ఎకనామిక్ ఇన్ ఇక్వాలిటీ రిపోర్ట్ లో సంచలన విషయాలు.. దేశ సంపద అంతా వారి చేతుల్లోనే..
గ్లోబల్ ఎకనామిక్ ఇన్‌ఇక్వాలిటీ రిపోర్ట్-2025 భారత్ గురించి చెబుతున్న నిజాలు, ఈ దేశ అభివృద్ధి కథలో ఒక పెద్ద ప్రశ్నార్థకాన్ని నిలబెడుతున్నాయి.;
దేశం వేగంగా ముందుకు దూసుకుపోతోంది. స్టాక్ మార్కెట్లు రికార్డులు బ్రేక్ చేస్తున్నాయి, బిలియనీర్‌ల సంఖ్య పెరుగుతోంది, అంతర్జాతీయ వేదికలపై ‘భారత ఆర్థిక శక్తి’ అనే మాట గర్వంగా వినిపిస్తోంది. కానీ ఈ వెలుగుల వెనుక మరో చీకటి నెమ్మదిగా కమ్ముకుంటోంది. అదే.. ఆదాయ అసమానత. గ్లోబల్ ఎకనామిక్ ఇన్‌ఇక్వాలిటీ రిపోర్ట్-2025 భారత్ గురించి చెబుతున్న నిజాలు, ఈ దేశ అభివృద్ధి కథలో ఒక పెద్ద ప్రశ్నార్థకాన్ని నిలబెడుతున్నాయి.
ఈ నివేదిక ప్రకారం.., దేశంలో సంపద కొద్ది మందిలోనే కేంద్రీకృతమవుతోంది. టాప్ 1 శాతం మంది చేతుల్లోనే దేశ సంపదలో సుమారు 40 శాతం ఉన్నట్లు అంచనా. అంటే వంద మందిలో ఒక్కరి వద్ద దాదాపు సగానికి దగ్గర సంపద ఉంటే.., మిగిలిన 99 మంది మిగతా భాగాన్ని పంచుకుంటున్నారు. ఇది కేవలం ఆర్థిక గణాంకం మాత్రమే కాదు.. ఇది సామాజిక అసమతుల్యతకు అద్దం పట్టే నిజం.
పేదరికం తగ్గినా.. పెరుగుతున్న అభద్రతా భావం..
దేశంలో పేదరికం తగ్గిందని అధికారిక గణాంకాలు చెబుతున్నా, జీవన వ్యయం పెరుగుదల, ఉద్యోగ భద్రతల లేమి, ఆరోగ్యం–విద్య వంటి మౌలిక అవసరాల ఖర్చులు చూస్తే సాధారణ కుటుంబాలపై భారం ఇంకా పెరుగుతూనే ఉంది. ఒకవైపు లగ్జరీ అపార్ట్‌మెంట్లు, ప్రైవేట్ జెట్లు, విలాసవంతమైన జీవితం.. మరోవైపు కనీస జీతంతో గడుపుతున్న కోట్ల మంది. ఈ విరుద్ధ దృశ్యాలే నేటి భారత ఆర్థిక వాస్తవం.
ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, ఈ అసమానతలు కేవలం సంపద పరిమితుల్లోనే కాకుండా అవకాశాల విషయంలోనూ పెరుగుతున్నాయి. మంచి విద్య, నాణ్యమైన ఆరోగ్య సేవలు, స్థిరమైన ఉద్యోగాలు ఇవన్నీ ఒక వర్గానికే అందుబాటులో ఉండగా, మిగిలిన పెద్ద జనాభా అనిశ్చితి మధ్య జీవిస్తోంది. ఇది తరతరాలుగా కొనసాగితే, సామాజిక చలనశీలత తగ్గి, పేదరికం ఒక చక్రంలా మారే ప్రమాదం ఉంది.
ప్రజాస్వామ్యానికి ముప్పు..!
గ్లోబల్ ఎకనామిక్ ఇన్‌ఇక్వాలిటీ రిపోర్ట్-2025 ఈ పరిస్థితిని కేవలం ఆర్థిక సమస్యగా కాకుండా, ప్రజాస్వామ్యానికి ముప్పుగా అభివర్ణిస్తోంది. ఎందుకంటే, అధిక సంపద కొద్ది మందిలో కేంద్రీకృతమైతే, రాజకీయ ప్రభావం కూడా అదే వర్గం చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉంది. విధాన నిర్ణయాలు, చట్టాలు, వనరుల పంపిణీ.. ఇవన్నీ సాధారణ ప్రజల కంటే ధనవంతుల ప్రయోజనాలకు అనుకూలంగా మారే ప్రమాదం ఉంది. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ మూల సూత్రానికే సవాల్.
ఫలాలు సమానంగా అందాలి..
ఇలాంటి పరిస్థితుల్లో ‘దేశం ఎదుగుతోంది’ అనే వాక్యం పూర్తిగా నిజమా అనే ప్రశ్న తలెత్తుతుంది. జీడీపీ పెరుగుదల మాత్రమే అభివృద్ధికి ప్రమాణమైతే, సమానత్వం, సామాజిక న్యాయం వంటి అంశాలు ఎక్కడ నిలుస్తాయి? అభివృద్ధి ఫలాలు సమానంగా పంచుకోబడకపోతే, ఆ వృద్ధి ఎంతకాలం నిలుస్తుంది? నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ అసమానతలను తగ్గించాలంటే కేవలం సంక్షేమ పథకాలు సరిపోవు. పన్నుల వ్యవస్థలో సమతుల్యత, సంపన్నులపై న్యాయమైన పన్నులు, నాణ్యమైన ప్రభుత్వ విద్య–ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులు, చిన్న–మధ్య తరహా ఉపాధి రంగాలకు మద్దతు – ఇవన్నీ కలిసే ఒక సమగ్ర పరిష్కారం కావాలి. ముఖ్యంగా, యువతకు అవకాశాలు సమానంగా అందేలా పాలసీలు రూపొందించాల్సిన అవసరం ఉంది.
మానవ వనరులను శక్తిగా మార్చాలి..
భారత్‌కు అపారమైన మానవ వనరులు ఉన్నాయి. ఆ శక్తిని నిజమైన అభివృద్ధిగా మార్చాలంటే, సంపద కేవలం కొద్దిమందిలోనే కాకుండా, విస్తృత ప్రజానీకంలోకి చేరాలి. లేకపోతే, ధనవంతులు మరింత ధనవంతులవుతూనే ఉంటారు… పేదలు అదే స్థితిలో నిలిచిపోతారు. అప్పుడు ప్రశ్న ఒక్కటే మిగులుతుంది – ఇది వృద్ధి దేశమా, లేక అసమానతలతో కూడిన అభివృద్ధి భ్రమనా?