రెండు వర్గాలుగా టీడీపీ.. ఖండాంతరాలలోనూ రాజకీయమేనా?

తెలుగుదేశం ఎన్ఆర్ఐ విభాగంలో వర్గ విభేదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయని అంటున్నారు. గల్ఫ్ దేశాల్లో టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు.

Update: 2026-05-23 08:01 GMT

తెలుగుదేశం ఎన్ఆర్ఐ విభాగంలో వర్గ విభేదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయని అంటున్నారు. గల్ఫ్ దేశాల్లో టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి పోటాపోటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెబుతున్నారు. విదేశాల్లోనూ ఈ తరహా రాజకీయంతో పార్టీకి తలనొప్పిగా మారుతున్నారని పలువురు ఎన్ఆర్ఐ టీడీపీ నేతలపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా గల్ఫ్ టీడీపీ విభాగంలో కొనసాగుతున్న ఆధిపత్య పోరుతో పార్టీ నేతలు పరస్పరం ముఖాలు కూడా చూసుకోని బద్ధ విరోధుల్లా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఈ పరిస్థితులతో గల్ఫ్ టీడీపీలో గందరగోళం చోటుచేసుకుందని చెబుతున్నారు.

ఇక ఎన్ఆర్ఐ నేతల వ్యవహారశైలితో గల్ప్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొనేందుకు వెళుతున్న రాష్ట్ర నేతలు కూడా ఇబ్బంది పడుతున్నట్లు చెబుతున్నారు. అయితే ఒక నేత మాత్రం వర్గాలను పెంచేలా వ్యవహరిస్తున్నారని జరుగుతున్న ప్రచారం మరింత హీట్ పుట్టిస్తోందని అంటున్నారు. తరచూ గల్ఫ్ కు వస్తున్న ఆ నేత అగ్నికి ఆజ్యం పోసేలా ప్రవర్తిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక గల్ఫ్ టీడీపీలో విభేదాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారం ఎన్ఆర్ఐ టీడీపీలో కలవరం పుట్టిస్తోందని అంటున్నారు.

ఎన్ఆర్ఐ నేతలుగా చెప్పుకునే వారు కూడా పార్టీ కార్యక్రమాలకు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారని, స్థానికంగా ఉన్న కార్యకర్తలను కూడా కలవడం లేదని అంటున్నారు. విదేశాల నుంచి వచ్చే పార్టీ నేతలను కలిసేందుకు కూడా గల్ఫ్ లో ఉన్న ఒక పెద్ద ఇష్టపడటం లేదని అంటున్నారు. ఆయన అలా ఎందుకు ప్రవర్తిస్తున్నారనేది ఎవరికీ అంతుచిక్కడం లేదన్న చర్చ ఆసక్తి రేపుతోంది. రాజకీయంగా కీలకమైన గల్ఫ్ ప్రాంతాన్ని పార్టీ నాయకత్వం నిర్లక్ష్యం చేయడంపై కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారని అంటున్నారు.

మరోవైపు పార్టీ హైకమాండ్ గల్ఫ్ టీడీపీని పట్టించుకోవడం లేదని, ఎక్కువగా అమెరికా, బ్రిటన్ లో ఉండే పార్టీ నేతలకే అవకాశాలు ఇస్తున్నారని, ఆయా శాఖలకే ప్రాధాన్యం ఇస్తున్నారని పశ్చిమాసియాలో ఉన్న కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, గల్ఫ్ టీడీపీ విభేదాలు ఉన్నాయనే విషయం తాజాగా మరోమారు బయటపడింది. పార్టీ మహానాడుకు ముందు జిల్లాల్లో మినీ మహనాడు నిర్వహించినట్లే, విదేశాల్లో సమావేశాలు జరుగుతున్నాయి. ఇక శుక్రవారం ఖతార్ లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొలుసు పార్థసారథి హాజరయ్యారు. అయితే మరోవర్గం కూడా ఖతార్ లో సమావేశం ఏర్పాటు చేసి దీనికి పెనమలూరు ఎమ్మెల్యే బొడే ప్రసాద్ ను ముఖ్య అతిథిగా తీసుకువచ్చింది. దీంతో ఒకే రోజు, ఒకే దేశంలో రెండు వేర్వేరు సమావేశాలు జరగడం కార్యకర్తల్లో గందరగోళానికి దారితీసిందని అంటున్నారు. ఈ పోటాపోటీ కార్యక్రమాలను అడ్డుకునేందుకు రెండు పక్షాలు చివరి వరకు ప్రయత్నించాయని కూడా చెబుతున్నారు.

ఈ పరిణామాలు గల్ఫ్ లో ఉంటున్న టీడీపీ కార్యకర్తలను ఆవేదనకు గురిచేస్తున్నాయి. పశ్చిమాసియాలో సుమారు 5 లక్షల మంది తెలుగువారు పనిచేస్తున్నారని చెబుతున్నారు. ఇందులో గోదావరి జిల్లాల వాసులతోపాటు రాయలసీమ ప్రాంతానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారని అంటున్నారు. పార్టీలో పరిణామాలను ప్రత్యర్థులు అనుకూలంగా మలచుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గల్ఫ్ లోనే ఉంటున్న మలయాళీలు పార్టీలను బలోపేతం చేసుకుంటుంటే, టీడీపీలో మాత్రం భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని కార్యకర్తలు వాపోతున్నారు. ప్రధానంగా గ్రూపు రాజకీయాలు, కులాల ఆధిపత్యం వల్ల పార్టీకి నష్టం చేస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు హైకమాండ్ తక్షణమే దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News