140 కోట్ల మంది కలల సాకారానికి మోడీ భరోసా !

దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజల కలలు వారి ఆకాంక్షలు కచ్చితంగా నెరవేరుతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు.

Update: 2026-06-11 03:00 GMT

దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజల కలలు వారి ఆకాంక్షలు కచ్చితంగా నెరవేరుతాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. ఎన్డీయే ఎల్లప్పుడూ దేశం కోసం పనిచేస్తూ ప్రజల విశ్వాసానికి మద్దతుగా నిలిచిందని ఆయన గుర్తు చేశారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఎన్డీయే కీలక సమావేశంలో మోడీ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తన ప్రభుత్వ పనితీరుతో దశాబ్దాలుగా దేశ ప్రజలను నిరాశపరిచిన తర్వాతనే ప్రజలు ఎన్డీయే ప్రభుత్వంపై నమ్మకం ఉంచారని గుర్తు చేశారు. అందుకే 2014లో ఉదయించిన ఆశాకిరణంగా ఎన్డీయే అవతరించి నేటికీ కొనసాగుతూ దేశ ప్రజల అతి పెద్ద ఆత్మ విశ్వాసంగా మారిందని ఆయన పేర్కొన్నారు.

వేగమే ఎన్డీయే లక్షణం :

సరైన సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం పని చేసినప్పుడు అభివృద్ధి వేగంగా జరుగుతుందని దేశ ప్రజలు మొదటిసారిగా ఆచరణలో చూశారని మోడీ అన్నారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో గత 12 ఏళ్లలో ఏకంగా 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుండి బయట పడటం ఒక గొప్ప రికార్డు అని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు వాటి దశ దిశ సరైనవని ఈ మార్పు నిరూపిస్తోందని ఆయన చెప్పారు.

జాతీయ స్థాయిలో రాజకీయ స్థిరత్వం అవసరం ప్రాముఖ్యతను దేశ ప్రజలు 2014 తరువాత సరిగ్గా అర్థం చేసుకున్నారని మోడీ అన్నారు. అందుకే ఇంత సుదీర్ఘ కాలం పాటు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని తనకు కల్పించారని ఆయన చెబుతూ ఇది ప్రజల పరిణతికి నిదర్శనమని పేర్కొన్నారు.

నాడు అయోమయం :

ఇదిలా ఉంటే 2014కు ముందున్న దశాబ్దాలలో జరిగిన అనేక పరిణామాల వల్ల తీవ్ర అస్థిరత గందరగోళం ఏర్పడింది అని మోడీ అన్నారు. దాని ఫలితంగా దేశం ఎంతో నష్టపోయిందని ఆయన గుర్తుచేశారు. ప్రజలు ఇప్పుడు ఒక స్థిరమైన ప్రభుత్వ పనితీరును చూస్తున్నారని ఎన్డీయే ప్రభుతం తీసుకునే నిర్ణయాత్మక విధానాలను అమలులో వాటి సామర్థ్యాన్ని చూసి అభినందిస్తున్నారని మోడీ అన్నారు. ఇక దేశంలోని ప్రతి పౌరుడు అభివృద్ధి చెందిన భారతదేశం అన్న కలను సాకారం చేసుకోవాలని చూస్తున్నారు అని మోడీ చెప్పారు. ఇది దేశంలోని ప్రతి ఒక్కరి కల అని ఈ రోజుకు అది సంకల్పంగా మారిందని చెప్పారు. అందువల్ల ఈ కల సాకారం కోసం ప్రతి ఒక్కరూ తమ ప్రతి క్షణాన్నీ అంకితం చేయాలని మోడీ పిలుపు ఇచ్చారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఆర్థిక పరమైన సంస్కరణలు రాజకీయ ఒత్తిడి వల్ల కాకుండా దృఢమైన సిద్ధాంతపరమైన విశ్వాసంతో తీసుకున్నవని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు.

భారత్ నిలకడగా ఉంది :

ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ప్రధాన దేశాల ఆర్థిక వ్యవస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో కూడా భారతదేశం 2025-26 లో 7.7 శాతం వృద్ధి రేటును సాధించిందని నరేంద్ర మోదీ గుర్తు చేశారు. మార్చి 31తో ముగిసిన గత త్రైమాసికంలో భారతదేశ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదైందని ఆయన అన్నారు. దేశం అత్యంత బలహీనమైన ఆర్థిక వ్యవస్థ నుండి బయటపడి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా మారిందని ఇది ఎన్డీయే ప్రభుత్వంలోనే సాకారం అయింది అన్నారు.

ఎన్నో గొప్ప నిర్ణయాలు :

ఇక గత పుష్కర కాలంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుందని మోడీ చెప్పారు. మహిళా రిజర్వేషన్లు, ట్రిపుల్ తలాక్ వ్యతిరేక చట్టం, సీఏఏ చట్టం, భారతీయ న్యాయ సంహిత సైనికుల కోసం వన్ ర్యాంక్-వన్ పెన్షన్ వంటి జాతీయ ప్రయోజనాలతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంలో ఎన్డీయే ప్రభుత్వం ఎప్పుడూ వెనుకాడలేదని మోడీ అన్నారు. రేపటి రోజున కూడా జాతీయ ప్రయోజనాల దృష్ట్యా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఇంకా వేగంగా ముందుకు ప్రభుత్వం సాగుతుందని ఆయన హామీ ఇచ్చారు.

ఎన్డీయే అభినందన :

ఇదిలా ఉంటే దేశంలో అత్యధిక కాలం పాటు ఎన్నికైన ప్రధానమంత్రిగా సేవలందించిన ఘనతను సాధించినందుకు గానూ నరేంద్ర మోదీని అభినందిస్తూ ఎన్డీయే ఒక తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, గొప్ప దేశానికి ప్రధానమంత్రిగా సేవ చేయడానికి సరైన సమయంలో సరైన స్థానంలో ఉన్న సరైన నాయకుడు నరేంద్ర మోడీ అని ఆయన అన్నారు.

Tags:    

Similar News