షేక్ హ్యాండ్ ఇవ్వలేదు... కొంపలేం మునగలేదు! కోహ్లీ-హెడ్ ఈగో క్లాష్ వీడియో వైరల్

ఐపీఎల్ అంటే కేవలం సిక్సర్లు, ఫోర్లు, స్ట్రాటజిక్ టైమౌట్లు మాత్రమే అనుకుంటే పొరపాటే.

Update: 2026-05-23 05:12 GMT

ఐపీఎల్ అంటే కేవలం సిక్సర్లు, ఫోర్లు, స్ట్రాటజిక్ టైమౌట్లు మాత్రమే అనుకుంటే పొరపాటే. ఇక్కడ అసలైన మజా ఉండేది ‘ఈగోల’ ఆటలో.. మైదానంలో స్కోర్‌బోర్డ్ కంటే ఆటగాళ్ల బీపీలే ఎక్కువ వేగంగా పెరుగుతుంటాయి. తాజాగా శుక్రవారం జరిగిన ఆర్సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లో కూడా అదే జరిగింది. కాకపోతే ఈసారి వినోదం బ్యాట్ నుంచి రాలేదు... ‘నోటి దురద’, ‘చేతుల సైగల’ రూపంలో వచ్చింది! మన రన్ మెషిన్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా డైనమైట్ ట్రావిస్ హెడ్ మధ్య జరిగిన ‘హై-వోల్టేజ్’ డ్రామా ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

కవ్వించిన కంగారూ... కసిరిన కింగ్!

కథలోకి వెళ్తే... కోహ్లీ పిచ్‌పై సెటిల్ అవుతూ తన స్టైల్‌లో సింగిల్స్ తీస్తున్న టైంలో ఫీల్డింగ్ చేస్తున్న ట్రావిస్ హెడ్‌కి ఎందుకో కాస్త బోర్ కొట్టినట్టుంది. ఆస్ట్రేలియా వాళ్లకు పుట్టుకతోనే ‘స్లెడ్జింగ్’ అనే డిగ్రీ ఇస్తారు కదా అందుకే కోహ్లీని ఉద్దేశించి ఏదో ఒక ముక్క విసిరాడు. సాధారణంగా వేరే ఎవరైనా అయితే "లైట్" తీసుకునేవారేమో... కానీ అక్కడ ఉన్నది విరాట్ కోహ్లీ! కోపానికి కేరాఫ్ అడ్రస్.

హెడ్ అన్న మాటలకి కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ చూస్తే... డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్‌లో అండర్ టేకర్ గుర్తొచ్చాడు. "అంత సీన్ ఉందా నీకు? వచ్చి బౌలింగ్ చెయ్ చూద్దాం!" అన్న రేంజ్‌లో చేతులతో సైగలు చేస్తూ కోహ్లీ ఇచ్చిన లుక్కుకి హెడ్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయో లేదో కానీ.. స్టేడియంలో ఉన్న ఫ్యాన్స్‌కి మాత్రం పూనకాలు వచ్చేశాయి.

‘హ్యాండ్‌షేక్’ లేదు... ఓన్లీ ‘నో-లుక్’ వాక్!

అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది బాసూ! మ్యాచ్ అయిపోయాక అందరూ ‘జెంటిల్‌మెన్’ ముసుగు వేసుకుని షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు. ట్రావిస్ హెడ్ కూడా పాపం... "మైదానంలో జరిగింది మైదానంలోనే వదిలేద్దాం అన్నా..." అన్నట్టుగా మొహం నిండా నవ్వు పులుముకుని కోహ్లీ వైపు చేయి చాచాడు.

కానీ కింగ్ కోహ్లీ మూడ్ అప్పటికే ‘నెవర్‌ గివ్ అప్’ మోడ్‌లో ఉంది. హెడ్ చాచిన చేతిని, ఆ పక్కనే ఉన్న హెడ్‌ని కనీసం కంటిచూపుతో కూడా పలకరించకుండా... గాల్లోకి ఒక చూపు విసిరి, నేరుగా ముందుకు నడిచిపోయాడు. ఆ సీన్ చూస్తుంటే... సినిమాలో హీరో విలన్‌ని కాదని స్టైల్‌గా నడుచుకుంటూ వెళ్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గుర్తొచ్చింది. హెడ్ పాపం చాచిన చేయిని ఏం చేయాలో తెలియక, తల గోక్కుంటూ ఉండిపోయాడు.

సోషల్ మీడియాలో ‘రెండు ముక్కలైన’ ప్రపంచం!

ఈ షేక్ హ్యాండ్ స్కిప్ ఎపిసోడ్‌తో సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటోంది. కోహ్లీ ఆర్మీ ఏమో "ఇదీ కింగ్ అంటే! తగ్గేదే లే. కంగారూలకి ఇలాగే బుద్ధి చెప్పాలి. కింగ్ అగ్రెషన్‌కు తిరుగులేదు!" అంటూ కాలర్లు ఎగరేస్తున్నారు. కానీ ఇంకొందరు "అయినా మ్యాచ్ అయిపోయాక కూడా ఇంత ఇగోనా బాస్? క్రీడాస్ఫూర్తి ఏమైంది?" అంటూ క్లాసులు పీకుతున్నారు. మరోవైపు మీమర్స్ కి అయితే పండగే పండగ! "హెడ్‌కి హెడ్‌స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన కోహ్లీ" అంటూ రకరకాల మీమ్స్‌తో ఇంటర్నెట్‌ను తగలేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిచారు.. ఎవరు ఓడారు అనేది పక్కనబెడితే... రాబోయే కొన్ని వారాల పాటు సోషల్ మీడియా మీమ్స్ పేజీలకి కావాల్సినంత కంటెంట్ అయితే దొరికింది. ఐపీఎల్ అంటే కేవలం క్రికెట్ కాదు.. అంతకు మించిన డ్రామా అని ఈ 'నో-షేక్ హ్యాండ్' ఎపిసోడ్ మరోసారి నిరూపించింది. హెడ్ గారూ... నెక్స్ట్ టైం కింగ్‌తో పెట్టుకునేటప్పుడు కాస్త ‘హెడ్’ ఉపయోగించాల్సిందే!




Tags:    

Similar News