కొకైన్ రవాణా చేస్తూ పట్టుబడ్డ భారతీయులు.. అమెరికాలో అరెస్ట్ కలకలం
తాజాగా అమెరికాలో భారీగా మాదక ద్రవ్యాల రవాణా గుట్టు రట్టయ్యింది. ఇండియానా రాష్ట్రంలో కొకైన్ ను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు భారతీయ డ్రైవర్లను అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు.;
అమెరికాలో భారతీయులు టాప్ అమెరికన్ కంపెనీలను నడిపిస్తూ భారత్ ఖ్యాతి ఇనుమడింప చేస్తున్నారు. అదే సమయంలో అమెరికాకు అక్రమంగా వచ్చేసిన కొందరు భారతీయులు అక్కడ పాడు పనులు చేస్తూ దొరికిపోయి దేశానికి చెడ్డపేరు తీసుకొస్తున్నారు. అటు కీర్తి.. ఇటు అపనిందలు రెండూ మనకు ఆపాదించిపెడుతున్నారు. ఈ ధోరణితో భారత్ పై మరకలాగా కనిపిస్తోంది.
తాజాగా అమెరికాలో భారీగా మాదక ద్రవ్యాల రవాణా గుట్టు రట్టయ్యింది. ఇండియానా రాష్ట్రంలో కొకైన్ ను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు భారతీయ డ్రైవర్లను అక్కడి అధికారులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ‘యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యురిటీ’ (యూఎస్ డీహెచ్ఎస్) అధికారికంగా వెల్లడించింది.
డీహెచ్ఎస్ ప్రకటన ప్రకారం.. ఈనెల 4వ తేదీన ఇండియానాలో సాధారణ వాహన తనిఖీల్లో భాగంగా చిన్న ట్రక్కులను అధికారులు తనిఖీలు చేశారు. ఈ ట్రక్కుల్లోని స్లీపర్ బెర్త్ లను పరిశీలించగా.. అక్కడ భారీగా కొకైన్ దాచినట్లు గుర్తించారు. మొత్తం 309 పౌండ్లు (సుమారు 140 కిలోలు) కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ కోట్ల డాలర్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ కేసులో నిందితులుగా భారత్ కు చెందిన గుర్ ప్రీత్ సింగ్ (25) , జస్వీర్ సింగ్(30)లను గుర్తించారు. వీరిద్దరూ కాలిఫోర్నియా నుంచి వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్ లు పొందినట్లు డీహెచ్ఎస్ తెలిపింది. అయితే వీరి వలస చరిత్రపై కూడా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గుర్ ప్రీత్ సింగ్ 2023లో అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించినట్లు తాను అక్రమంగా అక్కడ నివసిస్తున్నానని స్వయంగా అంగీకరించినట్లు అధికారులు వెల్లడించారు. మరో నిందితుడు జస్వీర్ సింగ్ కూడా 2027లో అక్రమ మార్గంలో యూఎస్ కు వచ్చినట్లు గుర్తించారు.
ఈ కొకైన్ రవాణాను అడ్డుకోకపోయుంటే అనేక మంది అమెరికన్ల ప్రాణాలకు తీవ్ర ముప్పు వాటిల్లేదని డీహెచ్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. మాదక ద్రవ్యాల నియంత్రణకు సంబంధించి తమ చర్యలు మరింత కఠినంగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈ ఘటనతో అక్రమ వలసలు, డ్రగ్ మాఫియా నెట్ వర్క్ లపై అమెరికా ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.