రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.. హైదరాబాద్ పటాన్ని ఇలా మార్చబోతున్నారా?
20 ఏళ్లలో నగరం విస్తరించిన తీరు చూస్తే ఇది కేవలం భౌగోళిక వృద్ధి కాదు పరిపాలన, జనసాంద్రత, మౌలిక సదుపాయాలు, వనరుల నిర్వహణ అన్నింటి మీద ప్రభావం చూపిన పరిణామం.;
20 ఏళ్లలో నగరం విస్తరించిన తీరు చూస్తే ఇది కేవలం భౌగోళిక వృద్ధి కాదు పరిపాలన, జనసాంద్రత, మౌలిక సదుపాయాలు, వనరుల నిర్వహణ అన్నింటి మీద ప్రభావం చూపిన పరిణామం. ఇలాంటి సమయంలో మరోసారి ‘బృహత్ హైదరాబాద్’ ప్రణాళిక ప్రభుత్వ మెజ్‌పైకి రావడం సహజమే. ఈసారి మాత్రం మార్పులు మరింత పెద్దవి, మరింత వ్యవస్థాత్మకమైనవి, మరింత దీర్ఘకాల ప్రభావంతో కూడినవిగా కనిపిస్తున్నాయి.ప్రభుత్వం ఇప్పటికే గ్రేటర్‌లోకి 27 పట్టణ స్థానిక సంస్థలను (ULBs) కలపాలని మంత్రివర్గ ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 1న అధికారికంగా ఆర్డినెన్స్ విడుదల కానుంది. అంటే హైదరాబాద్ నగర విస్తీర్ణం, పరిపాలనా వ్యవస్థ, నిర్మాణం అన్నీ తిరిగి రూపుదిద్దుకోబోతున్నాయి. ఈ ప్రక్రియ మనకు 2007ను గుర్తు చేస్తుంది. ఎంసీహెచ్ నుంచి జీహెచ్‌ఎంసీగా నగరం భారీగా విస్తరించింది అదే సంవత్సరం. ఆ విస్తరణ ఎలా నగర చరిత్రలో కీలకమైన మలుపు అయితే, ఇదీ అంతేనన్న సంకేతాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మరోసారి భారీ విస్తరణ
ప్రస్తుతం విలీన జాబితాలో 20 మున్సిపాలిటీలు, 7 నగరపాలక సంస్థలు ఉన్నాయి. వీటి విలీనంపై జీహెచ్‌ఎంసీ అధికారులు సీజీజీతో కలిసి ఇప్పటికే ప్రక్రియను సిద్ధం చేశారు. విలీనంతోపాటు పరిపాలనా మార్పులు వెంటనే అమల్లోకి వస్తాయి. విలీన ప్రాంతాలన్నీ గ్రేటర్ కమిషనర్ ఆధీనంలోకి మారుతాయి. 1955 జీహెచ్‌ఎంసీ చట్టం ప్రకారం పరిపాలన కొనసాగుతుంది. 2007లో జరిగిన విలీనం విశాల నగరానికి ఒక కొత్త రూపు తీసుకువచ్చింది. ఎంసీహెచ్ పరిధి 172 చదరపు కిమీ నుంచి 650 చదరపు కిమీకి మారింది. అప్పటి 12 మున్సిపాలిటీలను కలపడం వల్ల జోన్ల సంఖ్య 5 నుంచి 6కు, సర్కిళ్లు 7 నుంచి 18కు తర్వాత 30కి పెరిగాయి. నగర పాలన కొత్త దిశలో నడిచింది. ఇప్పుడు జరుగబోయే కొత్త విలీనంతో నగర పరిమాణం, పరిపాలన మరింత విస్తరించనుంది.
గ్రేటర్‌లోకి 57 సర్కిళ్లు..
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో 30 సర్కిళ్లు ఉన్నాయి. కొత్తగా చేరే 27 సర్కిళ్లతో వాటి సంఖ్య 57కు చేరుతుంది. ఇవన్నీ ప్రస్తుతం ఉన్న ఆరు జోన్లకే అనుసంధానమవుతాయి. రెండు నెలల తర్వాత జోన్ల సంఖ్య పెరగడం కూడా సాధ్యమే. పెద్ద నగరాల్లో పరిపాలన వ్యవస్థ ఎంత వైవిధ్యంగా ఉండాలన్నదానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు కాని ఈసారి నిర్ణయాలు వేగంగా తీసుకోబోతున్నాయన్న భావన స్పష్టంగా ఉంది. సీజీజీ నివేదిక ఈ విషయాల్లో కీలక పాత్ర కానుంది. నగర పరిమాణం పెరగడం వల్ల అవసరమయ్యే అధికారులు, వారి హోదాలు, బాధ్యతలు, విభాగాల నిర్మాణంతో పాటు అన్ని విషయాల్లో మార్గదర్శకాలు త్వరలో ప్రభుత్వం పొందబోతోంది.
ఒకే నగరమా? లేక విభజననా?
ఈ విలీనం తర్వాత వచ్చిన పెద్ద చర్చ ఇదే భవిష్యత్ బృహత్ హైదరాబాద్ ఒకే నగరంగా కొనసాగాలా? లేక రెండు, మూడు నగరపాలక సంస్థలుగా విభజించాలా? అనేది.
విభజనకు అనుకూలంగా చెప్పబడుతున్న కారణాలు:
*విస్తరించిన భౌగోళిక పరిమాణంలో సమర్థవంతమైన పరిపాలన
*ప్రాంతీయ అవసరాల ఆధారంగా మెరుగైన సేవలు
*జనసాంద్రత, వనరుల సమాన పంపిణీ
*ఒకే నగరంగా ఉంచాలని భావిస్తున్నవారి వాదన
*ఒకే పరిపాలనతో సమగ్ర అభివృద్ధి
*సమన్వయంతో ఉన్న మౌలిక వసతుల ప్రణాళిక
*మెగా సిటీలకు అవసరమయ్యే సమగ్రత
సీఎం రేవంత్ రెడ్డి ఈ రెండు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాబట్టి ఈ నిర్ణయం కేవలం పరిపాలనా మార్పు కాదు.. రాజకీయ, నగరాభివృద్ధి, దీర్ఘకాల ప్రణాళికతో పాటు అన్నింటినీ ప్రభావితం చేసేది.
ఇప్పుడు గ్రేటర్ విస్తరణ అవసరం?
దేశంలో పట్టణాలను పరిశీలిస్తే హైదరాబాద్ వేగంగా పెరిగిన నగరాల్లో ఒకటి. ఐటీ, ఔషధ, కమర్షియల్ రంగాల్లో వ్యాపారాలు విస్తరించడంతో నగర పరిసరాలు కూడా వేగంగా మారుతున్నాయి. శివారు ప్రాంతాలు నగర జీవనశైలిలో భాగమవుతున్నాయి. మౌలిక సదుపాయాల విస్తరణ అవసరం పెరుగుతోంది. పట్టణీకరణ శాతం పెరిగి, పరిసర గ్రామాలన్నీ పక్క నగరాల్లా మారుతున్నాయి. మున్సిపాలిటీలకు అవసరమైన వనరులు, సిబ్బంది తక్కువగా ఉండడం వల్ల సేవలు నాణ్యత కోల్పోతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద నిర్ణయం అవసరమైంది.
బృహత్ హైదరాబాద్ మరోసారి రూపుదిద్దుకోబోతోంది
డిసెంబర్ 1తో విలీనం ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైతే హైదరాబాద్ మళ్లీ ఒక కొత్త పరిపాలనా పటం రూపుదిద్దుకుంటోంది. నగరాభివృద్ధి, మౌలిక వసతులు, సేవల నాణ్యత అన్నింటిపై దీర్ఘకాల ప్రభావం ఉండబోతోంది.