AIకి అసలైన అగ్నిపరీక్ష.. క్లౌడ్స్ Vs హీట్‌వేవ్స్
భానుడి భగభగలు మన డేటా సెంటర్ల కలలను చిద్రం చేయనున్నాయా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
భానుడి భగభగలు మన డేటా సెంటర్ల కలలను చిద్రం చేయనున్నాయా? అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. వాతావరణ మార్పులతో నానాటికీ వేడి వాతావరణం పెరిగిపోతుండటం వల్ల డిజిటల్ ప్రపంచానికి తీవ్రమైన ముప్పు పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో 2030 నాటికి లక్ష కోట్ల డాలర్ల డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని మన దేశ ఆర్థిక లక్ష్యానికి పెను సవాల్ ఎదరుకానుందని అంటున్నారు. 5జి నెట్‌వర్క్, ఆన్‌లైన్ బ్యాంకింగ్, రీల్స్, క్లౌడ్ స్టోరేజ్, అన్నింటికీ మించి దూసుకొస్తున్న 'ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్' (AI).. వీటన్నింటికీ బ్యాక్‌బోన్ గా డేటా సెంటర్లే అంటున్నారు. అయితే, ఈ డిజిటల్ సామ్రాజ్యానికి ఇప్పుడు ఒక ఊహించని శత్రువులా వేడి వాతావరణం భయపెడుతోందని చెబుతున్నారు. భవిష్యత్తులో 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరబోతున్న ఉష్ణోగ్రతలు మన దేశ డిజిటల్ కలలను నీరుగార్చబోతున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని చెబుతున్నారు.
ఎందుకు ముప్పు?
డేటా సెంటర్లు అంటే వేల సంఖ్యలో సర్వర్లు నిరంతరం పనిచేసే భారీ ల్యాబ్‌లు. ఇవి 24 గంటలూ రన్ అవుతూ విపరీతమైన వేడిని పుట్టిస్తాయి. వీటిని చల్లబరచడానికి భారీ ఎత్తున విద్యుత్, ఏసీ, లక్షల లీటర్ల స్వచ్ఛమైన నీరు అవసరమని అంటున్నారు. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇండియా డేటా సెంటర్ కెపాసిటీ 2025 నాటికి 1,500 మెగావాట్లకు చేరింది. 2030 నాటికి ఇది 6.5 గిగావాట్లకు (GW) చేరుతుందని అంచనా. పర్యావరణ శాస్త్రవేత్తల ప్రకారం, ప్రస్తుతం భారతదేశంలో సగానికి పైగా డేటా సెంటర్లు ఏడాదిలో 90 రోజులకు పైగా 35 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతాల్లోనే ఉన్నాయని అంటున్నారు. 2040 నాటికి దాదాపు 90 శాతం డేటా సెంటర్లు తీవ్రమైన ఉష్ణోగ్రత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు.
కేవలం క్లౌడ్ స్టోరేజ్ అంటే డేటా దాచడం కంటే, ఏఐ అప్లికేషన్లు, గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ ల్యాబ్‌లు 10 రెట్లు ఎక్కువ వేడిని పుట్టిస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో వీటిని చల్లబరచడానికి భారీ ఎత్తున నీరు అవసరం అవుతుందని అంటున్నారు. అయితే పెరుగుతున్న వేడి వల్ల నీటి వనరులు ఎండిపోవడంతోపాటు నదుల నుంచి తరలించే అవకాశాలు కష్టమవుతాయని హెచ్చరిస్తున్నారు. ఇది మన దేశ డిజిటల్ రంగానికి పెను సవాల్ గా మారే ప్రమాదం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇదే సమయంలో డేటా సెంటర్లు ఉన్న మెట్రో నగరాల్లో హీట్ ఐలాండ్ వల్ల మరింత భగభగలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. నగరాల్లో కాంక్రీట్ భవనాలు, ట్రాఫిక్ వల్ల 'అర్బన్ హీట్ ఐలాండ్' ఎఫెక్ట్ ఎక్కువవుతుందని, దీనివల్ల చుట్టుపక్కల ప్రాంతాల కంటే నగరాల్లో 2 నుంచి 5 డిగ్రీల వేడి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అదేసమయంలో స్టాన్‌ఫోర్డ్, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయాల అధ్యయనాల ప్రకారం, డేటా సెంటర్లు విడుదల చేసే వేడి వల్ల వాటి చుట్టుపక్కల 10 కిలోమీటర్ల పరిధిలో ఉష్ణోగ్రత మరో 2 నుంచి 9 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇది నగరాలను మరింత అగ్నిగుండాలుగా మారుస్తుందని హెచ్చరిస్తున్నారు.
కరెంట్ గ్రిడ్‌లపై పెను భారం
మరోవైపు నగరాల్లో జనాభా పెరిగి అందరూ ఏసీలు ఆన్ చేయడం వల్ల ఇప్పటికే పవర్ గ్రిడ్‌లపై లోడ్ పెరుగుతోందని చెబుతున్నారు. దీనికి తోడు డేటా సెంటర్లు కూడా తోడైతే పవర్ ట్రిప్ అవ్వడం ఖాయమని అంటున్నారు. నీటి కొరత వల్ల హైడ్రో పవర్ ఉత్పత్తి తగ్గిపోతుందని చెబుతున్నారు, దీనివల్ల డేటా సెంటర్ల కరెంట్ బిల్లులు, నిర్వహణ ఖర్చులు పెరిగిపోయి డిజిటల్ సేవలు ఖరీదైనవిగా మారడానికి దారితీస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో హీట్ వేవ్స్ సవాలును ఎదుర్కోడానికి భారత్ సాంకేతికంగా మారాల్సి ఉందని అంటున్నారు.
లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ వంటి అధునాతన కూలింగ్ విధానాలను అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇవి సంప్రదాయ ఎయిర్ కండిషనర్ల కంటే సర్వర్లను నేరుగా ప్రత్యేకమైన ద్రవాలలో ముంచడం ద్వారా 90 శాతం వరకు నీటిని, కరెంటును ఆదా చేయవచ్చునని చెబుతున్నారు. అదేవిధంగా గ్రీన్ డేటా సెంటర్లకు మళ్లాలని చెబుతున్నారు. అంటే పూర్తిగా సోలార్, విండ్ ఎనర్జీతో నడిచేలా ప్లాన్ చేయాలని సూచిస్తున్నారు.