ట్రంప్ కు షాక్ ఇవ్వనున్న ఇండియా.. ఈయూతో ఎఫ్టీఏ
భారత్ పై ట్రంప్ టారిఫ్ ఆంక్షల నేపథ్యంలో.. భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషిస్తోంది. అందులో భాగంగా యూరోపియన్ యూనియన్ తో ఫ్రీట్రేడ్ ఒప్పందం కుదుర్చుకోనుంది.;
భారత్ పై ట్రంప్ టారిఫ్ ఆంక్షల నేపథ్యంలో.. భారత ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషిస్తోంది. అందులో భాగంగా యూరోపియన్ యూనియన్ తో ఫ్రీట్రేడ్ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈనెల 27న జరిగే భారత్-ఈయూ సమ్మిట్ లో ఒప్పందం జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఈయూతో ఒప్పందం భారత్ కు చాలా కీలకం. ఎందుకంటే.. అమెరికా ఇప్పటికే భారత్ పై టారిఫ్ విధించింది. అమెరికాలో భారత వస్తువులు మరింత ప్రియంగా మారాయి. అక్కడి ప్రజలు ప్రత్యామ్నాయంగా తక్కువ ధరలో లభించే వస్తువులవైపు వెళ్తున్నారు. దీంతో భారత వస్తువులకు డిమాండ్ తగ్గింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్ టారిఫ్ విధించిన రోజు నుంచి భారత్.. ప్రత్యామ్నాయ మార్కెట్లను అన్వేషిస్తోంది. అందులో భాగంగా ఈయూతో ఒప్పందం చేసుకునేందుకు చాలా రోజులుగా చర్చలు జరుగుతున్నాయి.
ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ?
రెండు లేదా అంత కంటే ఎక్కువ దేశాల మధ్య వాణిజ్యంలో ఎలాంటి టారిఫ్ లు, కోటాలు, వాణిజ్యపరమైన ఆంక్షలు లేకుండా ఉండటం, లేదా వాటిని తగ్గించడం. అదే సమయంలో అంతర్జాతీయ వాణిజ్యాన్ని ప్రమోట్ చేయడం ప్రధాన లక్ష్యం. తద్వారా ఆర్థిక వృద్ధి సాధించడం, ఉద్యోగాలు సృష్టించడం, ఒప్పందంలోని దేశాల మధ్య వస్తువులు, సేవల రవాణా సులభతరం చేయడం ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్ ప్రధాన లక్ష్యం.
భారత్ కు లాభం..
ఆర్థిక వృద్ధిని సాధించడానికి ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్ భారత్ కు చాలా అవసరం. ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్ తో ఎగుమతులు పెరుగుతాయి. విదేశీ పెట్టుబడులు వస్తాయి. అంతర్జాతీయ వ్యాపార సంబంధాలు బలోపేతమవుతాయి. ఈయూ మార్కెట్ లోకి ప్రవేశం ద్వారా భారత ఉత్పత్తులకు మార్కెట్ దొరుకుతుంది. తద్వారా ట్రేడ్ వాల్యూమ్స్ పెరుగుతాయి. టెక్సటైల్స్, ఇంజినీరింగ్ గూడ్స్, అగ్రికల్చరల్ ప్రాడక్ట్స్ కు డ్యూటీ ఫ్రీ లేదా ప్రాధాన్యత క్రమంలో ప్రవేశం దొరుకుతుంది. అదే సమయంలో ట్రంప్ వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు. భారత్ కు అమెరికా మాత్రమే కాదు.. ఇతర మార్కెట్లు కూడా ఉన్నాయన్న విషయంలో ట్రంప్ కు స్పష్టం అవుతుంది. పూర్తీగా అమెరికా మీద ఆధారపడితే టారిఫ్ ఆంక్షల సందర్భంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. ఈయూలాంటి పెద్ద మార్కెట్ లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగితే.. అలాంటి నష్టాన్ని నివారించడానికి, రిస్క్ తగ్గించడానికి దోహదం చేస్తాయి.
ఏ వస్తువుల ధరలు తగ్గుతాయి ?
భారత్ -ఈయూ మధ్య ఫ్రీట్రేడ్ అగ్రిమెంట్ తో చాలా వస్తువుల ధరలు తగ్గుతాయి. అదే విధంగా భారత్ నుంచి ఎగుమతులు పెరుగతాయి. బీఎండబ్ల్యూ, వోక్స్ వేగన్ కార్లతో పాటు, ఫ్రెంచ్ వైన్ తదితర వస్తువుల ధరలు తగ్గుతాయి. భారత్ నుంచి టెక్స్ టైల్స్, నగలు, కెమికల్స్, ఫార్మా వంటి ఎగుమతులు పెరుగుతాయి. ఇప్పటి వరకు మన దేశం నుంచి అమెరికాకు పెద్ద ఎత్తున ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్కెట్ దొరకడంతో అమెరికాపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉండదు.