రియల్ వార్ లో భారత్ విజయం.. ఫేక్ న్యూస్ లో పాక్ గెలుపు!

ఈ విషయంలో భారతదేశం మాత్రం హుందాగా వ్యవహరించింది. తప్పుడు ప్రచారాలు చేపట్టలేదు. తన స్థాయిని తగ్గించుకోలేదు. పాక్ మాత్రం నక్కజిత్తుల తీరును ప్రదర్శించింది.;

Update: 2025-05-12 05:14 GMT

అవును.. ఆపరేషన్ సిందూర్ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు.. ప్రస్తుతానికి ఆగిన కాల్పుల విరమణ ఎపిసోడ్.. అనంతరం పాక్ జరిపిన కాల్పులు మొత్తం వ్యవహారాన్ని పరిగణలోకి తీసుకుంటే పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తాయి. ఉగ్రవాదులే లక్ష్యంగా భారత్ తన ఆపరేషన్ ను నిర్వహిస్తే.. పాకిస్తాన్ మాత్రం జనవాసాల్ని లక్ష్యంగా చేసుకుంది. ఈసారి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్ని చూస్తే పాక్ చేసిందంతా అధర్మ యుద్ధంగా చెప్పాలి. అబద్ధాలే నిజాలుగా ప్రచారం చేసింది.

ఈ విషయంలో భారతదేశం మాత్రం హుందాగా వ్యవహరించింది. తప్పుడు ప్రచారాలు చేపట్టలేదు. తన స్థాయిని తగ్గించుకోలేదు. పాక్ మాత్రం నక్కజిత్తుల తీరును ప్రదర్శించింది. తనకు అనుకూలంగా ఉండే దేశాల్లో తప్పుడు కథనాల్ని క్రియేట్ చేసి.. వాటిని ప్రాశ్చాత్య మీడియాను ఆకర్షించేలా కుట్రలు పన్నింది. దీనికి నిదర్శనంగా రఫెల్ యుద్ధ విమానాల్ని కూల్చేసినట్లుగా తప్పుడు కథనాలకు ప్రాశ్చాత్య మీడియా సైతం పెద్ద ఎత్తున ప్రాధాన్యత ఇవ్వటం.

ఇదొక్కటే కాదు.. పాక్ అమ్ములపొదిలోని ఆయుధాలు భారత్ ను దెబ్బ తీశాయని.. తమ సత్తా చాటామని.. తమ ధాటికి తట్టుకోలేకే భారత్ వెనక్కి తగ్గినట్లుగా ఫేక్ ప్రచారాల్ని అదే పనిగా చేస్తున్నారు. తాజా ఉద్రికత్తల విషయంలో సోషల్ మీడియాను.. మీడియాను పాకిస్తాన్ భారీగా వాడేస్తే.. అందుకు భిన్నంగా భారత్ మాత్రం అలాంటి తప్పుడు ఎత్తుగడలకు పోలేదు. తాను చేయాల్సింది చేసుకుంటూ పోయింది. తాను లక్ష్యంగా చేసుకున్న వాటి అంతు చూసింది. అదే సమయంలో సాధారణ పౌరులకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంది.

భారత్ పూర్తిస్థాయి బాధ్యతతో వ్యవహరిస్తే.. పాకిస్తాన్ మాత్రం అందుకు భిన్నంగా భారత వ్యతిరేక విషాన్ని చిమ్మటం.. ఏదోలా తనదే పైచేయి అన్న భావన కలిగేలా చేయటం మీదనే ఫోకస్ చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు కంటే నకిలీలే రాజ్యమేలుతున్న వేళ.. తాను చేయాల్సింది చేసి.. శత్రువు తాట తీయటంలో తిరుగులేని అధిక్యతను ప్రదర్శించి.. ఆ విషయాల్ని ప్రచారం చేసుకునే విషయంలో ప్రదర్శించిన తటాయింపు భారత్ కు ఇబ్బందికరంగా మారింది.

అదే సమయంలో తప్పు.. ఒప్పు, న్యాయం.. అన్యాయం.. లాంటి వాటిని పట్టించుకోకుండా భారత్ మీద తాము అధిక్యతను ప్రదర్శించామన్న తప్పుడు ప్రచారంతో ప్రపంచాన్ని నమ్మించి.. తమకు జరిగిన నష్టాన్ని తక్కువ చేసి చూపించేలా పాక్ ఫేక్ వ్యూహాన్ని పన్నింది. ఈ కుట్రను కాస్త ఆలస్యంగా గుర్తించిన భారత్.. అసలు విషయాలు ప్రపంచానికి తెలిసేలా చేస్తోంది. మొత్తంగా చూస్తే.. ఉద్రిక్తతల వేళ కచ్ఛితమైన లక్ష్యాలతో భారత్ విజయం సాధిస్తే.. పాకిస్తాన్ మాత్రం ఫేక్ ప్రచారాల అంశంలో అధిక్యతను ప్రదర్శించిందని చెప్పాలి.

Tags:    

Similar News