ప్రైవేటు ట్రావెల్స్ కి చెక్.. వరుస ప్రమాదాలతో కీలక నిర్ణయం
ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేటు టావెల్స్ కి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షాక్ ఇచ్చాయి. ఇప్పటి వరకు ఒక దేశం, ఒకే విధానం పేరిట పర్మిట్లు జారీ చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.;
ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేటు టావెల్స్ కి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షాక్ ఇచ్చాయి. ఇప్పటి వరకు ఒక దేశం, ఒకే విధానం పేరిట పర్మిట్లు జారీ చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఇకపై ప్రైవేటు ట్రావెల్స్ ఎక్కడ తిరుగుతాయో అక్కడే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సివుంటుందని తేల్చిచెప్పింది. ఇటీవల వరుసగా ప్రమాదాలకు గురవుతూ ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న ట్రావెల్స్ కి బ్రేకులు వేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు స్పందించిన కేంద్రం బస్సు పర్మిట్ల జారీ విధానాన్ని మార్చింది.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక దేశం - ఒకే విధానం అమలులోకి తెచ్చింది. అంతవరకు బస్సు ఏ రాష్ట్రంలో తిరిగితే అక్కడే రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సివుండేది. ఈ కారణంగా దేశంలో రకరకాల పన్ను విధానాలు అమలు అవుతున్నాయని కేంద్రం భావించి ఒకే రిజిస్ట్రేషన్ ప్రక్రియ అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఆలిండియా పర్మిట్ జారీ చేసి బస్సు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేసినా దేశం మొత్తం తిరగవచ్చు అన్న వెసులుబాటు కల్పించింది. ఆలిండియా పర్మిట్ కు రూ.2 లక్షలు వసూలు కేంద్రం వసూలు చేసి అందులో సగం రాష్ట్రాలకు పంచుతామని చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగీకరించాయి.
అయితే కేంద్ర విధానం బస్సు ఆపరేటర్లకు వరంగా మారింది. దేశంలో ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్న వెసులుబాటుతో నిబంధనలు కఠినంగా ఉండే తెలుగు రాష్ట్రాలను కాదని కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లకు మొగ్గుచూపాయి. అదేసమయంలో ఆలిండియా పర్మిట్లకు డబ్బు చెల్లించి తెలుగు రాష్ట్రాల్లో సర్వీసులు నిర్వహించేవి. తెలుగు రాష్ట్రాల్లో త్రైమాసిక ఫీజు రూ.90 వేలు ఉంటే, కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ ఫీజు ఏడాదికి రూ.50 వేలే ఉండటం వల్ల బస్సు ఆపరేటర్లు ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్లు చేయించి రాష్ట్రంలో సర్వీసులు నడిపేవారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వస్తున్నా, కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన విధానంతో అంగీకరించాల్సివచ్చింది.
ఈ పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో నమోదైన బస్సులు ఫిట్ నెస్ సర్టిఫికెట్లను ఆయా రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సివుండటం, ఈ విషయంలో ఆ రాష్ట్రాలు సీరియస్ గా లేకపోవడంతో ఆపరేటర్లు భద్రతను గాలికొదిలేసి ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా మారారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. బస్సు సీటింగ్ సరిగా లేకపోవడం, అగ్ని ప్రమాదాలు సంభవించకుండా సరైన జాగ్రత్తలు పాటించకపోవడం, అత్యవసర డోర్లు సరిగా నిర్వహించకపోవడంతో ప్రమాదాల సమయంలో ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతోంది.
ప్రధానంగా నాగాలాండ్, అరుణాచలప్రదేశ్, లక్షదీప్, డయ్యూడామన్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదైన ట్రావెల్స్ బస్సులు ఎక్కువగా ఏపీ-తెలంగాణ మధ్య సర్వీసులు నిర్వహిస్తున్నాయి. ఈ బస్సులే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయని చెబుతున్నారు. ఇటీవల కర్నూలు, మార్కాపురం సమీపంలో జరిగిన ప్రమాదాలకు గురయ్యాయి. దీంతో ప్రమాదాలపై లోతుగా విచారణ జరిపిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఇదే సమయంలో దక్షిణాది రాష్ట్రాలు అన్నింటి నుంచి ఇదే విధమైన లేఖలు ప్రభుత్వానికి వెళ్లడంతో ఒకే దేశం - ఒకే విధానం అన్న నిబంధనను పూర్తిగా తొలగించింది.
పాతవిధానంలోనే రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వుల కారణంగా ఇకపై ప్రైవేటు ట్రావెల్స్ పక్కాగా తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సివుండటమే కాకుండా, ఫిట్ నెస్ సర్టిఫికెట్లను కూడా ఇక్కడే పొందాల్సివుంటుంది. దీనివల్ల పక్కాగా నిబంధనలు అమలు చేసి బస్సు ప్రమాదాలు తగ్గేలా చర్యలు తీసుకోవడానికి వీలు అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు.