హైదరాబాద్ కు ఏమైంది? లగ్జరీ ఇళ్ల గిరాకీ తగ్గటమా?

ముందుకే కానీ వెనక్కి చూడటమన్నది లేదనట్లుగా ఉంది హైదరాబాద్ నగరం ఇటీవల కాలం.;

Update: 2025-07-12 04:30 GMT

ముందుకే కానీ వెనక్కి చూడటమన్నది లేదనట్లుగా ఉంది హైదరాబాద్ నగరం ఇటీవల కాలం. ఏ రిపోర్టు చేసినా.. దూసుకెళుతున్న హైదరాబాద్ తీరుకు భిన్నమైన వివరాలతో తాజాగా ఒక రిపోర్టు బయటకు వచ్చింది. అదేమంటే.. హైదరాబాద్ మహానగరంలో విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది తగ్గుముఖం పట్టిన వైనం బయటకు వచ్చింది. రూ.5 కోట్లు అంతకంటే ఎక్కువ ధరతో ఉన్న విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు తగ్గుముఖం పట్టిన విసయాన్ని సీబీఆర్ఈ.. అసోచామ్ సంయుక్త రిపోర్టు వెల్లడించింది.

గత ఏడాది మొదటి ఆర్నెల్లు(జనవరి - జూన్)తో పోలిస్తే ఈ ఏడాది మొదటి ఆర్నెల్లలో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు తగ్గిన విషయాన్ని రిపోర్టు వెల్లడించింది. గత ఏడాది తొలి ఆర్నెల్లలో 1140 యూనిట్లు అమ్ముడు కాగా.. ఈ ఏడాది మాత్రం 1025 యూనిట్లు మాత్రమే అమ్ముడైనట్లు పేర్కొంది. అదే సమయంలో ఢిల్లీ ఎన్ సీఆర్ మార్కెట్ మాత్రం విలాసవంతమైన ఇళ్ల అమ్మకాల్లో దూసుకెళుతోంది. ఢిల్లీలో లగ్జరీ ఇళ్ల మొత్తాన్ని రూ.6 కోట్లు అంతకు మించిన విలువ ఉన్న వాటినే ప్రాతిపదికగా తీసుకున్నారు

గత ఏడాది మొదటి ఆర్నెల్లలో ఢిల్లీ ఎన్ సీఆర్ లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 1280గా ఉంటే.. ఈ ఏడాది మూడు రెట్లు పెరిగి 3960కు చేరటం విశేషం. దేశంలోని టాప్ 7 నగరాల్లో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 85 శాతం పెరిగినట్లుగా రిపోర్టు పేర్కొంది. గత ఏడాది తొలి ఆర్నెల్లలో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు 3750 యూనిట్లుగా ఉండగా.. ఈ ఏడాది తొలి ఆర్నెల్లలో 6950 యూనిట్లుగా నమోదయ్యాయి. నగరాల వారీగా చూస్తే.. బెంగళూరులో లగ్జరీ ఇళ్ల అమ్మకాలు గత ఏడాది 80గా ఉంటే.. ఈ ఏడాది మొదటి ఆర్నెల్లలో 200 యూనిట్లకు చేరాయి.

చెన్నైలో గత ఏడాది మొదటి ఆర్నెల్లలో 65 యూనిట్లు ఉంటే.. ఈ ఏడాది 220గా నమోదయ్యాయి. పుణెలో గత ఏడాది మొదటి ఆర్నెల్లలో లగ్జరీ అమ్మకాలు 160గా ఉంటే.. ఈ ఏడాది మొదటి ఆర్నెల్లలో 120 యూనిట్లకు తగ్గాయి. కోల్ కతాలో మొదటి ఆర్నెల్లలో 70 యూనిట్లు ఉండగా.. ఈ ఏడాది 190 యూనిట్లు నమోదయ్యాయి. ముంబయిలో గత ఏడాది 950 యూనిట్లు అమ్ముడు కాగా.. ఈ ఏడాది 1240 యూనిట్ల లగ్జరీ ఇళ్లు అమ్ముడయ్యాయి.

Tags:    

Similar News