బంగారంపై భారీ షాక్.. దెబ్బ వేసిన మోడీ సర్కార్

పసిడి ప్రియులకు కేంద్ర ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు సామాన్యులకు మరింత భారంగా మారనున్నాయి.

Update: 2026-05-13 04:45 GMT

పసిడి ప్రియులకు కేంద్ర ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు సామాన్యులకు మరింత భారంగా మారనున్నాయి. బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై సుంకాన్ని కేంద్రం ఒక్కసారిగా రెట్టింపు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 5 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని 10 శాతానికి పెంచుతూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేయగా ఈ కొత్త ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి.

హైదరాబాద్ సభలో ప్రధాని మోడీ "ఏడాది పాటు బంగారం కొనడం తగ్గించాలి" అని పిలుపునిచ్చిన రెండు రోజులకే ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. ప్రస్తుతం మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1.40 లక్షల మార్కును దాటగా తాజా పెంపుతో ధరలు మరిన్ని రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. పెరుగుతున్న దిగుమతుల వల్ల దేశ విదేశీ మారక నిల్వలపై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకే కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు ఆహార ద్రవ్యోల్బణం సామాన్యుడిని వేధిస్తుంటే మరోవైపు ఈ 'గోల్డెన్ షాక్' మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బతీసేలా కనిపిస్తోంది.

ఈ నిర్ణయం కేవలం బంగారం, వెండి మాత్రమే కాకుండా.. ఆభరణాల తయారీలో ఉపయోగించే ఇతర విలువైన లోహాలు, ముడి పదార్థాలు, పారిశ్రామిక అవసరాలకు దిగుమతి చేసే కొన్ని వస్తువులపైనా ప్రభావం చూపనుంది. దీంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పటికే రూ.1.40 లక్షలకు పైగా ట్రేడ్ అవుతుండగా.. తాజా సుంకాల పెంపుతో ఆ ధరలు మరింత ఎగిసిపడే పరిస్థితి కనిపిస్తోంది.

ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భారతీయులు ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు తగ్గించాలని ఆయన పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ వ్యాఖ్యలు రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అయితే ఆ వ్యాఖ్యల తర్వాత రెండు రోజులకే కేంద్రం సుంకాల పెంపు నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.

ఇటీవలి కాలంలో బంగారం దిగుమతులు భారీగా పెరగడం కేంద్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నప్పటికీ భారతీయులు బంగారం కొనుగోళ్లు తగ్గించకపోవడం గమనార్హం. ముఖ్యంగా పెట్టుబడుల పరంగా చాలామంది స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, చిన్న వ్యాపారాలు వంటి ఇతర రంగాల కంటే బంగారానికే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మార్కెట్ నిపుణులు కూడా బంగారంలో పెట్టుబడి పెట్టాలని వరుసగా సూచనలు చేస్తుండటంతో బంగారం డిమాండ్ మరింత పెరిగింది.

దీంతో దేశ విదేశీ మారకద్రవ్య నిల్వలపై ఒత్తిడి పెరుగుతోందని కేంద్రం భావిస్తోంది. భారీ స్థాయిలో బంగారం దిగుమతులు జరగడం వల్ల విదేశీ కరెన్సీ వ్యయం అధికమవుతోంది. అందుకే బంగారం కొనుగోళ్లను కొంత మేర నియంత్రించాలనే ఉద్దేశంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థిక వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు తగ్గితే విదేశీ మారక నిల్వలు బలోపేతం అవుతాయని కేంద్రం అంచనా వేస్తోంది.

ఇక మరోవైపు దేశంలో ద్రవ్యోల్బణం కూడా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు సామాన్యులకు భారంగా మారుతున్నాయి. ఏప్రిల్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం నాలుగు నెలల గరిష్టానికి చేరుకుంది. జనవరిలో 2.74 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం.. ఇప్పుడు 3.48 శాతానికి పెరిగింది. దీనికి ప్రధాన కారణం ఆహార వస్తువుల ధరల పెరుగుదలేనని నిపుణులు చెబుతున్నారు. కొన్ని కూరగాయల ధరలు తగ్గినా.. ఇతర నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగాయి.

అలాగే జ్యువెలరీ, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో కూడా ధరల భారం పెరుగుతోంది. ఏప్రిల్ నెలలో ఈ విభాగాల్లో ద్రవ్యోల్బణం 53.61 శాతానికి చేరుకోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. కేంద్రం తాజా నిర్ణయంతో బంగారం మార్కెట్‌లో మరింత కలకలం రేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇకపై బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు మరింత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.

Tags:    

Similar News