'భారత్ తో చర్చలు'పై పాక్ ప్రధాని పాత కబుర్లు!
అవును... ఉగ్రవాదాన్ని రూపుమాపే వరకూ చర్చలు లేవని పాక్ కు భారత్ తేల్చి చెప్పినా.. ఆ దేశ ప్రధాని మాత్రం మారలేదు.;
జమ్మూకశ్మీర్ లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ పై భారత్ కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. అటు దౌత్య పరంగా, ఇటు సైనిక పరంగా సంచలన నిర్ణయాలు తీసుకొంది. ఇందులో భాగంగా... సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతోపాటు ఆ దేశంతో ఉన్న అన్ని వాణిజ్య సంబంధాలను తెగదెంపులు చేసుకుంది.
ఇదే సమయంలో... ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్ తోపాటు పీవోకేలో ఉన్న ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. నాలుగురోజుల పాటు కొనసాగిన ఈ దాడుల అనంతరం దాయాది కాళ్లబేరానికి రావడంతో కాల్పుల విరమణకు భారత్ అంగీకరించింది. ఈ సందర్భంగా... ఉగ్రవాదాన్ని రూపుమాపే వరకు పాకిస్థాన్ తో చర్చల ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.
అవును... ఉగ్రవాదాన్ని రూపుమాపే వరకూ చర్చలు లేవని పాక్ కు భారత్ తేల్చి చెప్పినా.. ఆ దేశ ప్రధాని మాత్రం మారలేదు. మరోసారి భారత్ తో చర్చలంటూ పాతపాటే పాడటం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా.. ఇరు దేశాల మధ్య పరిష్కరించబడకుండా ఉన్న సమస్యలపై అర్థవంతమైన చర్చలకు సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ మరోసారి పేర్కొన్నారు.
ఇటీవల ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలోని పరిస్థితులపై సౌదీ యువరాజు ఎంబీఎస్, పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ లు టెలిఫోన్ లో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా భారత్ - పాక్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనను ప్రస్తావనకు తెచ్చిన షరీఫ్.. చర్చలకు సిద్ధమని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రేడియో పాకిస్థాన్ వెల్లడించింది.
కాగా... పహల్గాం ఉగ్ర దాడి అనంతరం భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టగా.. పాక్ వణికిపోయిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో.. కాళ్లకు చక్రాలు కట్టుకుని ప్రపంచ దేశాల మద్దతు కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలో సౌదీ సహా ఇరాన్, అజర్ బైజాన్ లను వేడుకుంది. ఆ సమయంలో పాక్ తో చర్చల ప్రస్తావనపై భారత్ స్పందించింది.
ఇందులో భాగంగా.. పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని రూపుమాపేవరకు చర్చల ప్రసక్తే లేదని భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదం - చర్చలు ఒకేసారి జరగవని తెలిపింది. ఇదే సమయంలో.. సింధూ నదీ జలాల ఒప్పందం రద్దుపై స్పందిస్తూ.. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని క్లియర్ గా తేల్చి చెప్పింది.