ప్రపంచ ఆర్థిక రేసులో భారత్‌కు ఎదురుదెబ్బ: 6వ స్థానానికి పతనం.. కారణం రూపాయి బలహీనతలేనా?

ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన భారత్‌కు అంతర్జాతీయ వేదికపై ఊహించని పరిణామం ఎదురైంది.;

Update: 2026-04-20 09:50 GMT

ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపు పొందిన భారత్‌కు అంతర్జాతీయ వేదికపై ఊహించని పరిణామం ఎదురైంది. గత కొంతకాలంగా ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆశించిన భారత్ తాజా అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) అంచనాల ప్రకారం ఆరో స్థానానికి పరిమితమైంది. గతంలో భారత్ చేతిలో ఓడిపోయి ఐదో స్థానానికి పడిపోయిన యునైటెడ్ కింగ్‌డమ్ (యూకే) మళ్లీ పుంజుకుని తన పాత స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.

అంచనాలు ఎందుకు తలకిందులయ్యాయి?

2025 ఏప్రిల్ నాటి ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం.. 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి భారత్ జీడీపీ $4,187 బిలియన్లకు చేరుకుని.. జపాన్‌ను వెనక్కి నెట్టి నాలుగో స్థానానికి చేరుకుంటుందని భావించారు. అయితే 2026 ఏప్రిల్‌లో విడుదలైన 'వరల్డ్ ఎకనామిక్ అవుట్‌లుక్' నివేదిక విభిన్నమైన చిత్రాన్ని ఆవిష్కరించింది. తాజా గణాంకాల ప్రకారం.. భారత్ జీడీపీ $3,916 బిలియన్లు (6వ స్థానం), యూకే జీడీపీ $4,003 బిలియన్లు (5వ స్థానం), జపాన్ జీడీపీ $4,435 బిలియన్లు (4వ స్థానం)లో నిలిచింది.

ప్రధాన విలన్‌గా మారిన 'రూపాయి' పతనం

అంతర్జాతీయ స్థాయిలో దేశాల ఆర్థిక శక్తిని అమెరికన్ డాలర్ల విలువలో కొలుస్తారు. ఇక్కడే భారత్‌కు చిక్కులు వచ్చి పడ్డాయి. దేశీయంగా వృద్ధి రేటు బాగున్నప్పటికీ, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ గణనీయంగా పడిపోవడం జీడీపీ గణాంకాలను ప్రభావితం చేసింది. 2024లో డాలర్ విలువ ₹84.57 ఉండగా, 2025 నాటికి అది ₹88.48కు పడిపోయింది. 2026 నాటికి ఇది మరింత క్షీణించి ₹92.59 వరకు వెళ్లే అవకాశం ఉందని ఐఎంఎఫ్ అంచనా వేస్తోంది.

రూపాయి బలహీనపడటానికి విదేశీ పెట్టుబడుల ప్రవాహం తగ్గడం.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల ముడి చమురు ధరలు పెరగడం.. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాలపై నెలకొన్న అనిశ్చితి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

బేస్ ఇయర్ మార్పు .. సాంకేతిక కారణాలు

మరో కీలక అంశం ఏమిటంటే, భారత ప్రభుత్వం జీడీపీ లెక్కల కోసం 'బేస్ ఇయర్' (ప్రామాణిక సంవత్సరం) ను 2011-12 నుండి 2022-23కు మార్చింది. జీఎస్టీ అమలు.. కోవిడ్ అనంతర ఆర్థిక మార్పులను పరిగణనలోకి తీసుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే పాత పద్ధతిలో 2025-26 జీడీపీ ₹35,713,886 కోట్లుగా ఉండాల్సి ఉండగా కొత్త విధానంలో అది ₹34,547,157 కోట్లకు తగ్గింది. ఈ సాంకేతిక మార్పు కూడా అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో మన స్థాయిని కొంత తగ్గించింది.

నిపుణుల భరోసా.. ఇది తాత్కాలికమే!

ప్రస్తుత పతనం ఆందోళన కలిగించినప్పటికీ, ఆర్థిక నిపుణులు మాత్రం భారత్ భవిష్యత్తుపై ధీమాగా ఉన్నారు. రూపాయి విలువలో హెచ్చుతగ్గులు.. గణాంక పద్ధతుల్లో మార్పులు కేవలం స్వల్పకాలిక ప్రభావమేనని వారు విశ్లేషిస్తున్నారు. భారతదేశ అంతర్గత వృద్ధి రేటు ఇప్పటికీ ప్రపంచంలోని ఇతర అభివృద్ధి చెందిన దేశాల కంటే మెరుగ్గా ఉంది. వచ్చే రెండు మూడేళ్లలో భారత్ మళ్లీ పుంజుకుని, 2027 నాటికి జపాన్, యూకేలను దాటి ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతానికి భారత్ 6వ స్థానానికి జారినప్పటికీ మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ విప్లవం.. పెరుగుతున్న తయారీ రంగం దేశాన్ని మళ్లీ అగ్రపథాన నిలబెట్టనున్నాయి. రూపాయిని స్థిరీకరించడం..ఎగుమతులను పెంచడం ద్వారా భారత్ తన లక్ష్యాన్ని ఖచ్చితంగా చేరుకోగలదు. మన ఆర్థిక ప్రయాణంలో ఇది ఒక చిన్న 'స్పీడ్ బ్రేకర్' మాత్రమే!

Tags:    

Similar News