గుజరాత్ సీఎం విమానాన్ని కూల్చేసిన పాక్.. ఎప్పుడో తెలుసా?
1965 ఆగస్టులో భారత్-పాక్ యుద్ధం మొదలైంది. నెల రోజుల్లో తీవ్రస్థాయికి చేరింది. దీంతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కలుగజేసుకుని కాల్పుల విరమణ తీర్మానం చేసింది.;
ఉమ్మడి ఏపీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి నుంచి నిన్నటి గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ వరకు భారత రాజకీయాల్లో ఎందరో నేతలు విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో దుర్మరణం పాలయ్యారు. వీరంతా ప్రముఖులు కావడంతో ఆయా సంఘటనలు మరింత సంచలనంగా మారాయి. 2009 సెప్టెంబరు 2న జరిగిన వైఎస్ వంటి వారి మరణం తెలుగు రాష్ట్రాల ఆ మాటకొస్తే దేశ రాజకీయాలనే మార్చింది. అప్పటికి ఆయన ఉమ్మడి ఏపీ సీఎం. వైఎస్ తరహాలోనే 2011లో అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమాఖండూ కూడా దుర్మరణం పాలయ్యారు. వీరిద్దరే కాక.. మరో రాష్ట్ర సీఎం కూడా విమాన లేదా హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సంగతి మీకు తెలుసా? అది కూడా శత్రు దేశ దాడిలో అని.. యుద్ధ సమయంలో అని తెలుసా?
బహుశా ఈ తరం వారికి ఎవరికీ తెలిసి ఉండని సంఘటన ఇది. ఎందుకంటే.. సరిగ్గా 65 ఏళ్ల కిందట జరిగింది. అప్పుడు భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధం జరుగుతోంది. రెండు దేశాలు ఏర్పడ్డాక ఇది రెండో యుద్ధం అన్నమాట. ఇక గుజరాత్ అనేది పాకిస్థాన్‌తో సుదీర్ఘ సరిహద్దు ఉన్న రాష్ట్రం. 1965 యుద్ధం సమయంలో గుజరాత్ సీఎంగా బల్వంత్‌రాయ్ మెహతా ఉన్నారు. ఈయన భార్యతో పాట ప్రయాణిస్తున్న విమానాన్నే పాకిస్థాన్ ఎయిర్‌ఫోర్స్ కూల్చివేసింది.
1965 ఆగస్టులో భారత్-పాక్ యుద్ధం మొదలైంది. నెల రోజుల్లో తీవ్రస్థాయికి చేరింది. దీంతో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి కలుగజేసుకుని కాల్పుల విరమణ తీర్మానం చేసింది. దీనికి భారత్ వెంటనే అంగీకరించినా.. పాకిస్థాన్ మాత్రం అంగీకారం తెలిపి కూడా నాన్చింది. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలు యుద్ధం స్థాయిలోనే ఉన్నాయి.
1965 సెప్టెంబరు 19న గుజరాత్ సీఎంగా ఉన్న బల్వంత్‌రాయ్ మెహతా.. తన సరోజ్‌బెన్, ముగ్గురు సహాయకులు, ఇద్దరు జర్నలిస్టులతో పర్యటనకు బయల్దేరారు. ఆయన విమానంలో మిథాపుర్ బయల్దేరారు. ఆ రాష్ట్ర చీఫ్ పైలట్ జహంగీర్ ఇంజినీర్ పొరపాటున విమానాన్ని భారత్-పాక్ సరిహద్దుల్లోకి తీసుకెళ్లారు. అప్పటికి ఉద్రిక్తతలు నెలకొనడంతో.. పైలట్ అప్రమత్తం అయ్యారు. కానీ, అంతలోనే జరగరాని నష్టం జరిగిపోయింది.
భారత్ వైపు నుంచి విమానం వస్తుండడాన్ని పసిగట్టిన పాక్ ఫ్లయింగ్ ఆఫీసర్ ఖాయిస్ హుస్సేన్ అది నిఘా జెట్ అని అనుమానించారు. తన యుద్ధ విమానంతో దూసుకొచ్చారు. ఇక సిగ్నల్ వెళ్లినా దానిని పట్టించుకోని పాక్ సైన్యం కాల్పులు జరపడంతో బల్వంత్‌రాయ్ విమానం కుప్పకూలిపోయింది. సీఎంతో పాటు అందరూ దుర్మరణం చెందారు. ఇలా ఒక అంతర్జాతీయ స్థాయి సైనిక ఘర్షణల్లో రాజకీయ నాయకుడు ప్రాణాలు కోల్పోవడం మన దేశ చరిత్రలో అదే తొలిసారి. బహుశా చివరిసారి కూడా.
అంతా అయిపోయాక.. 46 ఏళ్లకు..
బల్వంత్‌రాయ్ మెహతా విమానాన్ని కూల్చివేయడంలో పాక్ పైలట్ హుస్సేన్‌ది కీలక పాత్ర. కానీ, అతడూ ఆ విమానం సీఎంది అని అనుకోలేదట. వార్తలు చూశాక అసలు విషయం తెలుసుకున్నాడట. 2011లో అంటే.. 46 ఏళ్ల తర్వాత బల్వంత్‌రాయ్ విమాన పైలట్ జహంగీర్ కుమార్తెకు క్షమాపణల సందేశం పంపాడు.