బ్రహ్మోస్ కంటే భీకరం... భారత్ అమ్ములపొదిలో సరికొత్త క్షిపణి!
అవును... రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధిస్తున్న భారత్.. అధునాతన క్షిపణి వ్యవస్థలపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో హైపర్ సోనిక్ క్షిపణి ప్రయోగాలను ముమ్మరం చేస్తోంది.;
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో ప్రత్యర్థుల గుండెల్లో దడ పుట్టించిన ‘బ్రహ్మోస్’ గురించి తెలిసిందే. టార్గెట్ ఫిక్స్ చేస్తే నేరుగా వెళ్లి అల్లకల్లోలం సృష్టించడంలో ఈ క్షిపణి లెక్కే వేరు. ఈ క్రమంలో ఈ బ్రహ్మోస్ క్షిపణి కంటే భీకరంగా పని చేస్తాయని అంచానా వేస్తోన్న మరో కొత్త క్షిపణి ప్రయోగాలను భారత్ ముమ్మరం చేస్తోంది.
అవును... రక్షణ రంగంలో స్వయంసమృద్ధి సాధిస్తున్న భారత్.. అధునాతన క్షిపణి వ్యవస్థలపై దృష్టి సారిస్తోంది. ఈ క్రమంలో హైపర్ సోనిక్ క్షిపణి ప్రయోగాలను ముమ్మరం చేస్తోంది. ఇందులో భాగంగా హైపర్ సోనిక్ గ్లైడ్ వెహికల్ (హెచ్.జీ.వీ) "ధ్వని" పరీక్షలను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీ.ఆర్.డీ.ఓ) ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
వాస్తవానికి హైపర్ సోనిక్ క్రూజ్ క్షిపణులకు భిన్నంగా ఈ నూతన గ్లైడ్ వెహికల్ ఉంటుందని.. రాకెట్ సాయంతో అత్యంత ఎత్తుకు వెళ్లి, అక్కడ నుంచి విడిపోయి హైపర్ సోనిక్ వేగంతో లక్ష్యంవైపు దూసుకెళ్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో... ఇప్పటికే ఎయిర్ ఫ్రేమ్ ఏరోడైనమిక్స్, థర్మల్ మేనేజ్మెంట్, స్క్రామ్ జెట్ ఇంజిన్ పనితీరు, గైడెన్స్ వ్యవస్థకు సంబంధించి గ్రౌండ్, ఫ్లైట్ పరీక్షలు చేసింది.
ఈ క్రమంలో ఈ ఏడాది చివరి నాటికి 'ధ్వని' పూర్తి స్థాయి పరీక్షలు జరిపేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్షిపణులు బ్రహ్మోస్ కంటే భీకరంగా పనిచేస్తాయని అంటున్నారు. ఇదే సమయంలో... ధ్వని వేగానికి ఐదారు రెట్ల కంటే అధిక వేగంతో ఈ "ధ్వని" క్షిపణులు ప్రయాణించగలవని.. ఫలితంగా సుదూర లక్ష్యాలను నిమిషాల్లో ఛేదించగలవని చెబుతున్నారు.
ఈ క్షిపణులు గంటకు సుమారు 7,400 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లేలా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో... 1,500 నుంచి 2వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగలదని అంచనా వేస్తున్నారు! ప్రధానంగా విపరీతమైన వేగంతో పాటు దిశను మార్చుకునే సామర్థ్యం ఉండడంతో శత్రుదేశాల గగనతల రక్షణ వ్యవస్థలకు స్పందించే సమయం కూడా ఇవ్వదని నిపుణులు చెబుతున్నారు.
అంటే... ఇటువంటి సామర్థ్యాలు ఉన్న క్షిపణులను.. ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థ 'ఐరన్ డోమ్', అమెరికా 'థాడ్' వంటి అధునాతన కవచాలతో సహా ఇప్పటికే ఉన్న క్షిపణి రక్షణ వ్యవస్థల ద్వారా అడ్డగించడం చాలా కష్టతరం చేస్తుందని రక్షణ రంగ నిపుణులు అంటున్నారు. ఈ ప్రతిపాదిత ఆయుధం నేరుగా డీ.ఆర్.డీ.ఓ హైపర్ సోనిక్ టెక్నాలజీ డెమోన్ స్ట్రేటర్ వెహికల్ విజయంపై ఆధారపడి ఉంటుంది!