కేరళంలో తిష్ట వేసిన వరుణుడు! భారీ వర్షాలకు కరుగుతున్న కొండలు
వర్ష ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు.
కేరళం రాష్ట్రంలో కొద్దిరోజులుగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలకు రాష్ట్రంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా కొండ ప్రాంతాలు, హిల్ స్టేషన్లలో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. ఉన్నపళంగా వరద చుట్టుముట్టడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వర్ష బీభత్సంతో బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపడుతోంది. భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో పలువురు నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా కొట్టాయం, ఇడుక్కి, మలప్పురం, వాయనాడ్ జిల్లాల్లో కొండచరియలు ఇళ్లపై పడటంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నదులు, వాగులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తుండటంతో తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. కన్నూరు, కోజికోడ్ జిల్లాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది.
వర్ష ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 209 సహాయ శిబిరాల్లో 5,792 మందికి పైగా బాధితులకు ఆశ్రయం కల్పించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, అగ్నిమాపక సిబ్బంది స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపడుతున్నారు. పలుచోట్ల ఇళ్లు పూర్తిగా, మరికొన్ని చోట్ల పాక్షికంగా ధ్వంసమవడంతో బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం అత్యంత అప్రమత్తమైంది. పరిస్థితుల తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలోని 12 జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, ముఖ్యంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదమున్న హిల్ స్టేషన్లు, కొండ ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత శిబిరాలకు తరలించే ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
కేరళలో కురుస్తున్న దారుణ వర్షాలకు సంబంధించిన భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఉప్పొంగుతున్న నదులు, రోడ్లపైకి చేరిన భారీ వరద నీరు, కొండచరియలు విరిగిపడి నేలకూలిన ఇళ్లు, జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రాంతాలకు సంబంధించిన వీడియోలు నెటిజన్లను కలచివేస్తున్నాయి. వర్షాల తీవ్రత తగ్గిన ప్రాంతాలలో ఇళ్లలోకి చేరిన బురదను తొలగించే పనిలో, శుభ్రత కార్యక్రమాలలో అధికార యంత్రాంగంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు నిమగ్నమయ్యాయి. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని, నష్టపోయిన ప్రతి కుటుంబానికి తక్షణ సాయం అందిస్తామని సీఎం కార్యాలయం భరోసా ఇచ్చింది.