అందరికీ ఇక, 'ఏఐ' శరణ్యం: రిపోర్ట్
భారత్‌లో అక్షరాస్యత ఎలా ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎక్కువగా ఉందని తెలుస్తోంది.;
భారత్‌లో అక్షరాస్యత ఎలా ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ఏఐని వినియోగిస్తున్న.. ఏఐ ఆధారిత పరిశ్రమల విష యంలో దూసుకుపోతున్న దేశాల్లో భారత్ మూడో స్థానంలో నిలిచింది. ఇది ఒకరకంగా రికార్డే అయినా.. ఇతర పారిశ్రామిక రంగాల పరంగా చూసుకుంటే.. మాత్రం భవిష్యత్తులో ఇబ్బందులు తప్పేలా లేవని అంటున్నారు పరిశీలకులు.
తాజాగా స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ఓ నివేదిక విడుదల చేసింది. దీనిలో ప్రపంచ స్థాయిలో ఏఐ ఆధారిత దేశాలు.. ఆయా దేశాల్లో జరుగుతున్న మార్పులను వివరించింది. 'గ్లోబల్ ఏఐ వైబ్రెన్సీ టూల్`(ప్రపంచ వ్యాప్తంగా ఏఐ ప్రభావిత రంగాలు) అంశంపై ఈ యూనివర్సిటీ అధ్యయనం చేసింది. దీని ప్రకారం.. అమెరికా తొలి స్థానంలో నిలవగా.. చైనా రెండో స్థానంలో నిలిచింది. ఇక, ఎవరూ ఊహించని విధంగా భారత్ మూడో స్థానాన్ని దక్కించుకుంది.
భారత్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ రంగం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కారణంగా ఏఐ విస్తరిస్తున్నట్టు ఈ నివేదిక స్పష్టం చేయడం గమనార్హం. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా అభి వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ 21.59 స్కోరుతో మూడో స్థానంలో నిలిచింది. నిజానికి సాంకేతికంగా పురోగమిస్తున్న సౌత్ కొరియా, బ్రిటన్, సింగపూర్, జపాన్, జర్మనీ వంటి దేశాలను కూడా తోసిపుచ్చి భారత్ ముందుకు రావడం గమనార్హం.
అయితే.. ముప్పూ ఎక్కువే!
ప్రస్తుతం అమెరికా నైపుణ్యం ఉన్న వారి కొరతను ఎదుర్కొంటోంది. దీనికి కారణం.. కొన్నాళ్లుగా ఏఐని ఎక్కువగా వినియోగించుకోవడమే. ఇలా.. భారత్‌లోనూ రాబోయే రోజుల్లో వివిధ రంగాలు ప్రభావితమయ్యే పరిస్థితి కనిపిస్తోందన్న వాదన వినిపిస్తోంది. ముఖ్యంగా పరిశోధన, అభివృద్ధి వంటి రంగాల్లో ఏఐ వినియోగం సరికాదన్న సూచనలు కూడా వస్తున్నాయి. ఏదేమైనా.. రాబోయే రోజుల్లో ఏఐ శరణ్యమేనని అంటున్నారు నిపుణులు.