మీ ఆదాయం ఎంత? కుటుంబ ఆర్జన ఎంత? ఈ వివరాలు తప్పకుండా చెప్పాల్సిందేనా..

దేశంలో 15 ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో ముసాయిదా ప్రశ్నావళితో ప్రయోగాత్మకంగా కుటుంబ ఆదాయ సర్వే ఆగస్టులో నిర్వహించారు.;

Update: 2025-10-28 00:30 GMT

కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ ప్రజల ఆదాయంపై కచ్చితమైన లెక్కలు సేకరించాలని భావించిన ప్రధాని మోదీ ప్రభుత్వం తొలిసారిగా కీలక సర్వేకు రెడీ అవుతోంది. దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కుటుంబ ఆదాయ సర్వేను చేపట్టాలని నిర్ణయించింది. ప్రజల ఆదాయ, వ్యయాల్లో అసమానతలు తగ్గించాలనే లక్ష్యంతో కేంద్రం చేపడుతున్న ఈ సర్వే వివాదాస్పదంగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వాలు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సమాచార సేకరణకు మాత్రమే పరిమితమయ్యేవి. ఈ అంశాలను తెలుసుకునేందుకు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేసేవి. కానీ తొలిసారిగా కుటుంబాల ఆదాయం తెలుసుకోవాలని ప్రయత్నించడం చర్చనీయాంశమవుతోంది.

జాతీయ కుటుంబ ఆదాయ సర్వే (ఎన్.హెచ్.ఐ.ఎస్)కు కేంద్రం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ప్రజల ఆదాయ పంపిణీ, అందులోని అసమానతలను అర్థం చేసుకుని దాన్ని భర్తీ చేయడమే లక్ష్యంగా ఈ సర్వే చేపడుతోంది. జాతీయ గణాంక కార్యాలయం ద్వారా కేంద్ర గణాంకాల, కార్యక్రమ అమలు మంత్రిత్వశాఖ ఈ సర్వే నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. కుటుంబ ఆదాయ, వ్యయ నమూనాలు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆదాయ వనరులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించనున్నారు. ఈ సర్వేలో లభించిన సమాచారంతో అసమానతలు అంచనా వేయనున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం గత ఆగస్టులోనే సన్నాహాలు ప్రారంభమయ్యాయి.

దేశంలో 15 ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో ముసాయిదా ప్రశ్నావళితో ప్రయోగాత్మకంగా కుటుంబ ఆదాయ సర్వే ఆగస్టులో నిర్వహించారు. దేశరాజధాని ఢిల్లీతోపాటు ఆర్థిక రాజధాని ముంబై, కోలుకత్తా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో సంపన్నులు, పేదలు అధికంగా నివసించే వేర్వేరు ప్రాంతాల్లో కుటుంబ ఆదాయ సర్వేను ప్రయోగాత్మకంగా నిర్వహించినట్లు సమాచారం. ఇందులో లభించిన సమాచారాన్ని విశ్లేషించి తయారు చేసిన ముసాయిదా పత్రాన్ని ప్రజల ముందు ఉంచి వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని కేంద్రం భావిస్తోంది. పరిశోధకులు, విధాన రూపకర్తలు, ప్రజలు ఈ నెలాఖరులోగా తమ సూచనలు తెలియజేయాలని సంబంధిత మంత్రిత్వ శాఖ కోరుతోంది.

అయితే, కుటుంబ ఆదాయ సర్వేకు ప్రజలు సహకరిస్తారా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. దేశంలో ప్రజలు వాస్తవ సంపాదనకు వారు ప్రభుత్వానికి తెలియజేస్తున్న లెక్కలకు ఎక్కడా పొంతన ఉండటం లేదు. దీనికి కారణం సంక్షేమ పథకాలకు ఆదాయ స్థితిగతులనే ప్రభుత్వం గీటురాయిగా తీసుకోవడమే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనాభాలో 80 శాతం మంది తమ వాస్తవ సంపాదనను దాచిపెట్టి రేషన్ కార్డులు పొందుతున్నారు. ఈ కారణంగానే ప్రజల వినియోగ స్థితిగతులకు మించి ఉచిత పథకాలు అమలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయంటున్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారికే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా నిబంధనలు ఉండటంతో ప్రజలు తమ వాస్తవ ఆదాయాన్ని ఎక్కడా చెప్పడం లేదని అంటున్నారు. ఇప్పుడు ఈ వివరాలను కచ్చితంగా తెలుసుకోవాలని కేంద్రం భావించడమే చర్చనీయాంశంగా మారింది. కేంద్రం సర్వేకు ప్రజలు సహకరించే పరిస్థితి ఉందా? అనేది ఉత్కంఠ రేపుతోంది.

Tags:    

Similar News