వాహనదారులకు షాక్: పెట్రోల్‌లో కొత్త ఎథనాల్ మిశ్రమాలు.. మైలేజ్ తగ్గి, జేబుకు చిల్లు పడనుందా?

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో ఎథనాల్ మిశ్రమ ప్రమాణాలను ఈ22 నుంచి ఈ30 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Update: 2026-05-23 07:56 GMT

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్‌లో ఎథనాల్ మిశ్రమ ప్రమాణాలను ఈ22 నుంచి ఈ30 వరకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ గ్రీన్ మొబిలిటీ అడుగు సాధారణ వాహనదారుల జేబుకు చిల్లు పెట్టనుందా? మైలేజ్, ఇంజిన్ లైఫ్‌పై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? అన్నది చర్చనీయాంశమైంది.

దేశంలో గ్రీన్ మొబిలిటీ హరిత ఇంధనం లక్ష్యాలను వేగవంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరల హెచ్చుతగ్గులు, వెస్ట్ ఆసియాలో భౌగోళిక ఉద్రిక్తతల వల్ల పెరుగుతున్న దిగుమతి వ్యయాలను తగ్గించుకోవడానికి భారత్ ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ద్వారా ఈ22, ఈ25, ఈ27, ఈ30 వరకు అధిక ఎథనాల్ మిశ్రమ ఇంధనాలకు కొత్త నాణ్యత ప్రమాణాలను ప్రకటించింది. పర్యావరణానికి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది శుభవార్తే అయినప్పటికీ.. సాధారణ కార్లు, బైక్‌లు వాడే మధ్యతరగతి ప్రజల్లో మాత్రం ఇది కొత్త ఆందోళనలకు దారితీస్తోంది.

మైలేజ్ తగ్గే ఛాన్స్.. పెరగనున్న ఇంధన ఖర్చులు!

ఎథనాల్ మిశ్రమం పెరగడం వల్ల వాహనదారులపై నేరుగా ఆర్థిక భారం పడే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఎథనాల్‌లో దాదాపు 33 శాతం తక్కువ ఎనర్జీ డెన్సిటీ ఉంటుంది. ఇంజిన్ అదే స్థాయి శక్తిని ఉత్పత్తి చేయాలంటే ఎక్కువ ఇంధనాన్ని వినియోగించాల్సి వస్తుంది. దీనివల్ల వాహనాల మైలేజ్ తగ్గి, వాహనదారుల నెలవారీ ఇంధన ఖర్చులు గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంది.

పాత వాహనాలకు ‘ఇంజిన్’ ముప్పు?

ఈ కొత్త మార్పు ముఖ్యంగా పాత బీఎస్4 , ప్రారంభ దశ బీఎస్6 వాహనాలపై తీవ్ర ప్రభావం చూపవచ్చని ఆటోమొబైల్ రంగానికి చెందిన నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎందుకీ సమస్య?

పాత వాహనాల తయారీలో ఉపయోగించిన అల్యూమినియం భాగాలు, రబ్బరు గ్యాస్కెట్లు, సీల్స్, ప్లాస్టిక్ ఫ్యూయల్ లైన్స్ వంటివి అధిక ఎథనాల్‌ను తట్టుకోలేవు. దీనివల్ల దీర్ఘకాలంలో ఫ్యూయల్ పంప్ సమస్యలు తలెత్తడం.. ఇంజిన్ స్టార్టింగ్ ఇబ్బందులు రావడం.. ఫ్యూయల్ ట్యాంక్, ఇతర భాగాలు త్వరగా తుప్పు పట్టడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

ఇక 5 నుంచి 7 ఏళ్ల పాటు బ్యాంకు రుణాలతో వాహనాలు కొనుగోలు చేసిన మధ్యతరగతి వినియోగదారులకు.. మైలేజ్ తగ్గింపు, అదనపు మెయింటెనెన్స్ ఖర్చులు మరింత ఒత్తిడిని కలిగిస్తాయి. అంతేకాదు భవిష్యత్తులో ఈ పాత వాహనాల రీసేల్ వాల్యూ (అమ్మకం విలువ) కూడా పడిపోయే ప్రమాదం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ప్రపంచ దేశాల్లో ఎలా ఉంది?

ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు ఇప్పటికే ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నాయి. ఇక్కడ ఈ27 నుంచి ఈ30 వరకు ఎథనాల్ మిశ్రమాలు సర్వసాధారణం. అయితే అక్కడ మెజారిటీ వాహనాలు 'ఫ్లెక్స్-ఫ్యూయల్' టెక్నాలజీతో నడుస్తాయి. ప్రత్యేక ఇంజిన్ కంట్రోల్ యూనిట్లు , ఎథనాల్ నిరోధక భాగాలు ఉండటం వల్ల అక్కడ వాహనాల పనితీరు దెబ్బతినదు. యూఎస్‌లో ఈ10, ఈ15 సాధారణంగా అందుబాటులో ఉండగా.. ఈ85 వంటి అత్యధిక మిశ్రమ ఇంధనాలను కేవలం ప్రత్యేక ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలకు మాత్రమే పరిమితం చేశారు.

ప్రభుత్వం ఏమంటోంది? ఆందోళనలు నిజమేనా?

వాహనదారుల్లో ఉన్న భయాలను పోగొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, సంబంధిత సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. అసోసియేషన్ ఆఫ్ ఇండియా , ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ సంయుక్తంగా నిర్వహించిన పరీక్షల్లో.. ఈ20 ఇంధనం వల్ల వాహనాల్లో ఎలాంటి పెద్ద ఎత్తున ఇంజిన్ వైఫల్యాలు లేదా అసాధారణ నష్టాలు జరగలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. సాధారణ సర్వీసింగ్ సమయంలోనే పాత రబ్బరు భాగాలను ఎథనాల్‌ను తట్టుకునే కంపోనెంట్స్‌తో మార్చుకోవడం ద్వారా సమస్యలను అధిగమించవచ్చని సూచిస్తోంది. ప్రస్తుతం ఈ25, ఈ30 మిశ్రమాలపై 70 వేల కిలోమీటర్ల వరకు రియల్ వరల్డ్ టెస్టింగ్ నిర్వహించే బాధ్యతను అసోసియేషన్ ఆఫ్ ఇండియా , ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కి అప్పగించింది. పాత వాహనాల కోసం ప్రత్యేక 'రీట్రోఫిట్ కిట్లను' అందించే యోచనలో ప్రభుత్వం ఉంది. అలాగే వినియోగదారులపై భారం తగ్గించడానికి డ్యూయల్ ఫ్యూయల్ ప్రైసింగ్ తెచ్చే అవకాశాలను కూడా పరిశీలిస్తోంది.

మొత్తంగా చూస్తే.. అధిక ఎథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగం దేశ పర్యావరణానికి, ముడిచమురు దిగుమతులు తగ్గి ఆర్థిక స్వావలంబన సాధించడానికి ఎంతగానో తోడ్పడుతుంది. కానీ అదే సమయంలో సామాన్య వాహనదారుడిపై అదనపు భారం, మెయింటెనెన్స్ ఖర్చులు పడకుండా ప్రభుత్వం ఎలాంటి ప్రాక్టికల్ చర్యలు తీసుకుంటుందనేదే ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.

Tags:    

Similar News