రాష్ట్రపతితో అమిత్ షా, జై శంకర్ కీలక భేటీ.. చైనాతో 30 నిమిషాలు!

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ - పాక్ మధ్య ఏమి జరగబోతోందనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.;

Update: 2025-04-24 14:45 GMT

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ - పాక్ మధ్య ఏమి జరగబోతోందనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సింధూ జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడం అంటే యుద్ధానికి సంకేతం ఇచ్చినట్లే అనే వ్యాఖ్యలు పాక్ నుంచి వినిపిస్తోన్న పరిస్థితి! ఈ నేపథ్యంలో భారత్ లో వరుస కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

అవును... జమ్మూకశ్మీర్ లో పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. మరోపక్క బోర్డర్ లో భారత సైన్యం ఉగ్రవాదుల కోసం వేట కొనసాగిస్తుంది. మరోపక్క.. పాక్ తో సింధూ జలాల ఒప్పందాన్ని తక్షణమే నిలిపేస్తున్నట్లు కేంద్రం బుధవారం ప్రకటించింది. పాక్ జాతీయుల అన్ని వీసాలూ రద్దు చేసింది.

మరోపక్క పాక్ సైతం భారత విమానాలకు గగనతలాన్ని మూసివేసింది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపేస్తున్నట్లు భారత్ ప్రకటించడాన్ని తప్పు పడుతోంది. ఈ సమయంలో ఏమి జరగబోతోందనే ఉత్కంఠ నెలకోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు.

ఈ పరిణామల నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన పలు అంశాలను ఈ సందర్భంగా వీరిరువురూ.. ప్రథమ మహిళకు వివరించినట్లు తెలుస్తోంది. ఈ కీలక భేటీకి సంబంధించిన ఫోటోను రాష్ట్రపతి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

మరోపక్క పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో చైనా సహా జీ20 దేశాల ఎంపిక చేసిన రాయబారులతో భారత విదేశాంగ శాఖ సమావేశం నిర్వహించింది. ఈ భేటీ సుమారు 30 నిమిషాల పాటు కొనసాగినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో దౌత్యపరంగా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్న భారత్.. నెక్స్ట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుందనేది ఆసక్తిగా మారింది.

Tags:    

Similar News