భారత్ లో ఎఫ్.సీ.ఆర్ఏ మార్పులు.. అమెరికాలో ఆందోళన.. అసలేంటి కథ?
భారతదేశంలో విదేశీ నిధుల నియంత్రణకు సంబంధించిన విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్.సీ.ఆర్ఏ)లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.
భారతదేశంలో విదేశీ నిధుల నియంత్రణకు సంబంధించిన విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్.సీ.ఆర్ఏ)లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులు ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సవరణలపై అమెరికా కాంగ్రెస్‌కు చెందిన డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీల ఎంపీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ మార్పుల వల్ల భారత్‌లోని స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు), పౌర సమాజ సంస్థల (సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ ) స్వతంత్ర కార్యకలాపాలకు తీవ్ర ఆటంకం కలిగే ప్రమాదం ఉందని వారు పేర్కొన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ పరిణామం ప్రస్తుతం దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ దౌత్య, రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.
జాతీయ భద్రత, పారదర్శకతకే ప్రాధాన్యమంటున్న ప్రభుత్వ వాదన
ఎఫ్.సీ.ఆర్ఏ చట్టం ద్వారా విదేశాల నుంచి వచ్చే నిధుల వినియోగాన్ని పారదర్శకంగా మార్చడమే తమ ప్రధాన ఉద్దేశమని కేంద్ర ప్రభుత్వం, దాని మద్దతుదారులు గట్టిగా వాదిస్తున్నారు. దేశ అంతర్గత విషయాల్లో లేదా విధాన నిర్ణయాల్లో విదేశీ శక్తుల జోక్యాన్ని అరికట్టడానికి ఈ కఠిన నిబంధనలు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. విదేశీ నిధులు పొందే ప్రతి సంస్థ పూర్తి బాధ్యతతో లెక్కలతో వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లకుండా చూడటానికి.. నిధుల దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి ఈ చట్ట సవరణలు తప్పనిసరని అధికార వర్గాలు సమర్థిస్తున్నాయి.
విమర్శకుల ఆందోళన.. పౌర సమాజ స్వేచ్ఛకు విఘాతం?
మరోవైపు ఈ ప్రతిపాదిత మార్పులపై మానవ హక్కులు, పర్యావరణ పరిరక్షణ, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే పలు స్వచ్ఛంద సంస్థలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. "కఠినమైన నిబంధనలు క్షేత్రస్థాయిలో నిజాయితీగా పనిచేసే సంస్థల మనుగడను ప్రశ్నార్థకం చేస్తాయి. పౌర సమాజ సంస్థల స్వేచ్ఛను పరిమితం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది కాదు" అని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. చిన్న , మధ్యతరహా స్వచ్ఛంద సంస్థలు ఈ నిబంధనల వల్ల పాలకుల ఒత్తిళ్లకు లోనయ్యే అవకాశం ఉందనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.
అంతర్జాతీయ స్పందనపై భిన్న స్వరాలు
అమెరికా ఎంపీల తాజా వ్యాఖ్యలు భారత్‌లో సరికొత్త రాజకీయ చర్చకు తెరలేపాయి. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ మద్దతుదారులు ఈ పరిణామాన్ని ఒక సానుకూల కోణంలో చూస్తున్నారు. విదేశీ నిధుల ప్రభావాన్ని నియంత్రించేలా భారత్ తీసుకుంటున్న చర్యలు సరైన దిశలోనే ఉన్నాయని.. అందుకే అమెరికా రాజకీయ వర్గాల్లో వణుకు మొదలైందని వారు సోషల్ మీడియా వేదికగా వాదిస్తున్నారు.
ఏదేమైనప్పటికీ ఈ ప్రతిపాదిత ఎఫ్.సీ.ఆర్ఏ మార్పులపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా అధికారికంగా పూర్తి స్థాయి స్పష్టత రావాల్సి ఉంది. ఈ బిల్లు రూపకల్పన, అమలుపై మున్ముందు దేశీయంగా రాజకీయ సెగలు రేగడమే కాకుండా భారత్-అమెరికా దౌత్య సంబంధాలపై కూడా దీని ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.