చైనా సీసీ కెమెరాలు నిషేధం.. విషయం చాలా సీరియస్!
చైనా సీసీ కెమెరాలను నిషేధించడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. చైనా వస్తువులు చౌకగా ఉండటంతో ఇన్నాళ్లు వాటి విక్రయాలు జోరుగా ఉండేవి.;
చైనా సీసీ కెమెరాల విక్రయాలపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై చైనా సీసీ కెమెరాలను విక్రయించకుండా దేశంలో నిషేధం అమలులోకి తెచ్చింది. సీసీ కెమెరాలతోపాటు చైనాలో తయారైన ఎలక్ట్రానిక్ చిప్ సెట్స్ కు ఈ ఆదేశాలు వర్తిస్తాయని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం దేశ డిజిటల్ సరిహద్దులను పటిష్టం చేసే వ్యూహాత్మక అడుగు వేసిందని వ్యాఖ్యానిస్తున్నారు. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు.
చైనా సీసీ కెమెరాలను నిషేధించడంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. చైనా వస్తువులు చౌకగా ఉండటంతో ఇన్నాళ్లు వాటి విక్రయాలు జోరుగా ఉండేవి. అయితే సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ చిప్స్ వంటివల్ల దేశంలో సున్నిత ప్రాంతాల సమాచారం విదేశీ శక్తులకు చేరే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయని అంటున్నారు. దీంతో విదేశాల్లో తయారైన సీసీ కెమెరాలు, ఎలక్ట్రానిక్ డివైస్ లను స్టాండర్టయిజేషన్ టెస్టింగ్ అండ్ క్వాలిటీ సర్టిఫికేషన్ నిబంధనల కిందకు తీసుకువచ్చారు.
ఈ కొత్త నిబంధనల ప్రకారం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులను కచ్చితంగా తనిఖీ చేసి సర్టిఫికెట్లు జారీ చేస్తారు. ముఖ్యంగా కెమెరాలో వాడే చిప్‌సెట్ (SoC) ఏ దేశంలో తయారైందో స్పష్టంగా తెలియ జేయాలని కేంద్రం స్పష్టం చేసింది. చైనా చిప్‌సెట్లు, ఆ దేశ సాఫ్ట్‌వేర్ వాడే ఉత్పత్తులు ఈ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా లేకపోవడంతో వాటికి సర్టిఫికేషన్ నిరాకరిస్తున్నారు, దీనివల్ల అవి మార్కెట్లో అమ్ముడవడం లేదని చెబుతున్నారు.
ప్రభుత్వ నిర్ణయంతో ఇన్నాళ్లు మన మార్కెట్లో దాదాపు మూడో వంతు వాటా ఆక్రమించిన చైనా కంపెనీలకు డోర్స్ క్లోజ్ చేసినట్లైంది. దీంతో హిక్ విజన్, దహువా, టీపీ-లింక్ తదితర కంపెనీలకు చెందిన సీసీ కెమెరాల విక్రయాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. ఇదే సమయంలో మన దేశీయ ఉత్పత్తులకు ఊతం ఇచ్చినట్లు అయిందని అంటున్నారు.