భారత్‎లో విస్తరిస్తున్న మహమ్మారి.. 4వేలు దాటిన కరోనా కేసులు

కరోనా వైరస్ మహమ్మారి తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న తరుణంలోనే మళ్లీ దేశంలో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది.;

Update: 2025-06-03 06:30 GMT

కరోనా వైరస్ మహమ్మారి తగ్గుముఖం పట్టిందని భావిస్తున్న తరుణంలోనే మళ్లీ దేశంలో కోవిడ్-19 కేసులు మళ్లీ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. గత 24 గంటల్లో ఐదుగురు కరోనా రోగులు మరణించగా, దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 4,026కి పెరిగింది. ఈ మరణాలు, కేసుల పెరుగుదల దేశ ప్రజల్లో మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం.. ఏయే రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయో, మరణించిన వారి వివరాలు ఏంటో చూద్దాం.

గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన ఈ ఐదుగురు రోగులు కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందినవారు. వీరందరూ ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

కేరళలో 80 ఏళ్ల వృద్ధుడు తీవ్ర న్యుమోనియా (severe pneumonia), తీవ్ర శ్వాసకోశ సిండ్రోమ్ (ARDS)తో పాటు డయాబెటిస్, అధిక రక్తపోటు (high blood pressure), కొరోనరీ ఆర్టరీ వ్యాధితో (coronary artery disease) బాధపడుతూ కరోనాతో మరణించారు. తమిళనాడులో టైప్ 2 డయాబెటిస్, పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్న 69 ఏళ్ల మహిళ వైరస్ బారిన పడి మరణించారు. పశ్చిమ బెంగాల్ లో 43 ఏళ్ల మహిళ తీవ్ర కొరోనరీ సిండ్రోమ్, సెప్టిక్ షాక్ (septic shock), తీవ్ర మూత్రపిండాల గాయం (acute kidney injury)తో బాధపడుతూ మరణించినట్లు నివేదించారు.

మహారాష్ట్ర, కేరళలో అధికం!

ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కరోనా కేసుల సంఖ్య 4,026కు చేరింది. రాష్ట్రాల వారీగా యాక్టివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలో 1,416 కేసులు (అత్యధికం)నమోదయ్యాయి. మహారాష్ట్ర - 494 కేసులు, గుజరాత్ - 397 కేసులు, పశ్చిమ బెంగాల్ - 372 కేసులు, కర్ణాటక - 311 కేసులు, తమిళనాడు - 215 కేసులు, ఉత్తరప్రదేశ్ - 138 కేసులు, ఢిల్లీ - 393 కేసులు నమోదయ్యాయి.

మహారాష్ట్రలో కరోనా పరిస్థితి

మహారాష్ట్రలో కోవిడ్ కారణంగా మరో ఇద్దరు మరణించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకారం.. ఈ మరణాలు కొల్హాపుర్, సతారా జిల్లాల్లో సంభవించాయి. మరణించిన ఇద్దరు రోగులు కూడా ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. దీంతో, ఈ సంవత్సరంలో రాష్ట్రంలో కోవిడ్ మరణాల సంఖ్య 10కి చేరింది. సోమవారం రాష్ట్రంలో 59 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. వీటిలో 20 కేసులు ఒక్క ముంబైలోనే నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ సోకిన రోగుల సంఖ్య 873కు చేరింది. వీరిలో 483 మంది రోగులు కేవలం ముంబైకి చెందినవారే కావడం ఆందోళన కలిగిస్తోంది. ముంబైలో కోవిడ్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. అయితే, రాష్ట్రంలో ఇప్పటివరకు 369 మంది కోవిడ్ సోకిన వారు కోలుకున్నారు.

కొత్త వేరియంట్ లక్షణాలు

కరోనా వైరస్ కొత్త కేసుల పెరుగుదలకు ప్రధాన కారణం NB.1.8.1 సబ్-వేరియంట్. ఇది కోవిడ్-19 ఒమిక్రాన్ వేరియంట్ నుంచి వచ్చినది. భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR) ఈ కొత్త స్ట్రెయిన్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, అత్యంత మార్పుచెందగలదని (highly variable) నిర్ధారించింది. అయితే, ఇది తేలికపాటి వ్యాధికి (mild illness) మాత్రమే కారణమవుతుందని కూడా ICMR పేర్కొంది. ఈ వైరస్ లక్షణాలు దాదాపుగా సాధారణ ఫ్లూ (seasonal flu) లక్షణాలను పోలి ఉంటాయి. అయినప్పటికీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News