మంత్రి జూపల్లికీ తప్పని ట్రాఫిక్ కష్టాలు!
హైదరాబాద్..పేరుకే విశ్వనగరం..కానీ, గట్టిగా ఓ మోస్తరు వాన పడితే చాలు...సముద్రాన్ని తలపిస్తుందీ భాగ్య నగరం.;
హైదరాబాద్..పేరుకే విశ్వనగరం..కానీ, గట్టిగా ఓ మోస్తరు వాన పడితే చాలు...సముద్రాన్ని తలపిస్తుందీ భాగ్య నగరం. నాలాలపై ఆక్రమణలు...వాగులు, వంకలు, చెరువుల కబ్జాలు కావచ్చు..వరద నీటి ప్రవాహ మార్గంలో అక్రమ కట్టడాలు అవ్వచ్చు...కారణమేదైనా...వర్షం పడుతోందంటే చాలు నగరవాసులకు కంటి మీద కునుకు ఉండదు. వరద నీరు ఇళ్లల్లోకి, సెల్లార్ లలోకి చేరి ఇబ్బంది పడే ప్రజలు కొందరైతే...రోడ్లపై వరద నీరు పొంగిపొర్లడంతో నానా ఇక్కట్లు పడే నగరవాసులు ఎందరో ఉన్నారు. అయితే, ఈ సారి ఆ ఇక్కట్లు పడేవారి జాబితాలో మంత్రి జూపల్లి కృష్ణారావు చేరారు.
ఆదివారం కురిసిన భారీ వర్షం వల్ల రోడ్డుపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో, ఎల్బీనగర్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ క్రమంలోనే నేడు ఉదయం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు ఏరియాలో ఓ వివాహానికి హాజరయ్యేందుకు మంత్రి జూపల్లి బయలుదేరి ఆ ట్రాఫిక్ లో చిక్కుకున్నారు. ఎంత సేపటికీ ట్రాఫిక్ క్లియర్ కాకపోవడం, ముహూర్తానికి సమయం దగ్గర పడుతుండడంతో జూపల్లి కారు దిగి మెట్రో రైల్లో ప్రయాణించారు. ఆయనతోపాటు ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, పలువురు కూడా మెట్రోలో ప్రయాణించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మంత్రయినా...మామూలు పౌరుడైనా హైదరాబాద్ లో వర్షం వల్ల ఏర్పడే ట్రాఫిక్ జామ్ కు బలి కావాల్సిందేనని నెటిజన్లు అంటున్నారు.