవెన్యూ వృద్ధిని సాధించడం విశేషం. 2025లో భారత ఐటీ రంగం 1.26 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టించింది. గత కొన్ని త్రైమాసికాల్లో నియామకాలు కొంత మందగించినప్పటికీ, ప్రస్తుతం ఈ రంగం తిరిగి బలంగా పుంజుకుంటోంది. మొత్తం రెవెన్యూలో ఎగుమతుల ఆదాయం $224 బిలియన్లు కాగా, దేశీయ ఆదాయం 7 శాతం వృద్ధి చెంది $58 బిలియన్లకు చేరింది.
- కేంద్ర మంత్రి వ్యాఖ్యలు.. AIలో భారత్ అగ్రస్థానం
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పార్లమెంటులో మాట్లాడుతూ "భారతదేశం ఐటీ రంగంలో 6 మిలియన్ల మందికి పైగా ఉద్యోగాలు, $250 బిలియన్లకు పైగా వార్షిక ఆదాయం కలిగిన సాంకేతిక శక్తిగా ఎదిగింది" అని పేర్కొన్నారు. స్టాన్‌ఫర్డ్ AI ర్యాంకింగ్స్ ప్రకారం, భారత్ AI నైపుణ్యాల్లో అగ్రస్థానంలో నిలవడం గమనార్హం. అంతేకాకుండా గిట్‌హబ్ AI ప్రాజెక్టులలో రెండో అతిపెద్ద సహకారదాతగా భారత్ కొనసాగుతోంది.
- ఇండియా AI మిషన్ వేగవంతం : అద్భుత ఫలితాలు
2024 మార్చిలో ప్రారంభమైన ఇండియా AI మిషన్ ఇప్పటికే గణనీయమైన ఫలితాలను ఇవ్వడం మొదలుపెట్టింది. ఈ మిషన్ ద్వారా ఇప్పటివరకు 14 సర్వీస్ ప్రొవైడర్ల నుంచి 34,000 GPUsను తీసుకొచ్చారు. స్టార్టప్‌లు, విద్యా సంస్థలకు హై-ఎండెడ్ H100 GPUsను ప్రతి గంటకు ₹92 చొప్పున సబ్సిడీ ధరకు అందిస్తున్నారు, ఇది వాణిజ్య ధరల కంటే చాలా తక్కువ. AI కోష్ ప్లాట్‌ఫారమ్ ఇప్పటివరకు 2.65 లక్షల పర్యటనలు, 13,000 వనరుల డౌన్‌లోడ్‌లను నమోదు చేసింది. ఇందులో 890 డేటాసెట్‌లతో పాటు, 208 AI మోడళ్లను అందుబాటులో ఉంచారు. ఈ మిషన్ 7 కీలకమైన స్తంభాలపై ఆధారపడి ముందుకు సాగుతోంది..అవి కంప్యూటింగ్ సామర్థ్యం, ఫౌండేషన్ మోడల్స్, అప్లికేషన్ డెవలప్‌మెంట్, స్టార్టప్ ఫైనాన్సింగ్ మొదలైనవి.
- 2025లో భారీ నియామకాల అంచనాలు
ఐటీ రంగంలో 2025లో 15-20% ఉద్యోగ వృద్ధి ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా AI, మెషిన్ లెర్నింగ్ రంగాల్లో 30-35% వృద్ధి ఉండే అవకాశముంది. గత ఏడాది ప్రపంచ ఆర్థిక అనిశ్చితి కారణంగా నియామకాల్లో జాగ్రత్త వహించిన ఐటీ కంపెనీలు, ఇప్పుడు తిరిగి విస్తృతంగా ఉద్యోగాలను కల్పించడానికి సిద్ధమవుతున్నాయి. ఎన్ఎల్.బీ సర్వీసెస్ నివేదిక ప్రకారం ఇంజినీరింగ్ క్యాంపస్‌ల నుంచి 82,000 మంది ఫ్రెషర్స్‌ను టాప్ ఐటీ కంపెనీలు నియమించుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నాయి. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, మ్యానుఫ్యాక్చరింగ్, హెల్త్‌కేర్, రిటైల్ రంగాల్లోనూ భారీగా ఐటీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది.
- డిజిటల్ స్పెండింగ్‌పై కంపెనీల ఆసక్తి
నాస్కామ్ వార్షిక సీఎక్స్.ఓ సర్వే ప్రకారం.. దేశంలోని 82% ఎంటర్‌ప్రైజ్ లీడర్లు వచ్చే ఏడాది తమ డిజిటల్ ఖర్చులను కనీసం 5% పెంచాలని యోచిస్తున్నారు. దీనిని బట్టి దేశవ్యాప్తంగా డిజిటల్ మార్పు వేగంగా కొనసాగుతోందని స్పష్టమవుతోంది. ఇది భారత ఐటీ రంగానికి మరింత వృద్ధిని తీసుకువస్తుందని అంచనా.