దేశాన్ని కాటేస్తున్న నిరుద్యోగ రక్కసి.. గతం కంటే పెరిగిన తీరు..!
పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత పెరుగుదల కేవలం సంఖ్యలకే పరిమితం కాకుండా, ఒక సామాజిక సంక్షోభానికి దారితీసే ప్రమాదం కనిపిస్తోంది.;
భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని ఒకవైపు గణాంకాలు చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో నిరుద్యోగ రక్కసి కోరలు చాస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజా నివేదికల ప్రకారం, 2026. మార్చిలో దేశవ్యాప్త నిరుద్యోగ రేటు 5.1 శాతానికి చేరుకుంది. ముఖ్యంగా ఉద్యోగాల కోసం ఆశగా నగరాలకు వచ్చే యువతకు నిరాశే ఎదురవుతోంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత పెరుగుదల కేవలం సంఖ్యలకే పరిమితం కాకుండా, ఒక సామాజిక సంక్షోభానికి దారితీసే ప్రమాదం కనిపిస్తోంది.
పట్టణ ప్రాంతాల్లో తీవ్రత..
గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోనే నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉంది. గత నెలలో 6.6 శాతంగా ఉన్న పట్టణ నిరుద్యోగ రేటు, ఇప్పుడు 6.8 శాతానికి పెరిగింది. మెరుగైన జీవితం కోసం, సాఫ్ట్‌వేర్ లేదా సర్వీస్ రంగాల్లో ఉద్యోగాల కోసం యువత పెద్ద ఎత్తున నగరాలకు వలస వెళ్తున్నారు. కానీ, అక్కడ ఉన్న ఖాళీలు మరియు వస్తున్న అభ్యర్థుల సంఖ్యకు మధ్య సమతుల్యత దెబ్బతింది. ప్రపంచ వ్యాప్త ఆర్థిక అనిశ్చితి, ఏఐ ప్రభావం వల్ల కొన్ని రంగాల్లో నియామకాలు మందగించడం పట్టణ నిరుద్యోగంపై నేరుగా ప్రభావం చూపుతోంది.
అర్హత ఉన్నా అవకాశాల్లేవు..
ప్రస్తుత తరం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ‘చదువుకున్న నిరుద్యోగుల’ సంఖ్య పెరగడం. సాధారణ డిగ్రీలే కాకుండా, ఇంజినీరింగ్, ఎంబీఏ వంటి వృత్తి విద్యా కోర్సులు చేసిన వారు కూడా తమ అర్హతకు తగ్గ ఉద్యోగం దొరకక ఇబ్బంది పడుతున్నారు. పీజీలు, పీహెచ్‌డీలు చేసిన వారు కూడా చిన్నపాటి ప్యూన్ లేదా అటెండర్ ఉద్యోగాల కోసం పోటీ పడటం మన విద్యా వ్యవస్థ మరియు ఉపాధి రంగం మధ్య ఉన్న అగాధాన్ని సూచిస్తోంది.
ఉద్యోగ మార్కెట్‌లో మారుతున్న సమీకరణాలు
కంపెనీలు ఇప్పుడు కేవలం డిగ్రీలను చూసి ఉద్యోగాలు ఇవ్వడం లేదు. వారికి కావాల్సిన నిర్దిష్ట నైపుణ్యాలు అభ్యర్థుల్లో ఉండడం లేదు. విద్యా సంస్థల్లో బోధించే పాఠ్యాంశాలకు, పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలకు పొంతన లేకపోవడం వల్ల కంపెనీలు నియామకాలను నిలిపివేస్తున్నాయి లేదంటే తగ్గించుకుంటున్నాయి. మరోవైపు, కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్న ఏఐ టూల్స్ వల్ల కొన్ని సంప్రదాయ ఉద్యోగాల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది. యువత శ్రమశక్తిని సద్వినియోగం చేసుకోలేకపోతే అది దేశానికి పెద్ద నష్టంగా మారుతుంది. నిరుద్యోగం పెరగడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతుంది, ఇది మళ్లీ మార్కెట్‌లో డిమాండ్‌ను తగ్గించి ఆర్థిక వ్యవస్థ మందగమనానికి దారితీస్తుంది. ఇది ఒక విషవలయంలా మారుతోంది.
నిరుద్యోగాన్ని అరికట్టాలంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా, ప్రైవేట్ రంగంలో మరిన్ని పెట్టుబడులు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. యువతకు ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ట్రైనింగ్ ఇవ్వాలి. యువత ఉద్యోగాల కోసం వెతకడం కంటే, ఉద్యోగాలను సృష్టించే పారిశ్రామికవేత్తలుగా మారేలా ప్రోత్సహించాలి. సర్వీస్ రంగంపైనే భారం వేయకుండా, తయారీ రంగాన్ని బలోపేతం చేస్తే ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది.