బ్రేకింగ్... 6 పాకిస్థాన్ డ్రోన్లను కూల్చేసిన భారత్!
అవును... పాకిస్థాన్ మరోసారి తన వక్ర బుద్ధిని బయటపెట్టింది. భారత్ పై కుట్రలు పన్నే విషయంలో తన వైఖరి మారదని చెప్పకనే చెప్పింది.;
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిణామాలతో పాకిస్థాన్ జ్ఞానం వస్తుందని చాలామంది భావించి ఉంటారు! కానీ.. నాడు భారత్ దూకుడు తట్టుకోలేక, కాల్పుల విరమణ అంటూ కాళ్ల బేరానికి వచ్చిన పాక్.. తెర వెనుక ఆగడాలు మాత్రం ఆపడం లేదు. ఈ క్రమంలో తాజాగా డ్రోన్ లతో కవ్వింపు చర్యలకు పాల్పడింది. అయితే... భారత్ మాత్రం గట్టిగా బుద్ది చెప్పింది.
అవును... పాకిస్థాన్ మరోసారి తన వక్ర బుద్ధిని బయటపెట్టింది. భారత్ పై కుట్రలు పన్నే విషయంలో తన వైఖరి మారదని చెప్పకనే చెప్పింది. ఇందులో భాగంగా... తాజాగా పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ సమీపంలోని సరిహద్దు గుండా ఆయుధాలను, మత్తు పదార్థాలను మన దేశంలోకి డ్రోన్ ల ద్వారా పంపేందుకు కుట్ర పన్నింది. అయితే... భారత సరిహద్దు దళం (బీఎస్ఎఫ్) ఆ కుట్రను భగ్నం చేసింది.
ఇందులో భాగంగా.. పాక్ నుంచి భారత్ సరిహద్దుల్లోకి ప్రవేశించిన ఆరు డ్రోన్లను కుప్పకూల్చింది. ఈ సందర్భంగా వాటితో రవాణా చేయబడుతోన్న మూడు తుపాకీలు, మేగజీన్లతోపాటు ఒక కిలో హెరాయిన్ ను స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు ఈ విషయాలను మీడియాకు వెల్లడించారు.
బుధవారం రాత్రి భారత్ భూభాగంలోకి వస్తున్నట్లు అనుమానాస్పద వస్తువులు ఎగిరివస్తున్న గుర్తించిన బీఎస్‌ఎఫ్ సిబ్బంది.. వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ సమయంలోనే పాకిస్థాన్ కు చెందిన డ్రోన్లు భారత్ వైపు దూసుకొస్తున్నట్లు గుర్తించారు. అనంతరం కౌంటర్ ఆపరేషన్ చేపట్టారు. ఇందులో భాగంగా.. మోథే సమీపంలో 5 డ్రోన్లను నేల కూల్చారు.
మరోవైపు గురువారం తెల్లవారు జామున అట్టారీ గ్రామానికి సమీపంలో మరో డ్రోన్ ను కూల్చివేసినట్లు తెలిపారు. దీని నుంచి రెండు మ్యాగజైన్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం తర్న్ తరన్ జిల్లాలోని దాల్ గ్రామం సమీపంలో జరిగిన మరొక సంఘటనలో వరి పొలం నుండి ఒక పిస్టల్, ఒక మ్యాగజైన్ ను స్వాధీనం చేసుకున్నారు!