మోడీ మాట అంత పవర్ ఫుల్లా? బంగారం డిమాండ్ అంత తగ్గిందా?

విలువైన విదేశీ మారకద్రవ్యం బంగారం కొనుగోలు కారణంగా దేశాన్ని దాటేస్తుందని.. దానికి చెక్ చెప్పేందుకు పసిడి మీద మోజును తగ్గించుకోవాలని.. ఏడాది పాటు బంగారు ఆభరణాల కొనుగోలు తగ్గించాలని ఇటీవల ఆయన పేర్కొనటం తెలిసిందే.

Update: 2026-05-31 06:32 GMT

దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఛరిష్మా ఏ మాత్రం తగ్గలేదన్న విషయం మరోసారి నిరూపితమైంది. ఆయన చెప్పే మాటలకు.. ఇచ్చే సందేహాలకు మాత్రమే కాదు.. ఏదైనా అంశంపై పిలుపు ఇస్తే.. దేశ ప్రజలు ఆ మాటల్ని ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారన్న దానికి నిదర్శనంగా బంగారం కొనుగోళ్ల మీద తగ్గిన ఆసక్తిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. విలువైన విదేశీ మారకద్రవ్యం బంగారం కొనుగోలు కారణంగా దేశాన్ని దాటేస్తుందని.. దానికి చెక్ చెప్పేందుకు పసిడి మీద మోజును తగ్గించుకోవాలని.. ఏడాది పాటు బంగారు ఆభరణాల కొనుగోలు తగ్గించాలని ఇటీవల ఆయన పేర్కొనటం తెలిసిందే.

వ్యక్తుల ఇష్టాఇష్టాలకు సంబంధించి దేశ ప్రధాని హోదాలో ఆయన ఇచ్చిన పిలుపు ఏ మేర పని చేస్తుందన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అదే సమయంలో ఇటీవల కాలంలో మోడీ ఇమేజ్ తగ్గిందన్న ప్రచారం సోషల్ మీడియాలో భారీగా సాగుతున్న నేపథ్యంలో.. ఈ పిలుపు ఆయన ఇమేజ్ ను దెబ్బ తీస్తుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అయితే.. అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొనటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బంగారాన్ని కొనటం తగ్గించాలన్న ప్రధాని మోడీ మాటకు దేశ ప్రజలు తూచా తప్పకుండా ఫాలో అవుతున్న విషయం వెల్లడైంది.

దేశంలో బంగారం డిమాండ్ భారీగా తగ్గినట్లుగా వ్యాపార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పసిడి వినియోగాన్ని తగ్గించాలన్న ప్రధాని మాటతో పాటు.. అందుకు తగ్గట్లే పసిడి మీద ఉన్న దిగుమతి సుంకాన్ని ఆరు శాతం నుంచి 15 శాతానికి పెంచిన వైనం కూడా వ్యాపారం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నట్లుగా చెబుతున్నారు. గత ఏడాది మే నెలలో 25 టన్నుల మేర బంగారం డిమాండ్ ఉంటే.. ఈ నెల 13న సుంకాలు పెరించిన తర్వాత పదిహేను రోజుల్లో 7.5 టన్నులకు పడిపోయినట్లుగా వ్యాపార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇండియన్ బులియన్.. జ్యూయలరీ అసోసియేషన్ కార్యదర్శి సైతం ఇదే విషయాన్ని వెల్లడించారు. బంగారం కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా తగ్గిందని పేర్కొన్న ఆయన మరిన్ని అంశాల్ని చెప్పారు. దిగుమతి సుంకంతో పాటు జీఎస్టీ కూడా పెరిగిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ.. మొత్తం అన్ని రకాల పన్నులు 9.18 శాతం నుంచి 18.45 శాతానికి పెరిగినట్లుగా పేర్కొన్నారు. దీంతో బంగారాన్ని కొనుగోలు చేసే విషయంలో ప్రజలు ఆసక్తి చూపటం లేదన్నారు. ప్రధాని మోడీ బంగారం కొనుగోలు అంశంపై ఇచ్చిన పిలుపు ప్రజల మీద ప్రభావం చూపిందని.. అమ్మకాలు భారీగా తగ్గాయన్న విషయాన్ని వ్యాపార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దేశ హితం కోసం ప్రధాని మోడీ ఇచ్చిన పిలుపునకు ప్రజలు సైతం అదే తీరులో స్పందించటం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News