షాకింగ్... పాకిస్థాన్ అదుపులో బోర్డర్ దాటిన భారత జవాన్!
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ – పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే.;
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ – పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఇరు దేశాలు దౌత్యపరంగా గతంలో ఎన్నడూ లేనిస్థాయిలో అన్నట్లుగా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ సమయంలో భారత్ కు చెందిన ఓ జవాన్.. పొరపాటున బోర్డర్ దాటడంతో అతడిని పాకిస్థాన్ ఆర్మీ అదుపులోకి తీసుకొంది!
అవును... జాతీయ మీడియా కథనాల ప్రకారం... బుధవారం మధ్యాహ్నం పంజాబ్ లోని ఫిరోజ్ పూర్ సెక్టార్ లో ఇంటర్నేషనల్ బోర్డర్ ని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీ.ఎస్.ఎఫ్.) సైనికుడు పొరపాటున దాటగా.. అతడిని పాకిస్థాన్ రేంజర్లు అదుపులోకి తీసుకున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఈ విషయం ఇప్పుడు షాకింగ్ గా మారింది.
182 బీ.ఎస్.ఎఫ్. బెటాలియన్ కు చెందిన కానిస్టేబుల్ పీకే సింగ్ అనే సైనికుడు భారత్-పాక్ సరిహద్దుకు దగ్గరగా ఉన్న వ్యవసాయ భూమి సమీపంలో విధుల్లో ఉన్నారు. ఆ సమయంలో సింగ్ అనుకోకుండా భారత సరిహద్దు కంచె దాటి పాక్ భూభాగంలో ప్రవేశించాడు. దీంతో.. అక్కడి ఫిరోజ్ పూర్ బోర్డర్ మీదుగా పాక్ రేంజర్లు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
వాస్తవానికి సింగ్ యూనిఫాంలో తన సర్వీస్ రైఫిల్ ను పట్టుకునే ఉన్నాడు. ఈ సమయంలో రైతులతో పాటు వెళ్తుండగా.. కాసేపు నీడలో విశ్రాంతి తీసుకోవడం కోసమని ముందుకు వెళ్లాడు.. దీంతో పాక్ సైనికులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో సైనికుడి విడుదలకు భారత్ సైన్యం - పాక్ రేంజర్స్ అధికారులు ఓ ఫ్లాగ్ మీటింగ్ ను ప్రారంభించారు.
వాస్తవానికి సైనికులు లేదా పౌరులు పొరపాటు సరిహద్దును దాటడం సాధారణమైన విషయమే కావడంతో ఎప్పుడూ సైనిక ప్రోటోకాల్ ద్వారా దీన్ని పరిష్కరిస్తారు. అయితే... తాజాగా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో పరిస్థితులు మారాయని.. అయితే, ఫ్లాగ్ సమావేశం తర్వాత అతడిని స్వదేశానికి పంపుతారని అంటున్నారు.
కాగా రెండు దేశాల సరిహద్దులు కలిసే సరిహద్దు భాగాన్ని జీరో లైన్ అంటారు. ఈ ప్రదేశంలో వ్యవసాయం చేయడానికి రైతులకు ప్రత్యేక అనుమతి లభిస్తుంది. రైతులు పంటలు కోసేటప్పుడు వారి సెక్యూరిటీ కోసం బీ.ఎస్.ఎఫ్. సైనికులు వారితో పాటు ఉంటారు. ఈ సమయంలోనే భారత జవాన్ బోర్డర్ క్రాస్ చేసినట్లు చెబుతున్నారు!