మారిన బ‌తుకు చిత్రం: 2000 నుండి 2026 వ‌ర‌కూ పెరిగిన ఖ‌ర్చుల భారం

గడిచిన రెండు దశాబ్దాలుగా భారతదేశ ఆర్థిక ప్రయాణంలో జీవన వ్యయం (కాస్ట్ ఆఫ్ లివింగ్) నిరంతరం పెరుగుతూనే వస్తోంది.

Update: 2026-06-06 00:30 GMT

గడిచిన రెండు దశాబ్దాలుగా భారతదేశ ఆర్థిక ప్రయాణంలో జీవన వ్యయం (కాస్ట్ ఆఫ్ లివింగ్) నిరంతరం పెరుగుతూనే వస్తోంది. గత ఇరవై ఏళ్లలో ప్రజల ఆదాయాలు పెరిగిన మాట వాస్తవమే అయినా అదే స్థాయిలో నిత్యావసర వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగాయి. కరెన్సీ విలువలో వచ్చిన మార్పులు, ద్రవ్యోల్బణం కారణంగా సామాన్యుడి నెలవారీ బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడింది. తాజాగా 2000వ సంవత్సరం నాటి ధరలతో పోల్చుతూ 2026 నాటి నిత్యావసరాల ధరల పట్టిక ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారి సరికొత్త చర్చకు దారితీసింది.

ఈ వైరల్ గ్రాఫిక్ ప్రకారం.. దేశంలో ఇంధన ధరలు అత్యంత భారీగా పెరిగాయి. రెండు దశాబ్దాల క్రితం.. అంటే 2000వ సంవత్సరంలో లీటర్ పెట్రోల్ ధర కేవలం రూ. 26 గా ఉండేది. కానీ 2026 నాటికి అనేక నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ. 102 మార్కుకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులు - రవాణా ఖర్చులు తోడవ్వడం వల్లే ఇంధన ధరలు ఈ స్థాయిలో ప్రియమయ్యాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇక ప్రతి ఇల్లాలు లెక్కలు వేసుకునే వంటగ్యాస్ (ఎల్‌.పి.జి) ధరలు కూడా మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద భారంగా మారాయి. 2000వ సంవత్సరంలో ఒక గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ ధర కేవలం రూ. 157 గా ఉండేది. కాగా 2026 నాటికి అదే సిలిండర్ ధర రూ. 912 కి చేరింది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, వివిధ రకాల విధానపరమైన మార్పులు జరిగినా నేటికీ సగటు భారతీయ కుటుంబంలో ప్రతి నెలా అయ్యే అతిపెద్ద ఖర్చులలో వంటగ్యాస్ ఒకటిగా నిలుస్తోంది.

మరోవైపు ప్రతి ఇంట్లో ఉదయం లేచింది మొదలు అత్యవసరమైన పాల ధరలు కూడా ఆహార ద్రవ్యోల్బణాన్ని ప్రతిబింబిస్తున్నాయి. బ్రాండ్లు, నగర‌జీవితం.. పాలలో ఉండే ఫ్యాట్ శాతాన్ని బట్టి ధరల్లో వ్యత్యాసాలు ఉన్నా.. రెండు దశాబ్దాలలో పాల సగటు ధర భారీగా పెరిగింది. పశుగ్రాసం ధరలు పెరగడం, ప్యాకేజింగ్ ఖర్చులు, రవాణా భారం అధికమవ్వడం వల్ల డైరీ రంగానికి ఇన్‌పుట్ ఖర్చులు పెరిగాయి. ఫలితంగా ఆ భారం వినియోగదారులపై పడక తప్పలేదు.

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ధరల పోలిక కేవలం కొన్ని వస్తువుల ఆధారంగా చూపిందే తప్ప.. దీనిని పూర్తి స్థాయి జీవన వ్యయానికి కొలమానంగా తీసుకోలేమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే జీవన వ్యయం అనేది కేవలం ఇంధనం, నిత్యావసరాల మీదే కాకుండా గృహ వసతి (హౌసింగ్), వైద్యం, పిల్లల చదువులు, వినోదం వంటి అనేక ఇతర రంగాల ఖర్చులపై ఆధారపడి ఉంటుంది. భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో పెరుగుతున్న ఆదాయాలకు అనుగుణంగా నిత్యజీవిత వ్యయాలను సమతుల్యం చేయడం అనేది అటు ప్రభుత్వ పాలకులకు, ఇటు సామాన్య కుటుంబాలకు ఒక పెద్ద సవాలుగా నిలుస్తోంది.

Tags:    

Similar News