మాటల్లో జుట్టు.. చేతల్లో కాళ్లు.. మరోసారి పట్టుకున్న పాకిస్థాన్!

ఈ కాల్పుల విరమణ పాకిస్థాన్ కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6 గంటలకు లేదా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటల నుంచి 48 గంటల పాటు అమల్లోకి రానుంది!;

Update: 2025-10-15 15:00 GMT

మాటల్లో మాత్రం అందితే జుట్టు.. చేతల్లో మాత్రం అందకపోతే కాళ్లు పట్టుకునే విద్యలో పాకిస్థాన్ ఆరితేరిందనే చెప్పాలి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ దెబ్బకు, అబ్బా అని అరిచిన పాక్.. సీజ్ ఫైర్ కోసం భారత అధికారులతో మాట్లాడి కాళ్ల బేరానికి వచ్చిన సంగతి తెలిసిందే! అయితే మీడియా ముందు మాత్రం.. తామే భారత్ ను వదిలేశామనే కబుర్లు చెప్పుకుని ఆత్మవంచన చేసుకున్న పరిస్థితి!

భారత్ తో జరిగిన అనుభవం సంగతి అలా ఉంచితే.. గత కొన్ని రోజులుగా ఆఫ్గాన్ సైన్యం చేతుల్లో పాక్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది! పైకి... ఆఫ్గాన్ సైన్యాన్ని తాము వణికించేశామని చెప్పుకుంటుంది.. లోలోన మాత్రం తన సైన్యాన్ని, తాజాగా యుద్ధ ట్యాంకులను సైతం ఆఫ్గాన్ కు అప్పగించుకుంది! ఈ సమయంలో తాజాగా ఆఫ్గాన్ తో సీజ్ ఫైర్ కోసం కాళ్ల బేరానికి వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో పాక్ వ్యవహారం మరోసారి చర్చనీయాంశం గా మారింది.

అవును... బుధవారం తెల్లవారుజామున పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో జరిగిన హింసలో డజన్ల కొద్దీ ప్రజలు మరణించగా, అనేక మంది గాయపడిన సంగతి తెలిసిందే. మరోవైపు పాకిస్థాన్ సైన్యాన్ని సజీవంగా బంధించిన ఆఫ్గాన్ సైన్యం.. వారితో పాటు పాక్ యుద్ధ ట్యాంకులను తమ దేశానికి తీసుకెళ్లినట్లు కనిపించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఈ సమయంలో రెండు దేశాలు 48 గంటల కాల్పుల విరమణకు అంగీకరించాయి.

ఈ కాల్పుల విరమణ పాకిస్థాన్ కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం 6 గంటలకు లేదా భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటల నుంచి 48 గంటల పాటు అమల్లోకి రానుంది! ఈ సందర్భంగా... పరిష్కరించదగిన ఈ సమస్యకు సానుకూల పరిష్కారాన్ని కనుగొనడానికి ఇరుపక్షాలు చర్చల ద్వారా నిజాయితీగా ప్రయత్నాలు చేస్తాయని ఇస్లామాబాద్ ఒక ప్రకటనలో తెలిపింది.

ఇదే సమయంలో... ఆఫ్ఘనిస్తాన్ కాల్పుల విరమణ కోరిందని పాకిస్తాన్ పేర్కొంది. అయితే... ఆఫ్ఘన్ తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి స్పందిస్తూ... ఇస్లామాబాద్ కాల్పుల విరమణపై చేసిన వాదనతో విభేదిస్తూ.. పాకిస్తాన్ వైపు అభ్యర్థన మేరకు, ఈ సాయంత్రం రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరుగుతుంది అని అన్నారు. దీంతో... సరిహద్దుల్లో వరుస దెబ్బల వేళ తాలిబాన్ల వద్దకు పాక్ సీజ్ ఫైర్ కోసం కాళ్ల బేరానికి వెళ్లిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

పాక్ యుద్ధ ట్యాంక్‌ లను స్వాధీనం చేసుకున్న తాలిబన్లు!:

సరిహద్దుల్లో పోరాటం తీవ్రతరం కావడంతో.. తాలిబన్ యోధులు పెద్ద సంఖ్యలో పాకిస్తానీ సైనికులను చంపి.. ఆయుధాలు, సాయుధ వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కాందహార్‌ లో జరిగిన ఘర్షణల సమయంలో బంధించబడినట్లు చెప్పబడుతున్న పాకిస్తాన్ యుద్ధ ట్యాంక్‌ ను తాలిబన్లు స్వారీ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది! దీంతో.. ఇది పాక్ కు పెద్ద దెబ్బే అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

మధ్యవర్తుల కోసం పాక్ పిలుపులు!:

సరిహద్దుల్లో పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో.. తక్షణ మధ్యవర్తిత్వం కోసం ఖతార్, సౌదీ అరేబియాలవైపు పాక్ చూసింది.. రెండు దేశాలు వెంటనే జోక్యం చేసుకుని పూర్తి స్థాయి సంఘర్షణను నిరోధించడంలో సహాయం చేయాలని పాక్ అధికారులు విజ్ఞప్తి చేసినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలొస్తున్నాయి! ఈ సందర్భంగా... దేవుని దయవల్ల ఆఫ్గన్లు పోరాడకుండా ఆపండి అని ఒక పాకిస్తాన్ అధికారి చెప్పినట్లు నివేధించబడింది!

Tags:    

Similar News