ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ: భారత్ కంటే పైన రెండే రెండు దేశాలు
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తాజా గణాంకాల ప్రకారం.. 2025లో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ వేదికపై ఒక మెట్టు కిందకు జారి ఆరవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలిచింది.;
అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) తాజా గణాంకాల ప్రకారం.. 2025లో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ వేదికపై ఒక మెట్టు కిందకు జారి ఆరవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా నిలిచింది. 2024లో ఐదవ స్థానంలో ఉన్న భారత్ ప్రస్తుతం 3.92 ట్రిలియన్ డాలర్ల జిడిపితో బ్రిటన్ (4 ట్రిలియన్ డాలర్లు) కంటే స్వల్పంగా వెనుకబడి ఉంది. అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ దేశాలు మొదటి నాలుగు స్థానాల్లో కొనసాగుతుండగా.. కరెన్సీ మార్పిడి రేట్ల హెచ్చుతగ్గులు.. అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు భారత ర్యాంకింగ్‌పై తాత్కాలిక ప్రభావాన్ని చూపాయి.
ర్యాంకింగ్‌లో ఈ స్వల్ప తగ్గుదల కనిపించినా.. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారతదేశం ఇప్పటికీ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా తన ప్రత్యేకతను చాటుకుంటోంది. దేశీయంగా రూపాయి పరంగా దాదాపు 9 శాతం నామినల్ వృద్ధిని నమోదు చేయడం విశేషం. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికన్ డాలర్ బలపడటం.. రూపాయి విలువలో వచ్చిన మార్పుల వల్ల డాలర్ల రూపంలో లెక్కించే జిడిపి గణాంకాల్లో ఈ మార్పు చోటుచేసుకుంది. ఇది కేవలం అంకెల పరమైన హెచ్చుతగ్గులే తప్ప.. దేశ ఆర్థిక పునాదులు బలహీనపడలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతం ఎదుర్కొంటున్న కరెన్సీ సవాళ్లు.. బాహ్య ఆర్థిక ఒత్తిళ్లు స్వల్పకాలిక అడ్డంకులుగా మాత్రమే కనిపిస్తున్నాయి. బలమైన డాలర్ కారణంగా దిగుమతి చేసుకునే ముడి చమురు ధరలు పెరిగి ద్రవ్యోల్బణంపై ఒత్తిడి తెచ్చినా.. భారత ఎగుమతులకు ఇది కొంత మేర కలిసొచ్చే అవకాశం ఉంది. దేశీయంగా పెరుగుతున్న మధ్యతరగతి జనాభా.. వారి కొనుగోలు శక్తి ..ప్రభుత్వం చేపడుతున్న మౌళిక సదుపాయాల కల్పన వంటి అంశాలు భారత ఆర్థిక ఇంజిన్‌ను నిరంతరం నడిపిస్తున్నాయి. ఇవే అంశాలు భవిష్యత్తులో భారత్ తిరిగి అగ్రస్థానానికి చేరుకోవడానికి సోపానాలుగా మారనున్నాయి.
భవిష్యత్తు అంచనాల విషయానికి వస్తే.. 2026లో కూడా భారత్ ఆరవ స్థానంలోనే కొనసాగే అవకాశం ఉన్నా. 2027 నుండి పుంజుకుని దూసుకుపోనుంది. 2027 నాటికి 4.58 ట్రిలియన్ డాలర్ల జిడిపితో బ్రిటన్‌ను అధిగమించి మళ్ళీ నాలుగవ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆ తర్వాతి ఏడాది అంటే 2028లోనే 5.06 ట్రిలియన్ డాలర్ల మార్కును చేరుకోవడం ద్వారా జపాన్‌ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించడం ఖాయంగా కనిపిస్తోంది.
అంతిమంగా 2031 నాటికి భారతదేశం ఒక తిరుగులేని ఆర్థిక శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. తయారీ రంగంలో `మేక్ ఇన్ ఇండియా` వంటి కార్యక్రమాలు.. డిజిటల్ విప్లవం ఆర్థిక లావాదేవీలను సులభతరం చేస్తూ వృద్ధికి బాటలు వేస్తున్నాయి. గ్లోబల్ సప్లై చైన్‌లో చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ ఎదుగుతుండటం వల్ల విదేశీ పెట్టుబడులు (ఎఫ్.డి.ఐ) భారీగా వచ్చే అవకాశం ఉంది. ఈ పరిణామాలు కేవలం ఆర్థిక వృద్ధినే కాకుండా దేశంలో లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పించి... భారతదేశాన్ని ప్రపంచ రాజకీయ, ఆర్థిక నిర్ణయాల్లో కీలక భాగస్వామిగా నిలబెట్టనున్నాయి.
ఈ కోణం మరువకూడదు:
అయితే భారతదేశంలో ఆస్తులన్నీ కేవలం 10-15 శాతం మంది ప్రజల వద్దనే పోగుపడితే, 150 కోట్ల జనాభాలో మిగిలిన 85 శాతం ప్రజలు పేదరికాన్ని అనుభవించాల్సి వస్తోంది. మధ్యతరగతి సమస్యలు ఎప్పటికీ అలానే మిగిలిపోయాయి. గణాంకాలు లెక్కలు ఎలా ఉన్నా.. మూడు పూటలా పుష్ఠిగా భోజనం చేసే ప్రజలు ఎంతమంది ఉన్నారు? అనే దానికి ప్రభుత్వాల నుంచి సరైన సమాధానం లేదని నెటిజనులు వాదిస్తున్నారు.