అమరావతి క్వాంటం వ్యాలీ.. టెక్ దిగ్గజం ఐబీఎం కీలక ప్రకటన

దేశంలోని తొలి క్యాంటం కంప్యూటరింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్న అమరావతిలో తమ సంస్థ అడుగు పెడుతున్నట్లు ప్రపంచ టెక్ దిగ్గజం ఐబీఎం ప్రకటించింది.;

Update: 2025-08-31 00:30 GMT

దేశంలోని తొలి క్యాంటం కంప్యూటరింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్న అమరావతిలో తమ సంస్థ అడుగు పెడుతున్నట్లు ప్రపంచ టెక్ దిగ్గజం ఐబీఎం ప్రకటించింది. వచ్చే మార్చి నుంచే క్వాంటం కంప్యూటరింగ్ లో అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు ఐబీఎం అడాప్షన్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్ వెల్లడించారు. అమరావతిని టెక్ రాజధానిగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఏప్రిల్ లో క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ లో హైటిక్ సిటీ తరహాలో ఐకానిక్ బిల్డింగ్ నిర్మించేందుకు గాను 50 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ తోపాటు ఐబీఎం, నిర్మాణ పనుల్లో అనుభవం ఉన్న ఎల్ అండ్ టీతో ఒప్పందం కుర్చుకున్నారు. అయితే అమరావతి కేంద్రంతో తమ సంస్థ పనిచేయనుందని ఐబీఎం తొలిసారిగా ప్రకటించడం విశేషంగా భావిస్తున్నారు.

ఐబీఎం ప్రకటనతో అమరావతి రాష్ట్ర రాజధానిగానే కాకుండా దేశానికి క్వాంటం కంప్యూటరింగ్ రాజధానిగా కూడా మారనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఏర్పాటుకానున్న క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కులో వచ్చే ఏడాది మార్చి నాటికి ఐబీఎం తన క్వాంటం కంప్యూటర్ సెంటర్ కార్యకలాపాలను ప్రారంభిస్తుందని చెప్పడమే కాకుండా, ఈ రంగంలో భారత్ బలమైన శక్తిగా ఎదగనుందని, భవిష్యత్తులో క్వాంటం కంప్యూటరింగ్ లో భారీ అవకాశాలు ఉన్నాయని ఐబీఎం వెల్లడించింది. ‘ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్-2’ను ఇన్ స్టాల్ చేయడానికి భారత్ కు చెందిన అతిపెద్ద ఐటీ సేవల ఎగుమతిదారు టీసీఎస్ తో భాగస్వామ్యం కుదర్చుకున్నట్లు ఐబీఎం అడాప్షన్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్ తెలిపారు.

వచ్చే ఏడాది మార్చి నాటికి ఐబీఎం క్వాంటం కంప్యూటరింగ్ పనిచేయనుందన్న ప్రకటనతో అమరావతిపై ఆశలు చిగురిస్తున్నాయి. ఏపీ రాజధానిని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కలలు సాకారం అవుతున్నాయని చెబుతున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సంపద పెరగాలని భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాలెడ్జ్ ఎకానమీపై ఫోకస్ చేశారు. తెలుగు వారు ఎక్కువగా రాణిస్తున్న ఐటీలో కొత్త అవకాశాలు అందిపుచ్చుకునేందుకు అమరావతిలో ఏఐ సిటీతోపాటు క్వాంటం వ్యాలీ, డీప్ టెక్ వంటి కొత్త టెక్నాలజీ సంస్థలను ఏపీకి తీసుకురావాలని భావిస్తున్నారు. ఐటీలో విశాఖను ప్రోత్సహిస్తూనే అమరావతిలో ఏఐ, క్వాంటం వ్యాలీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ఇక ఐబీఎం ప్రకటనతో ముఖ్యమంత్రి ఆశించినట్లు వచ్చే ఏడాది నుంచే దేశంలోని తొలి క్వాంటం కంప్యూటరింగ్ సంస్థకు ఏపీ ఆతిథ్యం ఇవ్వనుందని అంటున్నారు. ఈ రంగంలో ఐబీఎం ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. మొత్తం 9 క్వాంటమ్ కంప్యూటరింగ్ సెంటర్లు ఐబీఎంకు ఉన్నట్లు చెబుతున్నారు. ఇందులో ఒకటి అమెరికా, రెండు జపాన్ ల్లో ఉన్నాయి. దక్షిణకొరియా, కెనడాల్లోనూ ఒక్కో కేంద్రం పనిచేస్తోంది. స్పెయిన్, అమెరికాలో కొత్తగా రెండు సెంటర్లు ప్రారంభించాలని భావిస్తున్న ఐబీఎం వాటితోపాటు భారత్ లోనూ క్వాంటం కంప్యూటరింగ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. సరిగ్గా ఐబీఎం ఆలోచనలను తెలుసుకున్న వెంటనే ఏపీ ప్రభుత్వం సంప్రదించడంతో అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటరింగ్ ఏర్పాటుకు దారులు పడ్డాయని అంటున్నారు.

Tags:    

Similar News