102 కేజీలున్న లండన్ మహిళ బరువు తగ్గేందుకు హైదరాబాద్ కు
హైదరాబాద్ అన్నంతనే ఐటీ రంగం గుర్తుకు వచ్చే పరిస్థితి. అయితే.. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాలు భాగ్యనగరానికి సరికొత్త ఇమేజ్ ను తెచ్చి పెడుతున్నాయి.;
హైదరాబాద్ అన్నంతనే ఐటీ రంగం గుర్తుకు వచ్చే పరిస్థితి. అయితే.. ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పలు పరిణామాలు భాగ్యనగరానికి సరికొత్త ఇమేజ్ ను తెచ్చి పెడుతున్నాయి. గడిచిన కొన్నేళ్లుగా పలువురు విదేశీయులు వైద్యం కోసం హైదరాబాద్ కు వస్తున్న వైనం ఎక్కువ అవుతోంది. మెడికల్ టూరిజంకు హైదరాబాద్ అడ్డాగా మారుతోంది. నాణ్యమైన వైద్యంతో పాటు.. అనుభవం ఉన్న వైద్యులు అందుబాటులో ఉండటం.. ప్రపంచ స్థాయి నైపుణ్యాలు నగరంలోని పలు కార్పొరేట్ ఆసుపత్రులు అందిపుచ్చుకోవటంతో ఈ రంగం అంతకంతకూ విస్తరిస్తోంది.
తాజాగా లండన్ కు చెందిన ఒక మహిళ తన బరువు తగ్గించుకోవటం హైదరాబాద్ కు రావటమే కాదు.. శస్త్రచికిత్స చేయించుకొని తిరిగి వెళుతున్న వైనం అందరిని ఆకర్షిస్తోంది. లండన్ లో బ్లాక్ టాక్సీ డ్రైవర్ గా పని చేసే బ్రిటీష్ మహిళకు గచ్చిబౌలిలోని కిమ్స్ ఆసుపత్రి వైద్యులు బేరియాట్రిక్ సర్జరీ చేశారు. ఈ సర్జరీని డాక్టర్ కేశవరెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. ఆయన లండన్ లో దాదాపు 45 ఏళ్ల పాటు బేరియాట్రిక్ సర్జన్ గా పని చేశారు.
102 కేజీలు ఉన్న బ్రిటిష్ మహిళ తన బరువు తగ్గించుకోవటానికి హైదరాబాద్ కు వచ్చారు. కొన్నేళ్ల క్రితం ఆమె స్నేహితురాలికి డాక్టర్ కేశవరెడ్డి ఇదే తరహా సర్జరీ చేయటం.. అది కాస్తా విజయవంతమై.. మంచి ఫలితాలురావటంతోన ఆయన్ను వెతుక్కుంటూ హైదరాబాద్ కు వచ్చారు. ఆమె స్నేహితురాలు 140 కేజీలు ఉండేవారు. సర్జరీ తర్వాత ఆమె 64 కేజీలకు తగ్గారు.
దీన్ని గుర్తించిన బ్రిటీష్ మహిళ అలెగ్జాండ్రియా బరువు తగ్గేందుకు హైదరాబాద్ లో ఉంటున్న డాక్టర్ కేశవరెడ్డి వద్దకు వచ్చారు. ఈ నెల ఆరున ఆమెకు బేరియాటిక్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ప్రస్తుతం ఆరు కేజీల వరకు తగ్గిన ఆమె.. రానున్న ఆర్నెల్ల వ్యవధిలో ముప్ఫై కేజీల నుంచి నలభై కేజీల వరకు తగ్గే వీలుందని చెబుతున్నారు. అయితే.. సర్జరీ తర్వాత చేపట్టాల్సిన తదుపరి చికిత్సల విషయంలో పక్కాగా ఫాలో కావాల్సిందేనని డాక్టర్ కేశవరెడ్డి పేర్కొన్నారు.