ఏపీకి మొదటి డిఫెన్స్ కారిడార్ సిద్ధం..
రక్షణ రంగంలో భారతదేశం వేగంగా స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తోంది.;
రక్షణ రంగంలో భారతదేశం వేగంగా స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు నిర్ణయం కీలకమైన మలుపు. దేశంలోని తమిళనాడు, ఉత్తర ప్రదేశ్ తర్వాత మూడో రక్షణ కారిడార్‌గా ‘దొనకొండ’ ఎంపిక కావడం.. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతోంది. ఇది కేవలం రక్షణ రంగం విస్తరణ మాత్రమే కాదు ఆర్థిక, సాంకేతిక, వ్యూహాత్మక స్వావలంబన దిశలో శక్తివంతమైన అడుగు. కేంద్ర రక్షణ శాఖ సూచనల మేరకు 23,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించనున్నారు. ఇది దేశంలోని తమిళనాడు, యూపీలతో పోలిస్తే అతిపెద్దదని చెప్పవచ్చు. హై-వాల్యూ ఇన్వెస్ట్‌మెంట్‌గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ప్రైవేట్, పబ్లిక్ రంగ సంస్థలు, విదేశీ టెక్నాలజీ భాగస్వాములు అన్నీ ఈ కారిడార్‌లో భాగస్వామ్యం సాధిస్తే, దేశ రక్షణ తయారీ పటిమ కొత్త దిశ వైపునకు వెళ్తుంది.
ఉద్యోగావకాశాల విస్తరణ
దొనకొండ ప్రాజెక్ట్ విజయవంతమైతే ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల పటంలో ఒక సుస్థిర స్థానాన్ని పొందుతుంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకూ విస్తృత అవకాశాలు ఏర్పడతాయి. ఆయుధాలు, మిసైల్స్, ఎయిర్‌క్రాఫ్ట్ భాగాలు, కమ్యూనికేషన్ పరికరాల తయారీ రంగాల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు ఇది వేదిక అవుతుంది. ఇంజినీరింగ్ విద్యార్థులకు, టెక్నికల్ ప్రొఫెషనల్స్‌కు, సైనిక టెక్నాలజీపై ఆసక్తి కలిగిన స్టార్టప్‌లకు ఇది బంగారు అవకాశంగా నిలుస్తుంది.
వ్యూహాత్మక ప్రాధాన్యం
దేశం ప్రస్తుతం ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గతంలో రక్షణ అవసరాల కోసం భారీగా దిగుమతులపై ఆధారపడ్డ దేశం ఇప్పుడు స్వదేశీ ఉత్పత్తి దిశగా వేగంగా అడుగులు వేస్తుంది. ‘దొనకొండ కారిడార్’ ఈ మార్గంలో అతిపెద్ద మైలురాయి అవుతుంది. దీనివల్ల కేవలం ఉత్పత్తి మాత్రమే కాకుండా సొంత పరిశోధన కేంద్రాలు, ఇన్నోవేషన్ ల్యాబ్‌లు కూడా ఏర్పడే అవకాశముంది. ఇది దక్షిణ భారతదేశాన్ని రక్షణ ఉత్పత్తి మ్యాప్‌లో కీలక కేంద్రంగా నిలబెడుతుంది.
పర్యావరణం, మౌలిక వసతులు
ఈ ప్రాజెక్ట్ పరిమాణం దేశంలోనే అతి పెద్దది కావడంతో పర్యావరణ సమతుల్యత కాపాడడం అత్యవసరం. నీటి వనరులు, విద్యుత్, రోడ్డు, రైలు, ఎయిర్ కనెక్టివిటీ వంటి మౌలిక వసతులు సరైన విధంగా అమలు కావాలి. ప్రభుత్వం ఇప్పటికే దొనకొండ ఎయిర్‌స్ట్రిప్‌ను అభివృద్ధి చేస్తోంది. అదే రక్షణ పరిశోధన సంస్థలు, శిక్షణ కేంద్రాలకు ప్రాథమిక సదుపాయంగా మారవచ్చు.
దేశ భద్రతకు బలమైన ఆధారం
భారత రక్షణ రంగం రోజురోజుకూ ఆధునీకరణ దిశగా వెళ్తోంది. సరిహద్దు సవాళ్లకు సమర్థంగా పరిష్కరించాలంటే అంతర్గతంగా డిఫెన్స్ ఉత్పత్తి శక్తి పెరగాలి. దొనకొండలో ప్రారంభమవుతున్న ఈ రక్షణ కారిడార్ ద్వారా దేశం ఆయుధ రంగంలో, టెక్నాలజీ అభివృద్ధిలో మరింత బలపడుతుంది. అమెరికన్ జీఈ (జనరల్ మోటార్స్) ఇంజిన్లతో భారత LCAలు తయారవుతున్న తరుణంలో, ఈ కారిడార్ వంటి ప్రాజెక్టులు ఆ దిశను మరింత బలోపేతం చేస్తాయి.
దొనకొండ రక్షణ కారిడార్ కేవలం ఒక పరిశ్రమా ప్రాజెక్ట్ మాత్రమే కాదు.. భారతదేశ స్వావలంబన, సాంకేతిక సామర్థ్యం, వ్యూహాత్మక స్థిరత్వానికి సంకేతం. ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశలో గొప్ప ముందడుగు. రాబోయే దశాబ్దంలో దొనకొండ కేవలం మ్యాప్‌లోని పేరు కాబోదు.. భారత రక్షణ తయారీకి గర్వకారణంగా నిలిచే ప్రాంతంగా అవతరించబోతోంది. స్థానిక పరిశ్రమల పునరుజ్జీవనానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తుందని నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.