కుక్క కాటుకు ఏటా బలవుతున్నవారు ఎంతమందో తెలుసా?
దేశవ్యాప్తంగా శునకాల దాడులు భయాందోళనకు రేకేత్తిస్తున్నాయి.;
దేశవ్యాప్తంగా శునకాల దాడులు భయాందోళనకు రేకేత్తిస్తున్నాయి. ఈ విషయంలో మూడు రోజుల క్రితం సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలే ఇందుకు ఉదారణ. 2024లోనే 37.17 లక్షల కేసులు నమోదైనట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. సగటున రోజుకు పది వేలకుపైగా ఈ సంఘటనలు జరుగుతున్నాయి. ఈ గణాంకాలు చూస్తే రేబీస్ నిర్మూలన లక్ష్య సాధనలో కేంద్రం ఎదుర్కొంటున్న సవాళ్లను బహిర్గతం చేస్తున్నాయి.
మరణాల గణాంకాల్లో భిన్నత
ప్రభుత్వ రికార్డుల ప్రకారం 2022లో కేవలం 21 రేబీస్ మరణాలను చూపుతున్నది. కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) అంచనాల ప్రకారం భారత్‌లో ఏటా 18వేల నుంచి 20,000 మంది ఈ వ్యాధితో మృత్యువాత పడుతున్నారు. వీరిలో బాధితులు 15 ఏళ్ల లోపు పిల్లలే ఎక్కువ.
కోవిడ్ తర్వాత మళ్లీ పెరిగిన కేసులు
2018లో 75.7 లక్షలుగా ఉన్న కుక్క కాటు కేసులు, కోవిడ్ సమయంలో 2021లో 17 లక్షలకు తగ్గింది. కానీ ఆ తర్వాత కుక్క కాటు కేసులు గణనీయగా పెరిగాయి. 2024లో 37.2 లక్షలకు చేరుకోవడం ఆందోళనకు గురి చేస్తున్నది. 2022–2024 మధ్య మహారాష్ట్ర 13.5 లక్షల కేసులతో ముందున్నది. ఇక తమిళనాడు (12.9 లక్షలు), గుజరాత్ (8.4 లక్షలు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఢిల్లీ, కర్ణాటకలో పరిస్థితి ఆందోళనకరం
ఈ ఏడాది ఇప్పటివరకు ఢిల్లీలో 26,334 కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. 2024 మొత్తం మీద ఈ సంఖ్య 68,090కి చేరింది. జూలై 31 నాటికి 49 రేబీస్ మరణాలు సంభవించాయి. జనవరి–జూన్ మధ్య 65,000 కుక్కలకు స్టెరిలైజేషన్, టీకాలు ఇచ్చినా సమస్య తగ్గలేదు. కర్ణాటకలో 2024లోనే 3.6 లక్షల కుక్క కాటు కేసులు, 42 మరణాలు సంభవించాయి. గడిచిన ఆరు నెలల కాలంలో 2.3 లక్షల ఘటనలు నమోదు కాగా, 19 మంది మృత్యువాత పడ్డారు. కేరళలోనూ ఈ తరహా కేసులు పెద్ద సంఖ్యలో పెరిగాయి.
షెల్టర్ల కొరత
గుర్గావ్‌లో 50 వేల వీధి కుక్కలు ఉండగా, ఇక్కడ కేవలం రెండు షెల్టర్లు మాత్రమే పనిచేస్తున్నాయి. ఘజియాబాద్‌లో 48 వేలు, నోయిడాలో లెక్కలేనన్ని కుక్కలు ఉన్నా ఆశ్రయ సదుపాయాలు తక్కువే. నోయిడాలో ఏడు నెలల్లోనే 73,754 కాటు కేసులు నమోదయ్యాయి.
నివారణ సాధ్యమే కానీ..
రేబీస్ పూర్తిగా నివారించగల వ్యాధే. బాధితులు సమయానికి పూర్తి స్థాయి చికిత్స పొందితే మృత్యువు నుంచి బయడపడవచ్చు. కానీ దేశంలో వీధి కుక్కల అధిక సంఖ్య, తక్కువ టీకా కవరేజ్, ప్రజల్లో అవగాహన లోపం మరణాల సంఖ్యను పెంచుతున్నాయి.
నిపుణుల హెచ్చరిక
2030 నాటికి రేబీస్ నిర్మూలన లక్ష్యం చేరకోవాలంటే నిరంతర టీకా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. అలాగే వీధి కుక్కల నియంత్రణ చర్యలు మరింత కఠినంగా తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. అలాగే ప్రజలకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు.