వేలిముద్రల ప్లేస్ లో అరచేయి.. మరింత ఉపయోగకరంగా కొత్త డివైజ్..

ఈ నేపథ్యంలో కాన్పూర్‌ ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేసిన ‘పామ్‌ సెక్యూర్‌ డివైజ్‌’ కొత్త దిశ చూపుతోంది.;

Update: 2025-10-06 09:30 GMT

నేడు ఏ డిపార్ట్‌మెంట్ చూసినా వేలిముద్రలే ప్రధాన ఆధారం. పుట్టిన శిశువుకు వేలిముద్రలు సరిగా రావు కాబట్టి దాదాపు మూడేళ్ల తర్వాత నుంచి జీవితం చరమాంకం వరకు వేలి ముద్రలే ప్రధానం. బయోమెట్రిక్‌ సాంకేతికత మానవుని జీవనంలో భాగమైంది. ఉద్యోగుల హాజరు నమోదు, బ్యాంకింగ్‌ సేవలు, ప్రవేశ నియంత్రణ వంటి వ్యవస్థల్లో వేలిముద్రల ఆధారిత గుర్తింపు విస్తృతంగా ఉపయోగంలో ఉంది. కానీ ఈ సౌకర్యానికి తోడు సవాళ్లు వచ్చాయి. నకిలీ వేలిముద్రలతో మోసాలు చేయడం.. ప్రింటెడ్‌ ప్యాటర్న్‌ ద్వారా సిస్టమ్‌ను తప్పుదారి పట్టించడం వంటి ఘటనలు భద్రతను కొంత ప్రశ్నార్థకంగా మార్చాయి. ఈ నేపథ్యంలో కాన్పూర్‌ ఐఐటీ పరిశోధకులు అభివృద్ధి చేసిన ‘పామ్‌ సెక్యూర్‌ డివైజ్‌’ కొత్త దిశ చూపుతోంది.

ఇది ఎలా పని చేస్తుంది..

ఈ పరికరం వ్యక్తి అరచేతి రేఖలు, నరాల నమూనాలను విశ్లేషించి గుర్తింపును నిర్ధారిస్తుంది. ముఖ్యంగా ఇది స్పర్శరహిత (కాంటాక్ట్‌లెస్‌) సాంకేతికతతో పని చేస్తుంది. చేతిని కేవలం సెన్సర్‌ ముందు ఉంచితే చాలు.. పరికరం లేజర్‌, ఇన్‌ఫ్రారెడ్‌ టెక్నాలజీల సాయంతో అరచేతిని స్కాన్‌ చేసి ఆ వ్యక్తి వివరాలను భద్రపరుస్తుంది.. తిరిగి చూపిస్తుంది. అదే వ్యక్తి చేతిని చూపినప్పుడు ఆటోమేటిగ్గా పోల్చి యాక్సెస్‌ అనుమతిస్తుంది. ఈ ప్రక్రియలో ఎవరి చేతిని తాకాల్సిన అవసరం లేకపోవడం వల్ల శుభ్రతతో పాటు వైరస్‌ వ్యాప్తి వంటి ప్రమాదాలు కూడా తగ్గుతాయి.

మోసాలకు చెక్..

ఈ డివైజ్ ను రూపొందించిన స్వాతి దీని గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. ‘వేలిముద్రల ఆధారిత వ్యవస్థల్లో జరిగే మోసాలను గమనించిన తర్వాతే ఈ ఆవిష్కరణ ఆలోచన వచ్చింది. పరీక్షల్లో ఇది 99 శాతం కచ్చితత్వాన్ని చూపించింది’ అని చెప్పారు. ఈ పరికరం ధర కేవలం రూ.1500 మాత్రమే కావడం దీన్ని మరింత ప్రజాదరణ పొందేలా చేస్తోంది. చిన్న, చిన్న సంస్థలు, విద్యా సంస్థలు కూడా దీన్ని సులభంగా కొనుగోలు చేయవచ్చు.. వినియోగించవచ్చు కూడా..

పామ్ సెక్యూర్ లో విప్లవాత్మక మార్పు..

పామ్‌ సెక్యూర్‌ (బయోమెట్రిక్ సాంకేతికత) డివైజ్‌ బయోమెట్రిక్‌ రంగంలో విప్లవాత్మక మార్పు తీసుకురాగల సామర్థ్యం ఉంది. ప్రభుత్వ కార్యాలయాలు, రక్షణ సంస్థలు, బ్యాంకులు, పరిశ్రమలు, విద్యా సంస్థలు, హాస్పిటల్స్ వంటి అనేక చోట్ల దీని వినియోగం అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది. అధీకరణ వ్యవస్థలు, హాజరు రికార్డులు, యాక్సెస్‌ కంట్రోల్‌ వంటి భద్రతా కార్యకలాపాలు మరింత పారదర్శకంగా, వేగంగా, సురక్షితంగా మారే అవకాశం ఉంది.

స్వదేశీ మేదస్సుకు సలామ్..

మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమం తీసుకువచ్చారు. దీని ద్వారా అనేక పరికరాలు రూపొందుతున్నాయి. భారత్ డిజిటల్‌ సాంకేతికతలో ముందంజ వేస్తుంది. ఐఐటీ కాన్పూర్‌ ఈ ఆవిష్కరణ స్వదేశీ మేధస్సును ప్రపంచానికి చాటుతోంది. అరచేతి రేఖల ఆధారంగా వ్యక్తి గుర్తింపును సాధించడం ద్వారా ఇది భవిష్యత్‌ బయోమెట్రిక్‌ భద్రతకు కొత్త దారి అని చెప్పవచ్చు. మొత్తంగా, మనిషి అరచేతిలో దాగి ఉన్న రహస్యాన్ని సాంకేతికత సరిగ్గా అర్థం చేసుకున్న ఈ ఆవిష్కరణ, సురక్షితమైన డిజిటల్‌ భారత దిశగా మరొక కీలక అడుగుగా నిలుస్తోంది.

Tags:    

Similar News