స్మార్ట్ ఫోన్‌లో ఆధార్ యాప్.. ప్రజల డేటాను దొంగిలిస్తే ఎవరు బాధ్యులు!
ఈ ప్రతిపాదనపై భద్రతా నిపుణులు కూడా గట్టిగానే స్పందించారు. ఫోన్లలో బ్లోట్‌వేర్ లాగా యాప్‌లను బలవంతంగా చేర్చడం వల్ల డేటా భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు.;
కేంద్ర ప్రభుత్వం డిజిటల్ విప్లవంలో భాగంగా తీసుకురావాలనుకున్న ఒక కీలక ప్రతిపాదనపై వెనక్కి తగ్గింది. స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ప్రతి ఫోన్‌లో ఆధార్ యాప్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేయాలనే నిబంధనను ప్రభుత్వం అధికారికంగా విరమించుకుంది. టెక్ దిగ్గజాలు, స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు, సైబర్ భద్రతా నిపుణుల నుండి వచ్చిన తీవ్ర వ్యతిరేకత ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా నిలిచింది. ప్రజాభిప్రాయాన్ని.. పరిశ్రమ అవసరాలను గౌరవిస్తూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ప్రారంభంలో ప్రభుత్వ సేవలను ప్రజలకు సులభంగా చేరవేయడానికి .. కేవైసీ ప్రక్రియలను వేగవంతం చేయడానికి ఈ ప్రతిపాదనను తెచ్చారు. అయితే గూగుల్, యాపిల్, శామ్‌సంగ్ వంటి కంపెనీలు దీనిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఆపరేటింగ్ సిస్టమ్ స్థాయిలో ఆధార్ వంటి సున్నితమైన సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానించడం వల్ల ఫోన్ల తయారీ వ్యయం పెరగడమే కాకుండా.. సాంకేతిక సంక్లిష్టతలు కూడా తలెత్తుతాయని తయారీదారులు వాదించారు. ముఖ్యంగా వినియోగదారుల స్వేచ్ఛను హరించడం సరికాదని వారు స్పష్టం చేశారు.
ఈ ప్రతిపాదనపై భద్రతా నిపుణులు కూడా గట్టిగానే స్పందించారు. ఫోన్లలో బ్లోట్‌వేర్ లాగా యాప్‌లను బలవంతంగా చేర్చడం వల్ల డేటా భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని హెచ్చరించారు. థర్డ్ పార్టీ యాప్‌లు లేదా మాల్వేర్ల ద్వారా ఆధార్ వంటి కీలక డేటా లీక్ అయ్యే అవకాశం ఉందని.. ఇది అన్ని రహస్యాలను బహిర్గతం చేస్తూ ప్రైవసీకి భంగం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గోప్యత ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో ఈ నిబంధన చట్టపరమైన చిక్కులకు దారితీస్తుందని ప్రభుత్వం గ్రహించింది.
మరోవైపు స్మార్ట్‌ఫోన్ తయారీదారులు కూడా తమ వాదనను గట్టిగా వినిపించారు. ఫోన్లలో అవసరం లేని యాప్‌లు ముందుగానే ఉండటం వల్ల మెమరీ.. ప్రాసెసింగ్ వేగం తగ్గి వినియోగదారు ఎక్స్‌పీరియన్స్ దెబ్బతింటుందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అనుసరిస్తున్న నిబంధనలను దృష్టిలో ఉంచుకుని. భారత్‌లో కూడా యూజర్ల ఇష్టానికే యాప్ డౌన్‌లోడ్‌ను వదిలేయాలని కోరారు. ప్రభుత్వం ఈ వాదనలతో ఏకీభవించి యాప్‌ను ఇన్ స్టాల్ చేయాలనే రూల్ ఏదీ లేదని ప్రకటించింది.
ఆధార్ యాప్‌ను తప్పనిసరి చేయకపోవడం అనేది డిజిటల్ ఇండియా ప్రయాణంలో బ్యాలెన్సింగ్ డెసిషన్ గా కనిపిస్తోంది. సాంకేతికతను ప్రోత్సహిస్తూనే.. పౌరుల వ్యక్తిగత గోప్యతను కాపాడటం అవసరమని ఈ పరిణామం నిరూపించింది.
ఇకపై కూడా ఆధార్ యాప్ కావాలనుకునే వారు తమకు నచ్చినప్పుడు ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రభుత్వ సేవలు అందరికీ అందాలనే లక్ష్యం ఉన్నా.. అది పౌరుల భద్రతను పణంగా పెట్టి జరగకూడదనే స్పష్టమైన సందేశం ఇప్పుడిలా ప్రభుత్వ నిర్ణయం ద్వారా వెలువడింది.